వందకోట్ల మందికి ఉపయోగపడాలన్నదే గూగుల్ ఇండియా ప్లాన్ -సుందర్ పిచాయ్  

ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్ధులతో గూగుల్ సీఈవో

0

డిజిటల్ ఎకానమీ వైపు అడుగులు వేస్తున్న ఇండియాకు గూగుల్ మద్దతు ఉంటుందన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. వందకోట్ల మందికి ఉపయోగపడేవి చేయాలన్నదే గూగుల్ ఇండియా ప్లాన్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్ధులతో సుందర్ పిచాయ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. జీమెయిల్ నుంచి డిమానిటైజేషన్ దాకా ప్రతీ ఒక్కటీ చర్చించారు.

వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఇండియా డిజిటల్ ఎకానమీ గ్లోబల్ ప్లేయర్ ఉంటుందని పిచాయ్ అభిప్రాయ పడ్డారు. వరల్డ్ క్లాస్ స్టార్టప్స్ ఉన్న ఈ దేశంలో డిజిటల్ పునాదులు ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయని అన్నారు. కాకపోతే భారత్ జనాభాకు తగ్గట్టు స్మార్ట్ ఫోన్ల వాడకం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ దిశగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ పోతే తిరుగులేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ గ్రోథ్ సాధించే క్రమంలో ఇండియా ఎదుర్కొనే సమస్యలను గూగుల్ తనవంతుగా పరిష్కరిస్తుందని సుందర్ పిచాయ్ చెప్పారు.

స్థానిక భాషలు: మరిన్ని భారతీయ భాషలకోసం గూగుల్ వర్కవుట్ చేస్తోందన్నారు సుందర్ పిచాయ్. దాంతోపాటు గూగుల్ ట్రాన్స్ లేట్ విషయంలోనూ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించామని అన్నారు.

అందుబాటులో స్మార్ట్ ఫోన్స్: ఫీచర్ ఫోన్ నుంచి జనం స్మార్ట్ ఫోన్లకు మారుతున్నారు. వాటి వినియోగం భారత్ లో పెరిగిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్మార్ట్ ఫోన్లు ఇంకా ఖరీదైన వస్తువుల్లా కాకుండా, తక్కువ ధరకు దొరికితే బాగుంటుందని అన్నారు. అందుకే తాము ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్లను రూ. 2వేలకే అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు.

కనెక్టివిటీ: ప్రజల మధ్య నిరంతరం కనెక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 110 రైల్వే స్టేషన్లలో గూగుల్ వై-ఫై సేవలు ప్రారంభించినట్టు సుందర్ పిచాయ్ తెలిపారు.

ఇంటర్నెట్ సాథీ: గ్రామీన భారతంలో మహిళలు ఇంకా స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకోవాలని పిచాయ్ అభిప్రాయ పడ్డారు. వాటిపట్ల సరైన అవగాహన రాలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్ సాథీ ద్వారా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వాడకం గురించి తెలుసుకుంటున్నారని అన్నారు.

డిజిటల్ అన్ లాక్డ్: స్థానిక వ్యాపారం ఆన్ లైన్ లో ఊపందుకోడానికి డిజిటల్ అన్ లాక్డ్ ఉపయోగపడుతుందని పిచాయ్ అన్నారు. గూగుల్ కూడా డిజిటల్ పేమెంట్ల కోసమే చూస్తోందన్నారు.

వందకోట్ల మందికి ఉపయోగపడే ప్రాడక్ట్స్ తయారు చేయాలని గూగుల్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని పిచాయ్ అన్నారు. అఫ్ కోర్స్ ఇండియా జనాభా కూడా వందకోట్లే కాబట్టి.. అందులో ఇండియా కోసం తయారుచేసేవి కూడా ఇతర దేశాలకు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయ పడ్డారు.

గత ఏడాది యూ ట్యూబ్ ఆఫ్ లైన్ తీసుకొస్తే, అది ఇప్పుడు పది దేశాల్లో ఉందని ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అన్నారు. ఒక ఐడియా ఒకరికే పరిమితం కాదన్నారు. ఇండియా కోసమే తయారు చేసిన వస్తువులు ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, వియాత్నాం లాంటి మార్కెట్లలో కూడా అమ్ముడుపోతాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

డిజిటైజేషన్ తో పాటు ఈ ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్ మీద కూడా గూగుల్ ఫోకస్ చేస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విషయంలో కంప్యూటర్ కనీవినీ ఎరుగని రీతిలో రూపాంతరం చెందిందని అన్నారు. హెల్త్ కేర్, ఆటోమోటివ్, ట్రాన్స్ పోర్ట్, ఇంకా అనేక పరిశ్రమల్లో దాని పర్యావసానం చూస్తున్నామని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు.

Related Stories