ఇండియాలో ఫిన్ టెక్ బిజినెస్ ఎలా ఉంది..? విదేశాల నుంచి ఏం నేర్చుకోవాలి..?

ఇండియాలో ఫిన్ టెక్ బిజినెస్ ఎలా ఉంది..? విదేశాల నుంచి ఏం నేర్చుకోవాలి..?

Saturday April 30, 2016,

3 min Read

  

భారత్ లో ఫైనాన్సియల్ టెక్నాలజీ సేవల (ఫిన్ టెక్) అభివృద్ధి ఇటీవలికాలంలో ఊపందుకుంది. రెండేళ్లలో 40కిపైగా సంస్థలు ఫిన్ టెక్ రంగంలో సేవలందించేందుకు ఏర్పడ్డాయి. బ్యాంకింగ్ రంగం విజృంభిస్తోంది. అయితే అసంఘటిత రంగంలో ఉన్నవారికి, సెక్యూరిటీ ఏమీ ఇవ్వలేని వ్యక్తులకు అప్పులు పుట్టడం ఇంకా కష్టమే. అందుకే మన దేశంలో ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీల ఎదుగుదలకు స్కోప్ ఎక్కువగా ఉంది. అమెరికాలోని లెండింగ్ క్లబ్, ప్రోస్పర్ లాంటి సంస్థలు మనదేశంలోనూ రావాల్సిన అవసరం ఉంది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని లెండిట్ సంస్థ కార్యాలయంలో ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్ లో ఉన్న ఫిన్ టెక్ కంపెనీల ప్రతినిధుల సమావేశం జరిగింది. అందులో భారత్ లో ఫిన్ టెక్ వృద్ధి అవకాశాలపై చర్చ జరిగింది. అందులోని కొన్ని అంశాలను మనమూ పరిశీలిద్దాం.

అండర్ రైటింగ్

చాలా భారతీయ కంపెనీలు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఉపయోగించి వేలకొద్ది డాటాను విశ్లేషిస్తున్నాయి. ఇకపై ఒక వ్యక్తికి అప్పు ఇవ్వాలా వద్దా అనే అంశం జస్ట్ ఆన్ లైన్లో మాత్రమే పరిశీలిస్తారు. ఏజెంట్ల అవసరం ఉండదు. అదే నెక్స్ట్ జనరేషన్ అండర్ రైటింగ్ స్ట్రాటజీ.

అప్పులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేముందు ఎక్కువ అంశాలను పరిశీలించాల్సిన అవసరం లేదు. అప్ స్టార్ట్ కంపెనీ విద్య, ఉద్యోగ సమాచారం ఆధారంగా అప్పులు ఇస్తోంది. FICO మోడల్ వల్ల లోన్ అప్రూవల్ రేట్ 40 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందని అప్ స్టార్ట్ కంపెనీ సీఈఓ డేవ్ అంటున్నారు.

భారతీయ ఫిన్ టెక్ కంపెనీలు సరికొత్త విధానాన్ని అవలంభిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మరింత సమర్థవంతమైన , సరళమైన అండర్ రైటింగ్ స్ట్రాటజీని అవలంభించాలి.

రిస్క్ అండ్ రెగ్యులేషన్

బ్యాంకులు, ఏజెంట్ల సిఫారసులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అప్పులివ్వడం అమెరికా, యూరప్ లో చాలా ఎక్కువ. భారత్ లోకూడా ఈ విధానంపై ఆర్బీఐ త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటించనుంది. పీటూపీ లెండింగ్ వస్తే మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. అంతా ఆన్ లైన్లోనే జరిగిపోతుంది. రుణగ్రహీత మరింత స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

అనవసర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల చాలా మంది నిరాశచెందుతున్నారు. ఇలాంటి నియంత్రణలను తొలగిస్తే ఫైనాన్సియల్ సర్వీసెస్ బిజినెస్ బాగా వృద్ధి చెందుతుందని పేపాల్ కో ఫౌండర్ పీటర్ అంటున్నారు.

మార్పులు అవసరం

సరికొత్త విధానాలు, విప్లవాత్మక మార్పులు చేపట్టి భారత్ లో ఈ కామర్స్ రంగం బాగా వృద్ధి చెందింది. ఫిన్ టెక్ కంపెనీలుకూడా వినూత్న పంథాను అనుసరించి దూసుకెళ్లాల్సి ఉంది. పీటూపీ, ఐటూపీ, మార్కెట్ ప్లేస్, హైబ్రిడ్ లాంటి పద్ధతులు అవలంభించాలి. అమెరికాలోని ఫిన్ టెక్ కంపెనీ లెండింగ్ క్లబ్… తమ దగ్గర అప్పులు తీసుకున్నవారి వివరాలు, రిటర్న్స్ ను ఎప్పటికప్పుడు ప్రచురిస్తుంది. ఇదే పద్ధతి భారత కంపెనీలు అవలంభించినా మంచి ఫలితం ఉంటుంది.

హైబ్రిడ్ మోడల్స్

దేశంలోని సెక్యూరిటైజేషన్ కు సంబంధించి ట్యాక్స్ విధానాలు, రెగ్యులేషన్ లో కొంత గందరగోళం ఉంది. అమెరికాలోని 25 శాతం లోన్లకు సెక్యూరిటీ ఉంటుంది. మన దేశంలో అది కేవలం ఒక్క శాతమే. హైబ్రిడ్ విధానంలో లోన్లు ఇవ్వడం ఉత్తమం. అంటే 50 శాతం సెక్యూరిటీస్ గా మిగతా 50 శాతం మామూలుగా లోన్లు ఇవ్వాలి. దీనివల్ల పెట్టుబడిదారులకు రిస్క్ తగ్గుతుంది.

కస్టమర్లు ఎలా ?

మన దేశంలో ప్రారంభమైన చాలా ఫిన్ టెక్ కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఫిన్ టెక్ కంపెనీలు తర్వాత బ్యాంకులు, ఎబీఎఫ్సీలకు డిజిటల్ డీఎస్ఎ సేవలందించే సంస్థలుగా మారిపోయాయి. అందుకే దేశంలో ఇంకా కోట్ల మందికి అప్పు పుట్టలేదు. కస్టమర్లకు కూడా ఈ ఫిన్ టెక్ కంపెనీలపై అవగాహన లేదు. అందుకే ఈ కంపెనీలకు కస్టమర్లు దొరకడం లేదు. ఆన్ లైన్లో లోన్ లావాదేవీలంటే ఇంకా చాలా మందికి భయమే. వడ్డీలు బాదేస్తారని కొందరు… వడ్డీ వ్యాపారులదగ్గరైతే పని మరింత సులవవుతుందని మరికొందరు.. భావిస్తున్నారు.

image


సమాచార నిర్ధారణ

ఏ కంపెనీ అయినా అప్పులివ్వాలంటే సరైన డాటా ఉండాలి. డాటాలో ఏమైనా తేడా ఉంటే బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది. ఫిన్ టెక్ కంపెనీలు డాటాపై ఎక్కువగా ఆధారపడతాయి. మేం ఫేస్ బుక్ లేదా లింక్డ్ ఇన్ డాటా ఉపయోగించం. ఎందుకంటే ఆ డాటా నిజమో కాదో… నిర్ధారించుకోలేం అంటారు డేవ్. ఐదు నిమిషాల ఫోన్ వెరిఫికేషన్ చేస్తే కొంత సమాచారం లభిస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని ఆన్ లైన్ సమాచారంతో పోల్చుకుంటే నిర్ధారించుకోవడం తేలిక అనేది డేవ్ అభిప్రాయం.

చైనాలో బ్యాంకులు కాకుండా ప్రత్యామ్నాయంగా అప్పులిచ్చే సంస్థలు రెండు వేల వరకు ఉన్నాయి. అందుకే ఆ దేశం పారిశ్రామిక ప్రగతి సాధించింది. కొనుగోలు శక్తిపెరిగింది. దేశంలో ఇటీవలే నలభై మాత్రమే ఫిన్ టెక్ కంపెనీలు ఏర్పడ్డాయి. వీటి సంఖ్య ఎంత పెరిగితే అంత మంచిది. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలనుంచి భారతదేశం బయటపడుతుంది.