బడ్జెట్ ఇచ్చిన బూస్టుతో ప్రైవేట్ బస్సులు పరుగులు పెడతాయా..?

0

ప్రైవేట్ వాహనం రోడ్కెక్కాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. ఆర్టీఏ అధికారుల నుంచి పోలీసుల వరకు ఎన్నో అడ్డంకులు. అన్ని డాక్యుమెంట్లున్నా ఎంతోకొంత సమర్పించుకోవాలి. ప్రైవేట్ బస్సులు రూట్ పర్మిషన్ తెచ్చుకోవాలంటే కాళ్లూ గెడ్డాలు పట్టుకుని బతిమాలాలి. అయినా తడపాల్సిన చేతులు తడపాలి. ఇలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. రవాణారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శ్రీకారం చుట్టారు. రవాణాచట్టాన్ని సవరించి పర్మిట్ రాజ్ వ్యవస్థకు రాంరాం చెప్పారు. 

ఒక ముందడుగు

లైసెన్స్ రాజ్ ను తట్టుకోలేక జిప్ గో సంస్థ ఇటీవల తన వ్యాపారాన్ని మూసుకుంది. ఈ బడ్జెట్ దానికి జవసత్వాలు తెచ్చిపెట్టింది. మళ్లీ సర్వీసులు ప్రారంభిస్తామని జిప్ గో పట్టరాని ఉత్సాహంతో చెప్తోంది. ప్రైవేట్ రవాణారంగంలో మంచి వాతావరణం వస్తుందని చెప్పడానికి ఈ బడ్జెట్ ను ఒక సూచికగా అభివర్ణించింది. ఓలా షటిల్ లాంటి సంస్థలకు కూడా ఈ బడ్జెట్ గొప్ప ఊరటనిచ్చిందనే చెప్పాలి.   

 "ఆర్థిక మంత్రి జైట్లీ తీసుకున్న తీసుకున్న నిర్ణయం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకే కాదు... సామాన్యులకు కూడా లబ్ధి చేకూరుస్తుంది. ప్రయాణికులు హాయిగా... తక్కువ ఖర్చుతోనే గమ్యాన్ని చేరుతారు. దేశంలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయి"- జితేందర్ శర్మ, సీఈవో, జిప్ గో 

మోటార్ వెహికిల్ చట్టంలో సమూల మార్పులు తేబోతున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగరాల్లో ప్రయాణం సుఖమయం చేస్తామని… ప్రైవేట్ బస్సులకు ఈజీగా అనుమతులిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ బిల్లును ఇప్పటికే పార్లమెంట్ కు సమర్పించామని… అది పాసయ్యాక ఈ రంగంలో మరిన్ని స్టార్టప్ లు వస్తాయని చెప్పారు.

రవాణారంగంలో విజృంభిస్తున్న ఓలా, ఉబర్, ట్యాక్సీ ఫర్ ష్యూర్ లాంటి సంస్థలపై ప్రభుత్వం చాలా నియంత్రణలే విధించింది. లైసెన్స్ లకు సంబంధించి ఇప్పటికే చాలా వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ స్టార్టప్ లకు ఊరట లభించినట్లయ్యింది. ఈ దిశగా కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ డిపార్టుమెంట్ గత ఏడాది అక్టోబర్ లోనే కొన్ని సూచనలు చేసింది.

ప్రయాణికుల హర్షం

పది నెలల క్రితమే అమిత్ సింగ్- షటల్ అనే స్టార్టప్ ప్రారంభించారు. బాలారిష్టాలను ఎదుర్కొంటున్న తన కంపెనీ ఇప్పుడు పరుగులు తీస్తుందంటున్నారాయన. తన స్టార్టప్ కు పెట్టుబడులు వస్తాయని… ప్రయాణికుల సపోర్ట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

” ఆర్థిక మంత్రి ప్రకటన గొప్ప ఊరటనిచ్చింది. ఈ రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రావడానికి ద్వారాలు తెరిచారు. మాకుు చాలా ఆనందంగా ఉంది. ప్రయాణికులకు గౌరవమైన ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు అందిస్తాం.అమిత్ సింగ్


ప్రైవేట్ ట్రాన్స్ పోర్టర్లే కాదు… ప్రభుత్వాధికారులు కూడా జైట్లీ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికుల అవసరాలను ప్రభుత్వ బస్సులు తీర్చలేవని… నగరాల్లో ప్రైవేట్ బస్సులకు ద్వారాలు తెరవడం సరైన నిర్ణయమేనని కర్ణాటక అధికారులు చెప్పారు. జైట్లీ నిర్ణయాన్ని అన్ని వర్గాలవారు స్వాగతిస్తున్నారు. బస్సుల యజమానులు – ఆర్టీఓ అధికారుల మధ్యకూడా సుహృద్భావ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

రానున్న రెండేళ్లలో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య 15కోట్లకు చేరుకుంటుందని… ఇప్పటికే ఏడు కోట్ల మంది బస్సుల్లో తిరుగుతున్నారని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంతమంది ప్రయాణికులకు ప్రభుత్వ బస్సులు సరిపోవు… స్టార్టప్స్ రావాల్సిందే. అందుకే జైట్లీ నిర్ణయం సామాన్యు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేదే అని చెప్పవచ్చు. అటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.