రూపాయికే స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న 'స్వజల్'

దేశంలో 10కోట్లమందికి పైగా మంచి నీటి లభ్యత లేదునాలుగో వంతు ప్రజలకే నేరుగా ఇంటికి తాగునీరు కోట్ల మంది మహిళలు రోజూ నీటికోసం మైళ్ల కొద్దీ నడుస్తున్నారుకేవలం 13శాతం మగవారే ఈ బాధ్యతలో భాగం తీసుకుంటున్నారుకెమికల్స్, బ్యాక్టీరియా ఉన్నాయని తెలిసినా 67శాతం ప్రజలు తాగునీటిని శుభ్రపరచడం లేదు

0

దేశంలో నీటి కొరతను, నీటి కాలుష్యాన్ని పని కట్టుకుని ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈ కొరత ఎదుర్కోడానికి ఉదయమో, సాయంత్రమో ఒక్కపూటే నీరు సరఫరా అవుతోంది. చాలాచోట్ల 2,3 రోజులకొకసారే. ప్రతీ ఇంట్లో ఫ్రిజ్, టీవీ ఉన్న మాదిరిగా ఇప్పుడు తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టం కూడా తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ట్యాప్ వాటర్ తాగేందుకు పనికిరాని స్థితిలో ఉండడమే దీనికి ప్రధాన కారణం.

స్వజల్‌లో నీటిని నింపుకుంటున్న బాలుడు
స్వజల్‌లో నీటిని నింపుకుంటున్న బాలుడు

అద్వైత్ కుమార్... స్వజల్ ఆలోచన ఈయనదే. వీరి ఇంట్లో శుభ్రపరిచిన తాగునీటి కోసం చుట్టుపక్కల ఉండేవారు క్యూలు కట్టి నుంచున్న సంఘటనలు చూశాక... తాగునీటి సమస్య తీవ్రత అర్ధమైంది. తాను ఏదైనా చేయాలనే తలంపు కలిగింది. 

"మా పని మనిషిని మా ఇంట్లోంచి నీళ్లు తీసుకెళ్లమని చెప్పాం. ఆమె చిన్నారికి డయేరియా రావడమే కారణం. ఇది శుభ్రమైన నీరు తాగకపోవడం కారణంగానే వస్తుందని నాకు తెలుసు. వాళ్ల ఇంటి చుట్టుపక్కలవాళ్లు కూడా వచ్చి తమకూ శుభ్రపరచిన తాగు నీరు ఇవ్వమని అడిగేవారు. వారి యజమానులు ఇలా నీటిని తీసుకెళ్లేందుకు ఒప్పుకునేవారు కాదని చెప్పారు."అంటారు అద్వైత్.

దీంతో వీరి ఇంట్లోని ప్యూరిఫికేషన్ సిస్టంను పెరట్లోకి మార్చి నీరు అందించేవారు. అంతే ఆ నీటి క్యూలైన్ పెరుగుతూనే ఉండేది. వారుండే కాలనీ చట్టవ్యతిరేకం కావడంతో మున్సిపాల్టీ వాళ్లు తాగు నీటి సరఫరా చేసేవారు కాదు. ఆస్తి పన్నులు వంటివి కట్టాల్సిన అవసరం లేకపోవడంతో... నీరు, కరెంటు విషయంలో ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం కనిపించేది. ఈ సమస్యకు తగిన, సరైన, చవకైన పరిష్కారం చూడాలని భావించారు అద్వైత్. అలాగే ఇది ఎవరిపై ఆధారపడకుండా నిర్వహణ ఉండాలని అనుకున్నారాయన. అప్పుడు ప్యూరిఫికేషన్ సిస్టమ్స్‌కు సౌరవిద్యుత్‌ను జత చేయాలనే ఆలోచనకు బీజం పడింది.

భారతదేశంలోని సౌరవిద్యుత్తుతో పనిచేసే మోస్ట్ అడ్వాన్స్‌డ్ నీటి శుద్ధి యంత్రాల్లో ఒకటి. ఇంజినీరింగ్ నైపుణ్యంతో.. దీన్ని ఎక్కువకాలం మన్నే విధంగా డిజైన్ చేశారు. స్వజల్ గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం.

  • - ఇతర ప్యూరిఫికేషన్ సిస్టంలతో పోల్చితే స్వజల్ నిర్వహణ ఖర్చు 80శాతం తక్కువ.
  • - ప్రామాణిక ఆర్ఓ(రివర్స్ ఆస్మోసిస్) సిస్టంలతో పోల్చితే స్వజల్ 60శాతం ఎక్కువ నీటిని శుభ్రపరుస్తుంది.
  • 2400-300 టీడీఎస్(టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్) ప్రమాణాలతో శుభ్రపరచడం దీని ప్రత్యేకత. ఇది అంతర్జాతీయ తాగు నీటి ప్రమాణాలతో మ్యాచ్ అవుతుంది.

2011లో స్వజల్‌ను ప్రారంభించారు అద్వైత్ కుమార్. ఈన పెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టభద్రులు. ఈ టీంలో డాక్టర్ విభా త్రిపాఠి, డాక్టర్ దినేష్ అగర్వాల్, డాక్టర్ రష్మీ సంఘీ ఉన్నారు. సహవ్యవస్థాపకులంతా పర్యావరణవేత్తలు, రచయితలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక వేత్తలు, సైంటిస్టులు కావడం విశేషం.

భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా..

ప్రస్తుతం న్యూఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌లలో స్వజల్ సెంటర్లు ఉన్నాయి. అలాగే గుర్గావ్, హైద్రాబాద్, ముంబై, రాయ్‌పూర్‌లలో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, కర్నాటకల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు త్వరలో. ప్రస్తుతం ఈ సంస్థ స్వజల్ వాటర్ హట్ సిస్టంను ఫ్రాంచైజీ రూపంలో అందిస్తున్నారు. అంటే సోలార్ పవర్‌తో ఆధారిత వాటర్ ప్యూరిఫికేషన్ వెండింగ్ మెషీన్‌ను ఫ్రాంచైజీదారులకు ఇస్తారు. దీనితో పాటు ఇతర విధానాలనూ పరిశీలిస్తున్నామని కంపెనీ వర్గాలు చెబ్తున్నాయి.

ఇతర ప్రాంతాల్లోకి వచ్చే ప్రణాళికలు ఉన్నా.. ముందుగా స్థానిక పరిస్థితులు తెలుసుకోవాలని, సవాళ్లకు పరిష్కారాలు చూడాలని చెబ్తున్నారు అద్వైత్. దాంతోపాటు ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ కావడంతో... విదేశాల్లోనూ విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. కాలేజ్ విద్యార్ధులు, సామాజికవేత్తల సాయంతో... స్వజల్‌పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

పే యాజ్ యూ గో

స్వజల్ ప్రస్తుతం ఫ్రాంచైజీ మోడల్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక విక్రేతలు, షాప్ ఓనర్లకు సరఫరా చేసి స్థానికంగానూ వారి అభివృద్ధి తోడ్పడతామని చెబ్తోంది. ఎక్కడ వచ్చే ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికే ఉపయోగిస్తామని చెబ్తున్నారు అద్వైత్.” స్వజల్ తాజాగా పే యాజ్ యూ గో విధానాన్ని కూడా అందిపుచ్చుకుంది. ప్రతీ స్వజల్ మిషన్ కాయిన్స్, స్మార్ట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేసేలా డిజైన్ చేశారు. ప్రధానంగా సంస్థకు ఆదాయం ఫ్రాంచైజీ ఫీజుల ద్వారాను, సర్వీస్ ఒప్పందాల ద్వారానూ వస్తుంది.

"ప్రస్తుతం 5వేల కుటుంబాలకు స్వచ్ఛమైన, శుభ్రపరచిన తాగునీరు అందిస్తోంది స్వజల్. నెలల వ్యవధిలోనే కొన్ని వందల రెట్లు పెరిగే అవకాశముంది. శుభ్రపరచిన నీటికి లీటరుకు రూ.1, కూల్ వాటర్‌కు రూ.2 ధర నిర్ణయించాం "- అద్వైత్

ప్రధానంగా స్వజల్ మిషన్లను స్లమ్స్‌లోని ఓపెన్ ఏరియాల్లో ఉండేలా చూస్తున్నారు. 24గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

నీళ్ల కోసం నిధులు

స్వజల్‌కు ఆర్ఈఈఈపీ(రెన్యూయబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పార్ట్‌నర్‌షిప్) నుంచి నిధులు అందాయి. అలాగే సౌర్య ఎనర్‌టెక్ నుంచి సీడ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది. ఫిక్కీ, యూఎన్‌డీపీ, గోల్డ్‌మ్యాన్ శాక్స్, ఐఎస్‌బీలు... పలు రకాలుగా మద్దతుగా నిలిచాయి. మరోమారు నిధులు సేకరణ కోసం పలు సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే భారీ అభివృద్ధి ప్రణాళికలు మొదలకానున్నాయని చెబ్తున్నారు అద్వైత్.

సవాళ్లు, బాటలోనే పాఠాలు

స్వజల్ ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య... ప్రజలకు అవగాహన కల్పించడం. వీళ్లు టార్గెట్ చేసిన స్లమ్ ఏరియాల్లోని ప్రజలకు డయేరియా వంటి వ్యాధులు నీటి ద్వారానే వస్తాయని తెలీదు. వీళ్లకు తెలిసినంతవరకూ అయితే నీళ్లు తియ్యగా ఉంటాయి, లేదా ఘాటుగా ఉంటాయంతే. పొట్టకూటికోసమే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్లది. తాగునీటి ప్రాముఖ్యత చెప్పి వాళ్లను ఒప్పించి స్వజల్‌ను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించాల్సి ఉంటుంది. “మేము స్వజల్‌ను మార్కెట్ చేయం, మేం శుభ్రమైన నీటిని తద్వారా ఆరోగ్యాన్ని మార్కెట్‌గా భావిస్తాం. సామాజిక వేత్తలుగా మేం పలు సవాళ్లను ఎదుర్కోవాలి, దానికి ఎప్పుడూ సిద్ధమే”అంటారు అద్వైత్.

"స్వజల్ ప్రారంభించినపుడు ఈ స్థాయికి చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఇంట్లో కూర్చుని దీన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు, ఎంత వ్యాపారం జరుగుతుందని అంచనా వేసినపుడు నాది చాలా చిన్న లెక్క. పరిశుభ్రమైన నీటిని అందించడం ద్వారా ఒక్క ప్రాణాన్ని కాపాడినా నేను నా ప్రయత్నంలో విజయం సాధించినట్లే"- అద్వైత్ కుమార్

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD