తమిళనాడు అంతా అమ్మమయం..!!

ఏ పథకమైనా అమ్మ పేరుతోనే

0

ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా, ఏ కార్యక్రమమైనా అన్నీ అమ్మ పేరుతోనే. పేదల ఆకలి తీర్చడం మొదలు.. అమ్మాయిల పెళ్లి వరకు ప్రతి విషయంలోనూ అమ్మలాగే ఆదరించింది. ప్రచారం కోసం కాకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసింది. అందుకే అమ్మంటే తమిళులకు అంత ప్రేమ.

తమిళనాడు అనగానే అందరికీ గుర్తొచ్చేది అమ్మ... ఆమె ప్రవేశపెట్టిన పథకాలే. వరుస విజయాలతో పాలనలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టడమే గాక, వాటిని సక్రమంగా అమలుచేస్తూ జనాల మనసుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నారు జయలలిత. తమిళనాడులో ఏ పథకం రూపొందించినా, ఏ కార్యక్రమం అమలు చేసినా అన్నీ అమ్మ పేరుతోనే. అయితే ఇందులో ప్రచార ఆర్భాటం కన్నా... ప్రజా సంక్షేమమే ప్రాధాన్యంగా కనిపిస్తుంది. అమ్మ బ్రాండ్‌ పథకాల గురించిన ప్రస్తావన వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది అమ్మ క్యాంటీన్‌. తక్కువ ధరకే టిఫిన్‌, భోజనం అందించి పేదవాడి ఖాళీ కడుపు నింపడమే ఈ పథకం లక్ష్యం. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో అమ్మ క్యాంటీటన్లలో ప్లేటు ఇడ్లీ రూపాయి, పెరుగన్నం మూడు, సాంబారన్నం ఐదు రూపాయలే అందిస్తూ జనం ఆకలి తీరుస్తున్నారు. ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ఇలాంటి పథకాలనే అమలుచేస్తున్నాయంటే అమ్మ క్యాంటీన్లకున్న ఆదరణ గురించి తెలుసుకోవచ్చు.


అమ్మ కుడినీర్‌. దాహంతో ఉన్నవారి దప్పిక తీర్చడమే ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీంలో భాగంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ను 10 రూపాయలకే అందిస్తూ జనం దాహం తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు కొత్త పథకాలు ప్రకటించిన జయ.. పాలనాపగ్గాలు అందుకున్నాక వాటిని అమలు చేయడమే కాదు.. కొత్తవాటినీ ప్రవేశపెట్టి జనానికి మరింత దగ్గరయ్యారు. పేదవాడి సొంతింటి కల నిజం చేసుకునేందుకు తనవంతు సాయం అందించారు. అమ్మ సిమెంట్‌ స్కీంతో అతి తక్కువ ధరకే సిమెంట్‌ అందించి ఇంటి నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించారు. ఇక పెరిగిపోతున్న మందుల ధరలతో ప్రజలు ఇబ్బంది పడకూడదని తక్కువ ధరలకే వాటిని అందించేందుకు అమ్మ మెడికల్‌ షాపులు అందుబాటులోకి తెచ్చారు. అంతేకాదు... కూరగాయలు, పండ్ల దుకాణాలు, కిరాణా షాపులు, చివరకు ఉప్పును కూడా అమ్మ బ్రాండ్ తో తక్కువ ధరకే అందించి ప్రతి ఒక్కరి కడుపు నింపే ప్రయత్నం చేశారు. పేదలు తలదాచుకునేందుకు నీడ కల్పించాలన్న ఉద్దేశంతో పురిచ్చితలైవి 18వందల కోట్ల వ్యయంతో అమ్మ పేరుతో 50వేల ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు.ఇవన్నీ సబ్సిడీ పథకాలైతే అమ్మ అమలుచేస్తున్న ఉచిత పథకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేద కుటుంబాలకు ఇంటికి 20 కిలోల బియ్యం, పింఛను తీసుకుంటున్న వృద్ధులకు నెలనెలా 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తోంది జయ ప్రభుత్వం. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు మేకలు, గొర్రెలు, బర్రెలు పంపిణీ చేసి వారికి బతుకుదారి చూపారు. ఫ్రీ వైఫై, చెన్నైలో సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్‌ పాస్‌లు, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు నోటుబుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌, బ్యాగ్‌, షూ, యూనిఫాం, సైకిల్‌, ల్యాప్‌టాప్‌లు అందించారు. విద్యార్థినులకు ప్రత్యేకంగా నేప్‌కిన్స్‌, బస్‌ పాస్ సౌకర్యం కల్పించారు. ఇక మహిళలకు ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, సెల్‌ఫోన్లు ఇవ్వడమే కాకుండా.. గర్భిణుల ఆరోగ్యంపైన అమ్మ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వారు పండ్లు, పౌష్టికాహారం తీసుకునేందుకు 12వేల రూపాయల నగదు అందించడమే కాకుండా అప్పుడే పుట్టిన బిడ్డకు అవసరమయ్యే వస్తువులతో అమ్మ బేబీ కిట్‌ను అందిస్తున్నారు.

అమ్మ సీడ్స్‌ పథకం ద్వారా తక్కువ ధరకే రైతులకు సర్టిఫైడ్‌ క్వాలిటీ విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి తెలిపేందుకు వారికి అవసరమైన సమాచారం అందించేందుకు అమ్మ కాల్‌సెంటర్‌లను ప్రారంభించిన జయ.. పనిలో పనిగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. మనిషి జీవితంలో భాగమైపోయిన వినోదానికి ఎవరూ దూరం కావొద్దన్న ఉద్దేశంతో అమ్మ సినిమా స్కీంను ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏసీ థియేటర్లు నిర్మించి కేవలం 25 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పించారు. సవర బంగారం పథకంలో భాగంగా అమ్మ ప్రభుత్వం అవివాహిత పేద యువకుల పెళ్లిక 50వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు 8 గ్రాముల బంగారం అందిస్తోంది. అమ్మ బ్రాండ్‌ పథకాల్లో ఈ మధ్యే చేరిన మరో స్కీం అమ్మ కల్యాణ మండపాలు. ఆర్థిక స్థోమతలేనివారు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుపుకునేందుకు కల్యాణ మండపాల అద్దెలు భరిచలేకపోతున్నారని తెలుసుకున్న అమ్మ.. అలాంటి వారి కోసం అమ్మ కల్యాణ మండపాల నిర్మాణానికి పూనుకున్నారు. ఈ పథకాలన్నీ అన్నాడీఎంకేకి ఎంతో ప్రచారం కల్పించాయి.

Related Stories