నిధుల సేకరణలో నేర్చుకోవాల్సిన పాఠాలు

నిధుల సేకరణలో నేర్చుకోవాల్సిన పాఠాలు

Friday September 18, 2015,

5 min Read

జీవితంలో విజయం సాధించాలంటే విజేతల విజయగాథలు కాదు చదవాల్సింది. ఓటమిపాలైన వారి జీవితాలు చదవాలి. విజేత కేవలం ఎలా గెలిచానని మాత్రమే చెప్పగలడు. కానీ ఓడిపోయినవాడు ఎందుకు ఓడిపోయానో, ఏం తప్పులు చేశానో చెబుతాడు. ఆ ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నానో వివరిస్తాడు. ఆ గుణపాఠాలే విజయానికి సరైన బాటలు వేస్తాయి. ఏ స్టార్టప్‌కైనా ఫండింగ్ అనేది కీలక ఘట్టం. కంపెనీని మరింతగా అభివృద్ధి చేయడానికి నిధుల సేకరణ చాలా ముఖ్యం. ఫస్ట్ రౌండ్ ఫండింగ్‌లో తాను చేసిన తప్పులేంటో, తానెలా విఫలమయ్యానో భావి వ్యాపారవేత్తలకు వివరిస్తున్నారు షిప్ నింజా కో-ఫౌండర్ ముబాయిద్ సయ్యద్. నిధుల సేకరణలో ఆయనకు తలెత్తిన ఇబ్బందులేంటీ ? చేతిదాకా వచ్చిన నిధుల్ని ఎలా కోల్పోయారు ? గడపదాకా వచ్చిన ఇన్వెస్టర్ వెనక్కి వెళ్లిపోవడానికి కారణమేంటీ ? సయ్యద్ మాటల్లోనే తెలుసుకుందాం...

"నమస్తే... ఆఫర్ ఇంకా టేబుల్ పైనే ఉందో లేదో నేను తెలుసుకోవచ్చా" అంటూ నేను ఇన్వెస్టర్‌కు మెసేజ్ చేసి నా ఫోన్ పక్కన పెట్టేశా. నా ల్యాప్ టాప్ ఆన్ చేశాను. పెట్టుబడిదారుడి నిర్ణయంలో మార్పు ఉంటుందని నాకెందుకో అనిపించింది. కానీ అలాంటి బాధాకరమైన రిప్లై రాదని నేను నమ్మకంతో ఉన్నాను. ఏదో అద్భుతం జరుగుతుందని నాకనిపించింది. నేను ల్యాప్ టాప్‌లో ఫేస్ బుక్ చూస్తూ ఉన్నా... నా మనస్సంతా నా ఫోన్ పైనే ఉంది. ఇంకా రిప్లై రాలేదు. నేను ఫేస్ బుక్ చూస్తూ ఉన్నాను. 'ఫలానా ఐఐటి-ముంబై పూర్వ విద్యార్థులు ఫలానా ఇన్వెస్టర్ నుంచి మిలియన్ డాలర్ల నిధులు సేకరించారు', 'ముగ్గురు ఢిల్లీ ఐఐటి విద్యార్థులు మరో ఇన్వెస్టర్ నుంచి రెండో రౌండ్ ఫండింగ్ సాధించారు' లాంటి యువర్ స్టోరీ, Inc42 పోస్టులతో నా ఫేస్ బుక్ అంతా నిండిపోయింది. ఇవన్నీ చూస్తుంటే నన్ను ఐఐటీలో చేరమని నాకు ఎవరూ ఎందుకు సలహా ఇవ్వలేదు అనిపించింది.

ఇంతలో 'టింగ్' అని శబ్ధం. చుట్టూ అంతా నిశబ్ధం. నేను ఆ మెసేజ్ చదివాను. "రిస్క్ ఎక్కువ అని మాకు అనిపిస్తోంది. అందుకే ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదని మేం నిర్ణయించుకున్నాం" ఇదీ ఇన్వెస్టర్ నుంచి వచ్చిన సమాధానం.
image


ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. ఉన్నట్టుండీ మేం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాం. ఒకట్రెండు రోజులు కాదు... రెండు నెలల నుంచీ చర్చలు జరుగుతున్నాయి. ఇన్వెస్టర్ నుంచి మాకు కమిట్‌మెంట్ వచ్చిందన్న ధీమాతో మేం అన్నీ సిద్ధం చేసుకున్నాం. మార్కెటింగ్ ప్లాన్ సిద్ధమైంది. కొత్త ఉద్యోగుల్ని నియమించుకున్నాం. భారీ సంఖ్యలో టీ-షర్ట్స్ కూడా ఆర్డర్ చేశాం. మాకు కావాల్సిందల్లా ఇన్వెస్టర్ నుంచి నిధులు రావడమే. కానీ ఇన్వెస్టర్ చివరి నిమిషంలో అకస్మాత్తుగా చేతులెత్తేశారు. అసలు ఇన్వెస్టర్ ఎందుకు అకస్మాత్తుగా మనసు మార్చుకున్నారో తెలుసుకునేందుకు ఒకరికొకరం 30 నిమిషాల పాటు మెసేజ్ చేసుకున్నాం. కానీ లాభం లేదు.

"మీ సంసిద్ధతను నమ్మి మేం అన్నీ సిద్ధం చేసుకున్నాం. కానీ ఇంత అకస్మాత్తుగా మీరు ఎందుకు నిర్ణయం మార్చుకున్నారో నాకు అర్థం కావట్లేదు. పునరాలోచించండి అని నేను బలవంతపెట్టట్లేదు. కానీ నా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. నేను ఇండియాలో నా టీ-షర్ట్ బ్రాండ్‌కి మంచి పేరు తీసుకురాగలను. ఫండింగ్ ఉంటే ఆ లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలను. ఫండింగ్ లేకపోతే ఇంకొంత సమయం పట్టొచ్చు. కానీ ఎప్పటికైనా అది ఖచ్చితంగా జరుగుతుంది" అని చివరి మెసేజ్ పంపించాను.

ఎంతో నిరాశ చెందాం. మాకు వచ్చే ఫిండింగ్ ఆధారంగా ఏమేమో చేయాలని ఎన్నో ప్రణాళికలను రూపొందించుకున్నాం. ప్యారడైజ్ రెస్టారెంట్‌లో కూర్చొని... చికెన్ బిర్యానీ జంబో ప్యాక్ ఆర్డర్ చేసి... నేను నా పార్ట్‌నర్ కలిసి కొన్ని గంటల పాటు చర్చించాం. ఎక్కడ తప్పు జరిగింది ? ఎలా తప్పటడుగులు వేశాం ? భవిష్యత్తులో ఏం చేయాలి ? మా చర్చంతా ఇదే. నిధుల సేకరణలో నా తొలి వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలివే.

1. మీకు నిజంగా ఇన్వెస్టర్ అవసరం ఉందా ?

మీ అంతిమ లక్ష్యం ఏంటనే దాని గురించి బాగా ఆలోచించండి. ఇప్పుడున్న కంపెనీని నిర్వహిస్తూ, లాభాల్లో నడిపిస్తూ మీరు సంతోషంగా ఉన్నారా ? అయితే నిధుల సేకరణ గురించి మీరు అస్సలు ఆలోచించకండి. అందరూ ఫండ్స్ వెంట పరిగెత్తుతున్నారని మీరూ అలా చేయకండి. మీ అంతిమ లక్ష్యం సాధించడంలో నిధుల కొరత ఉందని అనిపించినప్పుడు, ఆ నిధుల్ని మీరు స్వయంగా సేకరించలేకపోతున్నాం అనిపించినప్పుడు మాత్రమే ఇన్వెస్టర్ గురించి ఆలోచించండి.

2. నిధుల సేకరణ వ్యాపారంలో భాగమే

మేం వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్నప్పుడు నిధుల సేకరణపై ఎక్కువగా దృష్టిపెట్టాం. దీంతో చక్కగా సాగుతున్న వ్యాపారాన్ని పట్టించుకోలేదు. నిధుల సేకరణకు చాలా సమయం, శక్తి వృథా అవుతుంది. ఆ సమయాన్ని, శక్తిని వ్యాపారాభివృద్ధి కోసం ఉపయోగించొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఒకరికంటే ఎక్కువ కో-ఫౌండర్ ఉంటే వారిలో ఒకరు నిధుల సేకరణపై దృష్టిపెట్టాలి. మరొకరు వ్యాపారాభివృద్ధి చూసుకోవాలి. ఎందుకంటే నిధుల సేకరణ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పలేం. కానీ నిలకడగా సాగుతున్న వ్యాపారం మిమ్మల్ని రేసులో ముందుంచుతుంది.

3. 'నచ్చారు' అని చెప్పగానే పెళ్లికి సిద్ధమవకండి !

మాకు ఇన్వెస్టర్ నుంచి కమిట్మెంట్ రాగానే నిధుల సేకరణకు చేస్తున్న మిగతా ప్రయత్నాల్ని ఆపేశాం. వచ్చే నిధులతో మా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైనే మా సమయాన్నంతా వృథా చేశాం. వ్యాపారాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో మాకు వచ్చే ఆర్డర్ల సంఖ్య నెమ్మదిగా తగ్గింది. అయినా మేం పెద్దగా పట్టించుకోలేదు. మాకు ఫండ్స్ వస్తాయన్న ధీమాతో దూకుడుగా మార్కెటింగ్ చేయాలని, ఏవేవో మార్పులు చేయాలని కలలు కన్నాం. అదే మేం చేసిన తప్పు. అలా వ్యాపారంలో వెనకబడిపోయాం. చివరికి ఇన్వెస్టర్ వెనుకడుగు వేశారు. కారణమేంటంటే మా వ్యాపారాభివృద్ధి నెమ్మదిగా తగ్గుముఖం పట్టడమే.

4. ఆచితూచి ముందడుగు

ఇన్వెస్టర్‌పై పూర్తిగా నమ్మకం కలిగే వరకూ మీ కంపెనీ గురించి, ప్రణాళికలు, వ్యాపారాభివృద్ధి వ్యూహం, పోటీదారులు లాంటి వివరాలన్నింటినీ పంచుకోకండి. మేం చేసిన మరో తప్పు అది. మా వివరాలన్నీ వారికి చెప్పేశాం. మా ప్రధాన పోటీదారులెవరో చెప్పాం. వాళ్లు ఎంత సంపాదిస్తున్నారో చెప్పాం. ఇన్వెస్టర్ వెనుకడు వెయ్యడానికి ఇవి కూడా కారణాలు కావచ్చు.

5. ఈ బంధం ఎప్పటివరకు ?

ఇన్వెస్టర్ మీతో ఎన్నాళ్లు కలిసుండాలని అనుకుంటున్నారో కనుక్కోవాలి. ఇలా అడగడంలో ఏమాత్రం తప్పులేదు. మీరుగానీ, పెట్టుబడిదారుడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కంపెనీ నుంచి వెళ్లాలనుకుంటున్నారో ముందే చర్చించుకోవాలి. ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు కంపెనీని అమ్మేద్దామని ఇన్వెస్టర్ అనుకుంటారు. కానీ కంపెనీని అలాగే ఉంచాలని మీరు అనుకుంటే ఇబ్బందులొస్తాయి. అందుకే ఈ విషయాలన్నీ ముందే చర్చించుకోవడం మంచిది.

6. అంతా డబ్బు డబ్బు డబ్బే !

కంపెనీకి నిధులు సేకరించడం, ఇన్వెస్టర్‌ని భాగస్వాముల్ని చేయడం వినడానికి బాగానే ఉంటుంది. కానీ అదీ ఓ బిజినెస్ డీల్ లాంటిదే. పెట్టుబడిదారులు మంచి రాబడుల కోసం ఆలోచిస్తారు. మీరేమో వేగంగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తారు. ఇలాంటి సమయంలో మీ ఒప్పందం చెక్ బుక్ తోనా? మంచి భాగస్వామితోనా? అన్నది ఆలోచించుకోవాలి. మా డీల్ రద్దు చేసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ అది కేవలం ఓ బిజినెస్ డీల్ అని నేను అప్పుడే నా మనసులో అనుకున్నాను. మాతో కలిసి నడవడంలో రిస్క్ ఉందో, లేక మరో మంచి ఆఫర్ వచ్చిందో, లేక ఆలోచనలు మార్చుకున్నారో తెలియదు. అలాగని వారిని నిందించలేం. అందుకే నిలకడగా వృద్ధి చెందుతున్న వ్యాపారంపై దృష్టి పెట్టడం అత్యవసరం. అలా అయితేనే నిధులు సేకరించాలన్న మీ ప్రయత్నాలు ఫలించకపోయినా మీకేమీ ఇబ్బంది ఉండదు.

7. పూర్తిగా అయ్యే వరకు పూర్తయిపోయిందని అనుకోవద్దు !

మాకు వచ్చిన మిగతా ఆఫర్లను పట్టించుకోకపోవడం మేం చేసిన పెద్ద తప్పు. మాకు మొదటి కమిట్‌మెంట్ వచ్చినప్పుడు ఇదే ఫైనల్ అని ఇన్వెస్టర్ చెప్పారు. ఇక వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రాథమిక కమిట్‌మెంట్ తర్వాత మిగతా ఇన్వెస్టర్లు కూడా మమ్మల్ని అడిగారు. కానీ మేం సున్నితంగా తిరస్కరించాం. మొదటి ఇన్వెస్టర్ చివరి నిమిషంలో చేతులెత్తేశారు. అందుకే నిధులు వచ్చేవరకు ప్రక్రియ పూర్తి కాదని గుర్తుపెట్టుకోండి.

8. శుభం కార్డు అప్పుడే పడలేదు !

ఇన్వెస్టర్ నో చెప్పగానే మేం చాలా డీలా పడిపోయాం. మేం ఓడిపోయామనిపించింది. ఇక కంపెనీని అమ్మేద్దాం అనే ఆలోచనలు బుర్రలో చక్కర్లు కొట్టాయి. కానీ మేం అలా చేయలేదు. నిధుల సేకరణ ప్రయత్నాలు సఫలం కాలేదా ? అయినా ఏం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నిధుల సేకరణ కోసమని మీరు కంపెనీ ప్రారంభించలేదు కదా ! నిధుల సేకరణ అనేది మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ఓ కార్యాచరణ మాత్రమే. మీ వ్యాపారం చిన్నదైనా సరే దాన్ని నిలకడగా ఉంచడంపైనా, అభివృద్ధి చేయడంపైనా, లాభాల్లో నడిపించడంపైనా దృష్టి పెట్టండి.

చివరగా నా అనుభవం నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే... నిధుల సేకరణ అనేది వ్యాపారంలో భాగం తప్ప, అదే వ్యాపారం కాదు. కాకూడదు.

రచయిత:

ముబాయిద్ సయ్యద్, షిప్ నింజా(http://shipninja.com) కో-ఫౌండర్. ప్రముఖ టీ-షర్ట్ బ్రాండ్ అయిన LazyNinja.in సయ్యద్ మొదటి వెంచర్.