అందమంటే నలుపా..? తెలుపా..?

0


అందంగా లేనా...?

అస్సలేం బాలేనా..?

చెప్పవోయ్..

ఓ సినిమాలో హీరోయిన్ గోముగా అడుగుతుంది..

అద్సరేగానీ ఇంతకూ అందమంటే ఏంటి?

వాలిపోయిన స్మోకీ ఐసా..?

పండుమిరప రంగు లిప్ స్టిక్ పెదాలా..?

కర్లీ కర్లీ హెయిర్సా..?

రోసీరోసీ బ్లషింగా..?

ఏంటి..? అందానికి నిర్వచనమేంటి?

వాటీజ్ ద మీనింగ్ ఆఫ్ బ్యూటీ..?

అంటే.. "వైట్ ఈజ్ ద మీనింగ్ బ్యూటీ"..!!

అమ్మాయికేం తక్కువైంది.. తెల్లగా జాంపండులా ఉంది..

ఇలా తెలుపు కలర్ అనేది మెయిన్ క్రైటేరియాగా మారింది.  ప్రతీ విషయానికీ శరీరరంగుతో ముడి పెట్టి మాట్లడటం కామనైపోయింది. తెలుపు రంగుకు మన సమాజం ఒకరకంగా ఎడిక్ట్‌ అయ్యింది.  

మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ?

మీకు పెళ్లి కావట్లేదా ?

మీకు మంచి కాలేజీలో సీటు సాధించాలని ఉందా ?

మీ జాబ్‌లో ప్రమోషన్ పొందాలని ఉందా ?

మీరు కెరీర్‌లో విజయం సాధించాలని ఉందా ?

ఫెయిర్ నెస్ క్రీం అడ్వర్టయిజ్మెంట్ల కాన్సెప్ట్ ఇంతకంటే ఏం మారదు. విషయమూ ఛేంజ్ కాదు. ఫలానా క్రీం వాడండి.. వెంటనే మీరు ఇదైపోతారు.. అదైపోతారు. డెప్తుగా ఆలోచిస్తే విచిత్రంగా తోస్తుంది. అయినా మార్కెట్లో నడుస్తున్నదదే. మోకాలికీ బోడిగుండుకీ లింకుపెట్టినట్టు.. అందానికి, ఆత్మవిశ్వాసానికి ముడిపెడుతూ ఫెయిర్‌నెస్‌ క్రీం కంపెనీలు కొన్ని వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రకటనలే సమాజంలో వెర్రిపోకడలకు దారి తీస్తున్నాయి.

ముఖ్యంగా మహిళలు.. ఎక్కువగా రంగుపట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇండియన్ ఫస్ట్ సర్ఫర్ ఇషితా మాలవ్యా ఏమంటారంటే.. "ఇలాంటి పోకడలతో మహిళలు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా.. రంగు విషయంలో ఒకరకమైన ఇన్ ఫీరియారిటీకి లోనవుతున్నారు. కాస్త నల్లబడగానే వారికి ఎక్కడ లేని టెన్షన్ పుట్టుకొస్తుంది."

మరి దీనికి పరిష్కారం లేదా అంటే. కచ్చితంగా ఉంది అంటున్నారు టెక్సాస్‌ యూనివర్సిటీ విద్యార్థులు. ఇదే విషయం మీద ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌ తయారు చేశారు. అన్‌ఫెయిర్‌అండ్‌ బ్యూటిఫుల్‌ పేరిట ఓ హాష్‌ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. ఈ ట్యాగ్‌ పేరుమీద నలుపురంగుకు సంబంధించిన చర్చలు పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్యాగ్‌ మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కలరిజంపై ఒక నిరసన జ్వాల రగిలింది.

వాస్తవానికి పాక్స్‌ జోన్స్‌ అనే ఆఫ్రికన్‌ అమెరికన్‌ విద్యార్థిని.. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో తన తోటి భారతీయ విద్యార్థినులతో, కలిసి ఒక ఫోటో షూట్‌ స్టార్ట్‌ చేసింది. దానికి అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని పేరు పెట్టారు. అదికాస్తా సోషల్‌ మీడియాలో చేరి హాష్‌టాగ్‌ పేరుమీద రచ్చరచ్చవుతోంది.

సోషల్‌ మీడియా కమ్యూనిటీలో ప్రధానంగా నల్లటి మేని ఛాయ ఉన్న మహిళలు తమ ఫోటోలను ఏమాత్రం సందేహం లేకుండా పోస్ట్‌ చేయవచ్చు. ప్రస్తుతం వెయ్యి మంది మహిళలు ఫొటోలను ఈ కమ్యూనిటీలో పోస్ట్‌ చేశారు. ఇలా కేవలం ఫేస్‌ బుక్‌ ద్వారా మాత్రమే కాకుండా, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ల ద్వారా కూడా ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఫెయిర్‌నెస్‌ క్రీం యాడ్స్ లో మోడల్స్‌, హీరోయిన్స్ నటిస్తుంటారు. వారికిచ్చే రెమ్యునరేషన్ సంగతి సరే. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేయడం ఇష్టంలేక ప్రకటనలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచింది మాత్రం ప్రఖ్యాత నటి నందితా దాస్‌. నందితా ఏకంగా స్టే అన్‌ ఫెయిర్‌, స్టే బ్యూటిఫుల్‌ పేరిట ఒక క్యాంపెయిన్‌లో పాల్గొంది. ఈ క్యాంపెయిన్‌ ద్వారా వేలాది మంది అభిప్రాయసేకరణ చేసింది.

మరోనటి కంగనా రనౌత్‌ కూడా బ్యూటీ ప్రాడక్టులకు యాడ్స్ చేయను అని ప్రకటించింది. అసలు ఎవరి మేని ఛాయ వారికిష్టం. ఒకరు అందంగా వున్నారని.. ఒకరు లేరని తీర్పు ఇవ్వడం తప్పుడు అభిప్రాయం అంటారామె.

వ్యక్తిత్వాన్ని కాపాడుకునేలా ముందుకు వెళ్లడమే అసలైన అందమనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్. అంతేకదా.. అనవసరమైన రంగులు హంగులతో ఆరోగ్యం పాడుచేసుకోవడం తప్పితే.. క్రీముల్లో ఏముంది క్రిములు తప్ప.  

Related Stories

Stories by vennela