పదిహేడేళ్లకే స్మార్ట్‌వాచ్ తయారు చేసిన కుర్రాడు..!

0


రెండు పదులు దాటలేదు. అప్పుడే జీవితాన్ని మొత్తం చదివేశాడు. ఆటలు ఆడుకోవాల్సిన వయస్సులోనే సామాజిక సేవ. లైఫ్ ఎంజాయ్ చేయడం బదులు లైఫ్ గురించి పెద్దోళ్లకు పాఠాలు చెప్తున్నాడు. తన కలనెరవేర్చుకునేందుకు కాలేజీకి చదువుకీ కామా పెట్టేశాడు. అతని ధైర్యమే కొండంత అండ. చేయాలనుకున్నది చేసేయడమే అతని ఫిలాసఫీ. ఇలా ఒకటా... రెండా ఈ పాట్నా కుర్రాడు సిద్ధాంత్ వత్స్ నుంచి మనం ఇంకా ఎంతో నేర్చుకోవాలి.

ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు మనకు అర్థమైపోతుంది ఇతగాడు ఆషామాషీ యువకుడు కాదని. ఉత్సాహం కట్టలు తెగుతూ ఉంటుంది. అతడి ఆలోచనలను పట్టుకోవడం అంత సులువైన వ్యవహారమేమీ కాదు. మనం ఒకటి ఆలోచించాలి అని అనుకునేలోపు... సిద్ధాంత్ పది ఆలోచించి.. అందులో మూడో, నాలుగో అప్పుడే మొదలుపెట్టేసి ఉంటాడు. అదీ.. అతడి స్టైల్. కలలను ఎలా సాకారం చేసుకోవాలి అని తప్ప ఇక దేనిగురించి ధ్యాసే ఉండదు. అంతే కాదు తన కల నిజం చేసుకునేందుకు స్కూలుకు కూడా డుమ్మా కొట్టేశాడు. ' నేను చేసిన ఈ పనికి నా తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇప్పటికీ నా పనులకు అలా నిర్ఘాంతపోతూనే ఉన్నారు' అంటూ నవ్వేస్తాడు సిద్ధాంత్.

నేను డ్రీమ్ బాయ్ ని కాదు.. డ్రీమర్ !

అతడు డ్రీమర్. నిత్యం కలల సాకారం కోసం తపిస్తూ, శ్రమిస్తూ ఉండే నైజం. అదే అతడి ప్రత్యేకత. ఆ వైవిధ్యమే నలుగురిలోభిన్నంగా చూపిస్తుంది, అతడిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా మార్చింది. రిస్క్ తీసుకోవడమంటే అతడికి రస్క్ తిన్నంత ఈజీ. ఆ మాటకు వస్తే.. అది అసలు దేన్నీ రిస్క్ అని అంగీకరించడు. సినిమాల్లో హ్యాపీ ఎండింగ్ ఉన్నట్టు అంతా సాఫీగా సాగిపోతుందనేది అతడి బలమైన నమ్మకం. మనకు నచ్చినట్టు జరగనంతవరకూ అసలు సినిమా అయిపోదు కదా ? (పిక్చర్ అబీ బాకీ హై దోస్త్). నిబంధనల చట్రం గీసుకుని అందులో బతకడం సిద్ధాంత్ కు ఇష్టం లేదు. తనకు నచ్చిందే చేశాడు. అలా అని తెగించలేదు. మనస్సును సమాధానం చెప్పుకున్నాకే ముందుకు కదిలాడు.

పబ్బుల్లో కాదు.. సిఈఓ క్లబ్ లో !

అపూర్వ సుకాంత్ సహా మరో ఇద్దరితో కలిసి 'ఆండ్రాయిడ్లీ సిస్టమ్స్' పేరుతో సిద్ధాంత్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అప్పుడు అతని వయస్సు పదిహేడేళ్లు. అవును జస్ట్ 17 ఇయర్స్. ప్రపంచంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ రూపకల్పనే చేయడమే వీళ్లందరి ధ్యేయం. ఆ వాచ్ తో ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు, వాట్సాప్ సౌలభ్యం, మ్యూజిక్ వింటూ ఫోటోలు కూడా క్లిక్ మనిపించవచ్చు. ఫోన్ చేసే అన్నీ పనులూ ఈ స్మార్ట్ వాచ్ చేస్తుంది. కేవలం 220 డాలర్లు (సుమారు రూ.13500) ఉండే ఈ వాచ్ 2013 నుంచి 110 దేశాల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. తర్వాతి వర్షన్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విడుదల అయింది. పాత దానిలా కాకుండా కొత్త వర్షన్ నార్మల్ వాచ్ లానే ఉంటుంది. సాధారణ ఫ్యాషన్ యాక్సెసరీలా దీన్ని వాడుకోవచ్చు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసిన ఈ బృహత్తర ప్రాజెక్టును వాస్తవ రూపం తెచ్చేందుకు సిద్ధాంత్.. రెండేళ్లపాటు హైస్కూలు చదువును వాయిదా వేసుకున్నాడు.

ఎనిమిదేళ్లకే ఎన్జీఓ !

విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో తమకు తోచిన సేవలను అందించేందుకు సిద్ధాంత్ తల్లి... ఫాలక్ ఫౌండేషన్ ను స్థాపించారు. సిద్ధాంత్ ఏడో తరగతిలో ఉన్నప్పుడే ఆ ఫౌండేషన్ ద్వారా బేసిక్ కంప్యూటర్స్ స్కిల్స్ ను విద్యార్థులకు బోధించాడు. ఆంగ్లం, లెక్కల్లో ఇబ్బందిపడ్తున్న పేద విద్యార్థులకు బాసటగా నిలిచి వాళ్ల అనుమానాలన్నీ నివృత్తి చేశాడు. కొడుకు సమర్ధతను గుర్తించిన తల్లి ఆ చిన్నవయస్సులోనే రక్తదానశిబిరాలకు, ఆరోగ్య మేళాల బాధ్యతలను అప్పగించారు.

వర్జీనియాకు చెందిన ఓ స్వచ్ఛంద మత సంస్థ ద్వారా భారీ నిధులను సమీకరించి బుద్ధగయలో అంతర్జాతీయ శరణార్థి శిబిరాన్ని నిర్మించాడు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అప్పట్లోనే వెయ్యి మంది విదేశీ డెలిగేట్లు ఎక్కడెక్కడి నుంచో బీహార్ వచ్చారు. తన ప్రయత్నం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పర్యాటక రంగ వృద్ధికి ఎంతో కొంత దోహదపడ్తుందనేది సిద్ధాంత్ బలమైన నమ్మకం.

చేతలే కాదు.. మాటలు కూడా !

ఉట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిపనులు చేపట్టవోయ్ అంటారు. కానీ ఆ పనులను చేస్తూనే... ఎంతో మందికి తన మాటలతో స్ఫూర్తిని ఇస్తూ ఉంటాడు సిద్ధాంత్. ఇప్పటివరకూ దాదాపు 100కు పైగా సభలు, సమావేశాల్లో ప్రసంగించాడు. వీటిల్లో టెడ్ ఎక్స్, హొరాసిస్ బిజినెస్ మీట్ వంటి ప్రముఖమైనవి ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 100 బిజినెస్ ఇనోవేటర్స్ లిస్టులో నామినేట్ అయిన సందర్భంగా అతడు చెప్పిన మాటలు అక్కడున్న వాళ్లను ఎంతో ఆలోచింపజేశాయి. అంతే కాదు బిల్ గేట్స్ తో కలిసి బిగ్ ఐఎఫ్ వేదిక మీదా అనర్గళంగా మాట్లాడి ఔరా అనిపించాడు.

సిద్ధాంత్ అద్భుత వ్యాపార దక్షతను ప్రశంసిస్తూ భారత ప్రధాని కార్యాలయం అవార్డును బహూకరించింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా అయితే ఓ సందర్భంలో వైట్ హౌజ్ కు ఆహ్వానం పలికారు.

ఒకే పనిచేయలేను !

'ఏ పనైనా సరే ఎక్కువ కాలం చేయలేను, అందులో నాకు ఆనందం ఉండదు' అంటాడు సిద్ధాంత్. అందుకే కొత్త కలలను కంటాను, వాటిని సాధించేందుకు పరిగెడ్తూనే ఉంటాను. ఏదైనా అనుకుంటే చేసేస్తాను. నా దగ్గరున్న ఆలోచలన్నీ సాకారం చేసేందుకు నాదగ్గర అవసరానికి మించినంత సమయం ఉందనేది నా నమ్మకం.

బంధువులంటే భయం !

భారత్ లాంటి దేశంలో ఏదైనా చేయాలంటే భయం. ఎందుకంటే బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మనల్ని వెనక్కిలాగుతూ ఉంటారు. మన ఆలోచన దేనికీపనికిరాదు అంటూ మొదట్లోనే నిరుత్సాహపడేలా చేస్తారు. ఒక్కోసారి మనతో కలిసి మన టీమ్ లో ఉన్న వాళ్లు కూడా వంద వంకలు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. 'ఎంతసేపూ అది సరైన ఆలోచన కాదంటారు కానీ.. సరైంది ఏదో చెప్పరు' అంటాడు సిద్ధాంత్.

నాయకత్వ సమ్మేళనమే నా లక్ష్యం !

అంతర్జాతీయ స్థాయిలో ఓ వేదిక ఏర్పాటే ఇప్పుడు అతడి లక్ష్యం. రంగం ఏదైనా సరే... అందులో నైపుణ్యం ఉన్నవాళ్లు ఇతరులను ప్రోత్సహించేందుకు వీలుగా వేదిక ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. టెడ్ ఎక్స్ తరహాలో దీన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే దీన్ని స్కూళ్లు, కాలేజీలకు కూడా తీసుకెళ్లి అందరితో మమేకం కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు.

సిద్ధాంత్ తన గమ్యాన్ని చేరేందుకు మీరూ తోడ్పడండి. మీ ఆలోచనలను ట్విటర్లో @siddhantvats తో పంచుకోండి.