కొడుకుతో కలిసి ఇంటర్ పరీక్షలు రాసిన తల్లిదండ్రులు

కొడుకుతో కలిసి ఇంటర్ పరీక్షలు రాసిన తల్లిదండ్రులు

Saturday June 03, 2017,

2 min Read

పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో జరిగిన సంఘటన ఇది. కుంటుంబ సభ్యులు మొత్తం ఇంటర్ పరీక్షలు రాసి ఔరా అనిపించారు. 14 ఏళ్ల కొడుకుతో పాటు 42 సంవత్సరాలున్న తండ్రి, 32 ఏళ్ల తల్లి కలిసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు. ఆ వయసులో చదువుకోవాలనే వారి తపనను బెంగాల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎంకరేజ్ చేసింది.

image


చిన్నప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల తండ్రి బలరాం చదువుకోలేక పోయాడు. తొమ్మిది వరకు చదివి ఆపేశాడు. అతని భార్య కల్యాణి కూడా అంతే. నిరుపేద కుటుంబం కావడం వల్ల ఆమె 8వ క్లాస్ తర్వాత బడికి టాటా చెప్పేసింది. అందుకే కొడుకునైనా మంచి చదువులు చదివించాలని అనుకున్నారు. పిల్లాడు చదువుతుంటే వాళ్లకూ మనసులో ఏదో మూల మళ్లీ పుస్తకం పట్టాలని అనిపించింది. కానీ ఈ వయసులో చదువూ, పరీక్షలు అంటే నలుగురు నవ్వుతారని ఆలోచన విరమించుకున్నారు. ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ సంసారం నడవదు. బలరాం వ్యవసాయ కూలీ. అమ్మ కల్యాణి గొర్రెలను మేపుతుంది.

అయితే తల్లిదండ్రుల మనసులో మాటను కొడుకు పసిగట్టాడు. చదువుకోవాలన్న వాళ్ల తపన గుర్తించి, విషయం తన స్కూల్ హెడ్మాస్టర్ కి చెప్పాడు. ఓపెన్ స్కూల్ ద్వారా చదవొచ్చని అతను సలహా ఇచ్చాడు. అంత వరకు బానే ఉంది కానీ యూనిఫాం వేసుకునే దగ్గరే పెద్ద చిక్కొచ్చి పడింది. అంత పెద్ద వయసులో స్కూల్ డ్రెస్ వేసుకుంటే తోటి పిల్లలు నవ్వారు. కొన్నాళ్లకు అలవాటైంది. స్టూడెంట్స్ కూడా కలిసిపోయారు. పట్టుదలతో చదవి టెన్త్ పాస్ అయ్యారు.

ఇంటర్ లో అడుగు పెట్టారు. అందరూ ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నారు. పుస్తకాలు అందరికీ కలిపి ఒకటే సెట్. షేర్ చేసుకుని చదివేవారు. ముగ్గురికీ కొనాలంటే డబ్బులు సర్దుబాటు కాలేదు. సరే, మొత్తానికి ఎగ్జామ్స్ రాశారు. కానీ తండ్రి బలరాంకి అనుకున్నంతగా మార్కులు రాక ఫెయిల్ అయ్యాడు. తల్లీ, కొడుకులు మాత్రం పాసయ్యారు. తండ్రి కోసం మళ్లీ రీ వాల్యుయేషన్ పెట్టించాడు. ఒకవేళ అదృష్టం బాగుండి మార్కులు కలిసత్ పాసైతే పాసయ్యావు.. లేకుంటే మళ్లీ రాద్దువుగానీ అని కొడుకు సర్దిచెప్పాడు.

పాస్, ఫెయిల్ సంగతి పక్కన పెడితే ఆ వయసులో చదువుకోవాలనే వారి తపన ఎంతైనా అభినందనీయం.