మీరు ఒక్క లోగో అడిగితే 104 రకాల డిజైన్లతో మీకు మతిపోగొట్టే 'డిజైన్ క్రౌడ్'

- లోగో, వెబ్‌, టీష‌ర్ట్ లోగో, బిజినెస్ కార్డ్స్ వంటి అన్ని ర‌కాల డిజైన్ల‌నూ రూపొందిస్తున్న సంస్థ‌- ఒక్కో క్ల‌యింట్‌కు వంద‌కుపైగా డిజైన్లను ప్ర‌ద‌ర్శిస్తున్న డిజైన్ క్రౌడ్‌- మైక్రోసాఫ్ట్‌తోపాటు మ‌రికొన్ని ప్ర‌ముఖు సంస్థ‌ల‌కు లోగో, గ్రాఫిక్ డిజైన్లు- టాటూ డిజైన్‌, ఎంబ్లం డిజైన్‌ల‌ను కూడా చేస్తున్న డిజైన్ క్రౌడ్‌

మీరు ఒక్క లోగో అడిగితే 104 రకాల డిజైన్లతో మీకు మతిపోగొట్టే 'డిజైన్ క్రౌడ్'

Saturday June 06, 2015,

3 min Read

డిజైనింగ్ అంటే ఓ క‌ళ‌. అది ఇల్లయినా కావొచ్చు.. వెబ్‌సైట్ అయినా కావొచ్చు. డిజైన్ బాగుంటేనే చూడాల‌నిపిస్తుంది. ముఖ్యంగా బిజినెస్‌లో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాలంటే.. ఆ సంస్థ‌కు చెందిన బ్రోచ‌ర్‌, లేదా బిజినెస్ కార్డ్, వెబ్‌సైట్‌ అందంగా ఉండాలి. అందుకు డిజైన్ కావాలి. అప్పుడే క‌స్ట‌మ‌ర్ల‌ను కట్టిపారేస్తుంది. అలాంటి డిజైన్ల‌ను ప్ర‌పంచ ప్ర‌సిద్ధ డిజైన‌ర్ల‌తో త‌యారు చేయించి ఇస్తోంది డిజైన్ క్రౌడ్‌.

మీ వ్యాపారానికి స‌రిపోయే మంచి మంచి క్రియేటివ్‌ డిజైన్లను పొంద‌డంలో ఇబ్బందులు ప‌డుతున్నారా? ఇలాంటి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న‌వారు మీరొక్క‌రే కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాదిమంది ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డిజైనింగ్ క్రౌడ్ సోర్సింగ్ సైట్ డిజైన్ క్రౌడ్ వెబ్‌సైట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు రెండుల‌క్ష‌ల‌కు పైగా సంద‌ర్శించారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అన్నిర‌కాల వ్యాపారాల‌కు స‌రిపోయే డిజైన్ల‌ను రూపొందించే ఈ సంస్థ చెల్లించే ప్ర‌తి పైసాకు వాల్యూ చేకూరుస్తుంది. ఒక్కో ప్రాజెక్ట్‌కు క‌నీసం 104 డిజైన్ల‌ను సూచిస్తుంది. అందులో న‌చ్చిన డిజైన్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

image


ఏడేళ్ల‌ క్రితం ఆరంభం

డిజైన్ క్రౌడ్‌ను 2008లో అలెక్ లించ్ ప్రారంభించారు. క్ల‌యింట్ డిజైన్ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో డిజైన‌ర్ల‌తో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. 2009లో ఆడ‌మ్ ఆర్బోలినో స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా సంస్థ‌లో చేరారు. సిడ్నీయూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్నాల‌జీలో వీరిద్ద‌రూ ప్రోగ్రామింగ్ అండ్ ఐటీ చ‌దువుకున్నారు. అంత‌కుముందు వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో వ్యాపారాన్ని కూడా చేసిన‌ప్ప‌టికీ అందులో విఫ‌ల‌మ‌య్యారు. వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న రెండో బిజినెస్ డిజైన్ క్రౌడ్.

డిజైన్ క్రౌడ్ వెబ్‌సైట్ ప‌నితీరు చాలా సుల‌భంగా ఉంటుంది. క్ల‌యింట్ త‌న వ్యాపారానికి సంబంధించిన వివ‌రాల‌ను సంక్షిప్తంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. కావాల్సిన‌ డిజైన్ కోసం బ‌డ్జెట్‌‌ను వివరించాలి. ఆ త‌ర్వాత వాళ్ల బ‌డ్జెట్‌లోనే, లారు కోరుకునే రీతిలో డిజైన్లు రూపొందించి ఇస్తారు.

అలెక్ లించ్, డిజైన్ క్రౌడ్

అలెక్ లించ్, డిజైన్ క్రౌడ్


అర‌కొర మూల‌ధ‌నంతోనే

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత డిజైనింగ్ వెబ్‌సైట్‌గా పేరొందిన డిజైన్ క్రౌడ్ ఈ స్థాయికి తీసుకురావ‌డానికి అలెక్ చాలా కృషిచేశారు. ఆరంభంలో త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బుల‌తోనే బిజినెస్‌ను ప్రారంబించారు. ఆ త‌ర్వాత సంస్థ‌ను విస్త‌రించేందుకు స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద నుంచి రుణం తీసుకున్నారు. 

"తొలి రెండేళ్లు ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించాను. నా ద‌గ్గ‌ర ఉన్న సేవింగ్స్ అన్నింటిని వ్యాపారం కోసం వాడాను. ఆ త‌ర్వాత క్రెడిట్ కార్డుల్లో డ‌బ్బుతోపాటు 30 వేల డాల‌ర్ల‌ను స‌న్నిహితుల వ‌ద్ద నుంచి అప్పుగా తీసుకొన్నాను" అని అలెక్ వివ‌రించారు.

నెల‌కు మిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్‌

2009లో ఈ స్టార్ట‌ప్ కంపెనీ మూడుల‌క్ష‌ల డాల‌ర్ల‌ను నాలుగు సంస్థ‌ల నుంచి పెట్టుబ‌డిగా సేక‌రించింది. ఆ త‌ర్వాత ఆరు మిలియ‌న్ల పెట్టుబ‌డిని స్టార్‌ఫిష్ వెంచ‌ర్ ద్వారా స‌మ‌కూర్చుకుంది. ప్ర‌తియేటా క్ల‌యింట్లు పెరిగిపోతుండ‌టంతో సంస్థ ఆర్థిక క‌ష్టాలు తీరిపోయాయి. 2013లోనే ప్ర‌తి నెల‌లో ప‌దిల‌క్ష‌ల డాల‌ర్ల బిజినెస్ జ‌రిగింది. తాము ఆర్జించే మొత్తంలో 15 % డిజైన‌ర్ల‌కు చెల్లిస్తుంది సంస్థ‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వంద దేశాల్లోని డిజైన‌ర్ల‌తో డిజైన్ క్రౌడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ‌తో ప‌నిచేసే డిజైన‌ర్ల‌లో ఎక్కువ‌మంది అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, యూకే, ఇండోనేషియాకు చెందిన‌వారే.

డిజైన్ క్రౌడ్ రూపొందించిన వివిధ రకాల బిజినెస్ కార్డ్స్

డిజైన్ క్రౌడ్ రూపొందించిన వివిధ రకాల బిజినెస్ కార్డ్స్


భారతీయులదే హవా

ప్ర‌పంచంలో అతిపెద్ద డిజైన్ హ‌బ్‌లో భార‌త్‌ది రెండో స్థానం. డిజైన్ క‌మ్యునిటీలో అమెరికా 26 శాతంతో మొద‌టి స్థానంలో ఉంటే, భార‌త్ 21 శాతంతో ఆ త‌ర్వాత స్థానాన్ని ఆక్ర‌మించింది. డిజైన్ క్రౌడ్ అత్యుత్త‌మ డిజైన‌ర్ల‌లో చాలామంది భార‌త్‌కు చెందిన‌వారే. టాప్ థౌజెండ్ డిజైన‌ర్ల‌లో 14% భార‌తీయులే. సంస్థ‌కు అవ‌స‌ర‌మ‌య్యే డిజైన్ల‌లో 27% భార‌త డిజైన‌ర్లు త‌యారుచేసిన‌వే.

"భార‌త్‌లో డిజైన్స్‌కు కోసం రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతున్న‌ది. ఈ డిమాండ్ గ‌త ఆరునెల‌ల్లో 42 శాతం పెరిగింది. మిగ‌తా దేశాల్లో మాదిరే లోగో, వెబ్‌, బిజినెస్ కార్డుల డిజైన్ల కోసం చాలామంది మమ్మ‌ల్ని సంప్ర‌దిస్తున్నారు" అని అలెక్ చెప్పుకొచ్చారు. భార‌త్‌కు చెందిన కొంతమంది టాప్ డిజైన‌ర్లు గ‌త నాలుగేళ్ల‌లో 60 వేల అమెరికా డాల‌ర్ల‌ను సంపాదించారని ఆయ‌న వివ‌రించారు. భార‌త డిజైన‌ర్లు ప్ర‌తి నెల వెయ్యి డాల‌ర్ల‌కుపైగా ఆర్జిస్తున్నారు.

డిజైన్ క్రౌడ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆడ‌మ్ అర్బోలినో

డిజైన్ క్రౌడ్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ఆడ‌మ్ అర్బోలినో


డిజైన్ క్రౌడ్ ఇప్ప‌టివ‌ర‌కు 5858 లోగో డిజైన్లు చేసింది. వ‌ర్జిన్‌కు టీష‌ర్ట్ డిజైన్‌, మైక్రోసాఫ్ట్‌కు గ్రాఫిక్ డిజైన్‌, హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌, టైమ్స్ స్క్వైర్‌కు చేసిన‌ లోగో డిజైన్ సంస్థ‌కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. టాటూ డిజైన్‌, ఫ్యామిలీ ఎంబ్ల‌మ్ డిజైన్స్‌వంటి ప‌నుల‌తోపాటు ప్ర‌ఖ్యాత హీరోలు స‌మాజంలో మంచి గుర్తింపు పొందేందుకు మంచి డ్రెస్ డిజైన్ల‌ను కూడా చేస్తున్న‌ది డిజైన్ క్రౌడ్‌. సేల్స్‌, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌, ఆప‌రేష‌న్స్ వంటి ప‌నుల‌ను చేసేందుకు ఈ సంస్థ‌లో 30 మంది ఉద్యోగులున్నారు. సంస్థ‌ను మ‌రింత విస్త‌రించాల‌ని అలెక్ భావిస్తున్నారు. ఇటీవ‌లే ఫిలిప్పీన్స్‌లో ఓ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. అలాగే అమెరికాలో కూడా ఓ ఆఫీస్‌ను ప్రారంభించ‌బోతున్నారు. క‌స్ట‌మ‌ర్ల డిమాండ్ల‌ను తీర్చేందుకు కొత్త భాష‌ల్లో సేవ‌ల‌ను అందించే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంది. మొత్తంగా ఆస్ట్రేలియాలో ఆరంభ‌మైన‌ప్ప‌టికీ ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన డిజైన్ల‌ను రూపొందించి క‌స్ట‌మ‌ర్ల మ‌న‌సుల‌ను చూర‌గొంటున్న‌ది డిజైన్ క్రౌడ్‌.

వెబ్‌సైట్‌: DesignCrowd.com