ఒకప్పుడు సాధారణ గృహిణి.. నేడు 3 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి అధిపతి

ఒకప్పుడు సాధారణ గృహిణి.. నేడు 3 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి అధిపతి

Sunday March 12, 2017,

2 min Read

ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ అనేది నానుడి. అయితే అన్ని విద్యలూ దగ్గరుండి నేర్పించాల్సిన పనిలేదు. కొన్నికొన్ని వారికి జన్మతః అబ్బుతాయి. వంటిల్లు తీర్చిదిద్దినంత మాత్రాన వ్యాపారాన్ని పరుగులు పెట్టించగలరా అనుకుంటే పొరాపాటే. పోపుడబ్బా అయినా, గల్లాపెట్టే అయినా మనీ మేనేజ్ చేయడమం అనేది ఆర్టు. అందులో మగువలు ఏమాత్రం తీసిపోరని నిరూపించారు ఇనా చాబ్రా. భర్త చేసే వ్యాపారంలో అనుకోకుండా ప్రవేశించి.. తన బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియాతో మూడు కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి అధిపతి అయ్యారు.

image


నీరజ్ చాబ్రా దంపతులది ఢిల్లీ. కడుపులో చల్లకదలని జీవితం. ఉమ్మడి కుటుంబం. 14 గదలుండే లంకంత ఇల్లు. పిల్లలు పెద్దలతో సందడిసందడిగా ఉండేది. వసారా, గార్డెన్, కొబ్బరి చెట్లు, పూలమొక్కలు.. ఏరోజుకారోజు లైఫ్ రీఫ్రెష్. అయితే కొన్ని కారణాలచేత వారు బెంగళూరుకి మారాల్సి వచ్చింది. విశాలమైన ఇంటినుంచి ఒక్కసారిగా ఇరుకుగదుల్లోకి మారిపోయారు. ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు చిన్న ఇంట్లో సర్దకున్నారు. అప్పుడు తెలిసింది న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండే మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటో. ఏమీ తోచేదికాదు ఇనా చాబ్రాకి. అందుకే భర్త బిజినెస్ వ్యవహారాల్లో పాలుపంచుకుంది.

బెంగళూరు హోస్కోటె ఇండస్ట్రియల్ ఏరియాలో వాళ్లకు బటన్ మాన్యుఫ్యాక్చరింగ్ వెంచర్ వుంది. కంపెనీ వ్యవహారాలు చూసుకోడానికే వాళ్లు ఢిల్లీ వదిలి బెంగళూరు వచ్చారు. తమిళనాడు త్రిపుర్ లోని బట్టల పరిశ్రమకు వీళ్లు బటన్లు(బొత్తాలు) సరఫరా చేస్తారు.

ఒకసారి ప్రముఖ కంపెనీ నుంచి గంపగుత్తగా 3 కోట్ల విలువైన ఆర్డర్లొచ్చాయి. అంతమొత్తం ఒకేసారి రావడంతో ఇద్దరూ కన్‌ఫ్యూజ్ అయ్యారు. సమయానికి ఆర్డర్ డెలివరీ చేయడాన్ని సవాల్‌గా తీసుకున్నారు. అలా ఇనా చాబ్రా వ్యాపారంలో మనీ మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్ లాంటి మెళకువలు నేర్చుకున్నారు.

బటన్ ఫ్యాక్టరీ యూనిట్ రన్ చేస్తున్న సమయంలోనే మార్కెట్లో మెలామైన్ క్రాకరీ డిమాండ్ ఏంటో తెలిసింది. బటన్ ఫ్యాక్టరీ ఎలాగూ స్టేబుల్‌గా ఉంది. కాబట్టి క్రాకరీపై దృష్టి సారిస్తే ఎలా వుంటుంది అని ఇద్దరూ ఆలోచించారు. క్రాకరీ తయారీ మీద రీసెర్చ్ చేశారు.

మొత్తానికి 2006లో సీడ్ కేపిటల్ ఫండ్ తో సాయి మెలమిన్ క్రాకరీ బిజినెస్ మొదలైంది. బటన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే 200 మంది వర్కర్లతో ఒక యూనిట్ పెట్టారు. అందులో చాలామటుకు మహిళలే కావడం విశేషం.

image


రోజుకి 300 డిన్నర్ సెట్స్ తయారు చేస్తారు. నెలకు ఎంతలేదన్నా పదివేల డిన్నర్ సెట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ లెక్కన నెలకు 25 లక్షల బిజినెస్ అవుతోంది. దివాలీ లాంటి పండుగల సీజన్‌లో అయితే 70 లక్షలదాకా అవుతుంది.

మొదట్లో రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మేవారు. తర్వాత బిజినెస్ బీటూబీ మోడ్‌లోకి వెళ్లింది. కంట్రీక్లబ్, చాకొలేట్ రూం, పేరున్న రెస్టారెంట్లకు సప్లై చేసేందుకు ఒప్పందం కుదిరింది. అతికొద్ది కాలంలోనే స్పార్ హైపర్ సిటీ లాంటి సూపర్ మార్కెట్ దిగ్గజం క్లయింట్ అయింది. డీ మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి సంస్థల నుంచి కూడా ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. డిమాండ్ పెరగడంతో సప్లయ్ సకాలంలో అందిచడానికి ఆటోమేటెడ్ మెషినరీ ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కొత్తకొత్త డిజైన్లు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మేడిన్ చైనా ప్రాడక్టుల నుంచి పోటీ తట్టుకోవాలంటే క్రియేటివిటీ ఉండాల్సిందే కదా.. మార్కెట్లో కాంపిటీటర్లు సైతం ఆమె దగ్గరికే వచ్చి వెరైటీ డిజైన్ల తయారీకోసం అప్రోచ్ అయ్యేవారు. ఇన్ పుట్స్ ఇవ్వమని అడిగారు. అలా చూస్తుండగానే చాబ్రా క్రాకరీ క్వీన్ అయిపోయారు.

మహిళలు తలుచుకుంటే చేయని వ్యాపారం లేదు అని చెప్పడానికి చాబ్రానే నిదర్శనం. ఒకప్పుడు ఇంటినుంచి బయటకు అడుగుపెట్టలేని ఆమె.. నేడు మూడు కోట్ల టర్నోవర్ చేసే సంస్థకు అధిపతి అయ్యారు. సూపర్ మార్కెట్ దిగ్గజాలు తన కంపెనీ దగ్గరికి క్యూ కట్టేలా చేశారు. దటీజ్ విమెన్ విల్ పవర్.