చేతుల్లేకపోతేనేం..కాలి వేళ్లతో కళాఖండాలు సృష్టిస్తున్న స్వప్న!!

0

చేతులు లేవ‌ని అధైర్య‌ప‌డ‌లేదు. అంద‌రిలా అన్ని ప‌నులు చేసుకోలేన‌ని డీలాప‌డిపోలేదు. ఆత్మ‌విశ్వాస‌మే త‌న ఆయుధంగా చేసుకుంది. ప‌ట్టుద‌ల ఉంటే ఏదైనా చేయొచ్చ‌ని చిన్న‌త‌నంలోనే నిరూపించింది. త‌న జీవిత కాన్వాసును ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంది. రంగురంగుల క‌ల‌ల‌ను నిజం చేసుకుంది. అన్నీ ఉండీ ఏమీ చేయ‌ని ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఆమే.. స్వ‌ప్న‌! ద రోల్‌మోడ‌ల్‌!


స్వ‌ప్న అగస్టీన్‌. కేర‌ళ‌లోని ఎర్నాకుళానికి చెందిన 40 ఏళ్ల‌ స్వ‌ప్న‌కు పుట్టుకతోనే చేతులు లేవు. త‌న తోటివాళ్లంతా చ‌క‌చ‌కా ప‌నులు చేసుకుంటే తమ బిడ్డ ప‌రిస్థితి ఏంట‌ని కుంగిపోయారు త‌ల్లిదండ్రులు. తోటి పిల్లలు స్కూలుకెళుతుంటే తనకు వెళ్లాలనిపించేది. పేరెంట్స్ కాస్త అటూ ఇటు ఆలోచించినా కూడా.. చేతుల్లేక పోయినా సరే కాళ్లతో రాస్తాను అని చెప్పి.. పేరెంట్స్‌ను ఒప్పించింది స్వప్న. తన చదువే కాదు.. ఇష్టమైన పెయింటింగ్ కూడా నేర్చుకున్నది! రెండుకాళ్ల‌తోనే అన్నిప‌నులు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఎవ‌రూ క‌నీసం ఊహించ‌లేని విధంగా క‌ళ‌ల్లో నైపుణ్యం సాధించించింది, కాళ్ల‌తోనే క‌మ‌నీయ చిత్రాలు గీసి అందరినీ అబ్బురపరిచింది

స్కూల్లో చేరిన‌ప్పుడే స్వ‌ప్న‌లోని టాలెంట్‌ను త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు గుర్తించారు. అందుకే తను ఈ స్టేజ్‌కి రావ‌డానికి, జీవితంలో నిల‌దొక్కుకోవ‌డానికి అంద‌రి స‌హాయ స‌హ‌కారాలే కార‌ణ‌మంటారు స్వ‌ప్న‌. సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ స‌మాజం ప‌ట్ల త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. తాను నిత్యం కాళ్ల‌తో గీసే కాన్వాసుల‌ను స్వ‌ప్న ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడ‌తారు. వంద‌లాది యూత్ మేగ‌జైన్ల‌లో, న్యూస్‌ లెట‌ర్ల‌లో స్వ‌ప్న బొమ్మ‌లు అచ్చ‌వుతున్నాయి. భావిత‌రాలకు స్ఫూర్తిని పంచిపెడుతున్నాయి. స్వ‌ప్న గీసిన కొన్ని బొమ్మ‌లు ఇవి! MFPA సైట్‌లో మ‌రిన్ని పెయింటింగ్స్‌ను చూడొచ్చు.

Related Stories

Stories by Karthik Pavan