చదివితీరాల్సిన తుపాకీ చిన్నమ్మ కథ..!

వాడవాడలా ఉండాల్సిన పెద్దమ్మతల్లి

చదివితీరాల్సిన తుపాకీ చిన్నమ్మ కథ..!

Tuesday November 15, 2016,

2 min Read

భయపడితే లోకం భయపెడుతుంది. అదే.. భయపెడితే సమాజం భయపడుతుంది. ఈ మగ ప్రపంచంలో ఒంటరి మహిళ గెలవాలంటే తూటాల్లాంటి మాటలైనా రావాలి. లేకుంటే తూటాలు నిండిన తుపాకీ అయినా కావాలి. అలాగని కాల్చిపారేయమని సందేశం ఇవ్వడం కాదు. ఆత్మరక్షణకు దాన్నొక ఆయుధంలా వాడాలి. తుపాకీ చిన్నమ్మ చేస్తున్నదదే..

ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్ పూర్ లో బందూక్ వాలీ చాచీ (తుపాకీ చిన్నమ్మ) పేరు వినిపిస్తే చాలు పోకిరీలకు ప్యాంటు తడిసిపోల్సిందే. ఆకతాయిలు ఆమడదూరంలో నడవాల్సిందే. పల్లెత్తు మాటకాదుగా.. కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు. అంతెత్తు రూపం, గర్జించే కంఠం, చేతిలో కరకుగా చూసే తుపాకీ, నడుముకి తుటాల బెల్టు! కళ్లింత చేసి ఏంట్రా.. అని ఒక్కసారి గర్జిస్తే చాలు.. సౌండు రీ సౌండిస్తుంది. ఆటోమేటిగ్గా ట్రిగ్గర్ మీద వేలు మీదకి పోతుంది. నుదుట బ్యారెల్ నిలబడుతుంది. సీన్ ఒక్కసారి ఊహించండి. అవతలివాడి పరిస్థితి ఏంటో!?

బందూక్ వాలీ చాచీ అని ఎందుకు పిలుస్తారు..? 

ఆమె పేరు చెప్తే ఆకతాయిలకు ఎందుకంత హడల్..?

image


సరిగ్గా పదిహేడేళ్ల క్రితం షహానా బేగం భర్త చనిపోయాడు. ఆస్తి తగాదాల్లో చంపేశారట. నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. మగదిక్కులేని ఆడదంటే ఈ సమాజంలో ఎంత చులకనో అందరికీ తెలుసు. వెకిలిచూపులు, వెర్రి కామెంట్లు. ఆత్మాభిమానం చంపుకుని అడుగు బయట పెట్టాల్సివచ్చేది. అన్నిటికంటే ముఖ్యం.. తన పిల్లలను కాపాడుకోవడం కష్టమైంది. అందునా ఇద్దరు అమ్మాయిలు. నిత్యం ఏదోమూల అత్యాచారం వార్త ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. ఏం చేయాలా అని అంతర్మథనం. చుట్టుపక్కల ఉన్న గన్ కల్చర్ ఆమెకు తెలుసు. ఇంకేముంది.. ఆయుధాలు దొరికే జాడ కనుక్కొని.. ఒక డబుల్ బ్యారెల్ గన్ కొన్నది. తను ఉన్న పరిస్థితిని వివరించి లైసెన్స్ తెచ్చుకుంది.

తుపాకీ షహానా దగ్గరకు చేరినప్పటి నుంచి పోకిరీలు అటువైపు రావడమే మానేశారు. ఎప్పుడైతే ఆమెను చూసి జనం భయపడటం మొదలుపెట్టారో.. షహానాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. కంఠం సవరించుకుంది. కళ్లలో రౌద్రరసం నింపుకుంది. ఒక్క తన కూతుళ్లే కాదు.. తన చుట్టూ ఉన్న అందరి ఆడపిల్లలకు రక్షణగా నిలవాలనుకుంది. వేధిస్తున్నారని, వెంటపడుతున్నారని ఒక్క మాట వినిపిస్తే చాలు.. ఆకతాయి నుదుట బ్యారెల్ పెట్టి నిలబడుతుంది. ఇప్పుడు నా తుపాకీ నాకు అండగా నిలుస్తున్న రెండో భర్త అంటారామె. నా గన్ చూసి ఎవరూ అమ్మాయిలను తాకే ధైర్యం చేయడం లేదు. చుట్టుపక్కలే కాదు.. మొత్తం జిల్లాలోనే షహానా బేగం అంటే హడలిపోతారు . వెధవ వేషాలేస్తే కాల్చిపారేస్తానని అందరికీ తెలుసని గర్వంగా చెప్తోంది. కానీ ఇంతవరకు తూటా పేల్చే అవసరం రాలేదని అంటోంది. అలాంటి సందర్భం రావొద్దని కూడా కోరుకుంటోంది.

మూడేళ్ల క్రితం ఒకమ్మాయిపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారం చేశారు. రెండు రోజులపాటు పాశవికంగా లైంగికదాడి చేశారు. పోలీసులు కేసు నిర్వీర్యం చేయాలని చూశారు. చేసేదేంలేక అమ్మాయి తల్లిదండ్రులు షహానాబేగాన్ని కలిశారు. జరిగిన దారుణాన్ని వివరించారు. అది విన్న షహానా రక్తం మరిగిపోయింది. ఆగమేఘాల మీద వెళ్లి అందులో ముఖ్యమైన నిందితుడిని కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లింది. కేసు పెడతారా లేదా అని ఖాకీలను నిలదీసింది. ఆ తర్వాత బాధితురాలిని నిందితుడికిచ్చి పెళ్లి చేసింది.

చుట్టుపక్కల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఏ కష్టం కలిగినా వెళ్లి బందూక్ వాలీ చాచీకి మొరపెట్టుకుంటున్నారు. పంచాయితీల్లో ఆమె తీర్పుకు ఎదురులేదు. న్యాయంపక్షాన బరిగీసి నిలబడిందంటే.. అంతలావు మీసాలున్న మగాడైనా వంగి సలాం కొట్టాల్సిందే. శని, ఆదివారాల్లో తగాదాలు తీర్చడమే ఆమె పని. షహానా పుణ్యమాని చుట్టుపక్కల గృహహింస తగ్గింది. తుపాకీ చిన్నమ్మ అండ చూసుకుని అమ్మాయిలు ధైర్యంగా రోడ్డుమీదికి వస్తున్నారు. పోకిరీలు వెధవ వేషాలు వేయడం మానేశారు. ఆకతాయిలు తోకముడిచారు.

ఇలాంటి తుపాకీ చిన్నమ్మ వాడవాడలా ఉండాల్సిన పెద్దమ్మతల్లి.