హాలిడే ప్లానింగ్‌ను సింప్లిఫై చేసిన హాలిడిఫై

లో బడ్జెట్‌తో హిట్ కొట్టిన కుర్రాళ్లు..వీకెండ్ హాలిడేస్‌కి వీకెండ్ గెటవేస్..టూరిస్టుల టేస్ట్ మార్చేస్తున్న హాలిడిఫై..

హాలిడే ప్లానింగ్‌ను సింప్లిఫై చేసిన హాలిడిఫై

Thursday July 09, 2015,

4 min Read

వీకెండ్ వచ్చిందంటే టూర్ ప్లాన్ వెయ్యడం మీకు అలవాటా ? ఏడాదికోసారి లాంగ్ టూర్ వెళ్లాలన్నది మీ ఆలోచనా ? వెళ్లాలన్న ఐడియా బాగుంటుంది కానీ... ఎక్కడికి వెళ్లాలి ? ఎలా వెళ్లాలి ? అన్న దగ్గరే చాలామంది ఆలోచనలు ఆగిపోతుంటాయి. ఆన్‌లైన్‌లో ట్రావెల్ గైడెన్స్ ఇచ్చే వెబ్ సైట్లు ఉన్నా... అవి సందేహాలను పూర్తిగా తీర్చలేవు. ఈ లోటును గుర్తించిన ముగ్గురు కుర్రాళ్లు కొత్త వెబ్ సైట్‌ని ప్రారంభించారు. అదే హాలిడిఫై. అసలు ఈ వెబ్ సైట్ కథ ఎక్కడ మొదలైంది ? ఎలా మొదలైందో తెలుసుకుందాం.

హాలిడిఫై... సరికొత్త స్టార్టప్. చూడ్డానికి మిగతా ట్రావెల్ వెబ్‌సైట్లలా కనిపించొచ్చు. కానీ... కాస్త లోతుగా పరిశీలిస్తే తేడా ఏంటో అర్థమవుతుంది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా, అనుకూలమైన హాలిడే డెస్టినేషన్‌ను సెలెక్ట్ చేసుకోవడంలో విలువైన సమాచారాన్ని అందించే సరికొత్త ఆన్‌లైన్ వేదిక ఇది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి టూర్ వెళ్లాలనుకుంటే... ఎన్నికిలోమీటర్ల దూరంలో వెళ్లాలనుకుంటున్నారు ? ఎలాంటి ప్లేస్ అంటే బీచ్‌లు, ఎడారులు, అడ్వెంచర్, పుణ్యక్షేత్రాలు లాంటి వేర్వేరు కేటగిరీల్లో మీకు మంచి టూరిస్ట్ స్పాట్‌ను సజెస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకున్న వెబ్‌సైట్లలో పరిమితంగా వివరాలుంటాయి. కానీ హాలిడిఫైలో పూర్తి వివరాలను అందిస్తుంటారు. మ్యాప్, ఫిల్టర్ల సాయంతో పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసుకునే వీలుంది. వివరాలన్నీ చూశాక కూడా ఎక్కడికెళ్లాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ట్రావెల్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు.

రూ.1000 = 13,000 యూజర్లు

ఐఐటి బొంబాయ్‌కి చెందిన గ్రాడ్యుయేట్స్ కోవిద్ కపూర్, రోహిత్ ష్రాఫ్, ప్రతీక్ చౌహాన్‌లు ఈ వెబ్‌సైట్ రూపకర్తలు. పర్యాటక ప్రాంతాలంటే రొటీన్‌గా వినిపించే పేర్లు కాకుండా... మన చుట్టూ మరిన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయని గుర్తించిన ఈ ముగ్గురు వాటిని పర్యాటకులకు పరిచయం చేయాలనుకున్నారు. మొదట్లో వీకెండ్ ప్రాజెక్ట్‌లా ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఫుల్‌టైం దీని కోసమే పనిచేయడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా స్టార్టప్‌ని ప్రారంభించడం విశేషం. ఓ విషయం వింటే ఆశ్చర్యపోతారు. మొదట్లో వీరి మార్కెటింగ్ బడ్జెట్ కేవలం వెయ్యి రూపాయలే. ఆ వెయ్యి రూపాయల ఖర్చుతో మొదట్లో 13 వేల మంది యూజర్లను సంపాదించుకోవడం గొప్ప విషయం. ఇందుకోసం వీరు ప్రత్యేకమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలుపర్చి మిగతా స్టార్టప్‌లకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ వీరి మార్కెటింగ్ ఖర్చు తక్కువే.

image


యూజర్ల ఫీడ్ బ్యాకే కొండంత అండ

ఏ స్టార్టప్‌కైనా యూజర్ల ఫీడ్ బ్యాక్ అత్యంత కీలకం. సేవలను మరింత మెరుగుపరిచేందుకు, ఉత్పత్తులను ఇంకా బాగా తీర్చిదిద్దేందుకు వినియోగదారుల ఫీడ్ బ్యాక్ చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా ప్రతీ స్టార్టప్ అత్యుత్తమ సేవలను అందించాలని చూస్తుంటాయి. కానీ వాస్తవానికి అత్యుత్తమ సేవలన్న మాటే ఉండదు. ఎందుకంటే... ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిచేస్తుండటం, మార్పుచేర్పులు చేస్తుంటడంతో సేవలైనా, ఉత్పత్తులైనా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుంటాయి. అందుకే స్టార్టప్‌ యాజమాన్యాలు యూజర్ల ఫీడ్ బ్యాక్‌కు ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయవు. వేయలేవు. ఐడియా దశ నుంచే యూజర్ల అభిప్రాయాలు తీసుకోవడం మంచిదని నమ్ముతుంటారు. హ్యాపీ ఫాక్స్ ఫౌండర్ షాలిన్ జైన్ కూడా అలాంటి సలహానే ఇచ్చారు. మీ ఉత్పత్తులను, సేవలను వీలైనంత త్వరగా అమ్మడం, ప్రదర్శించడం మొదలుపెట్టమని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. సరిగ్గా హాలిడిఫై కూడా అలానే ప్రారంభమైంది. ఎక్కువ రోజులు ఆలోచించకుండా వెంటనే యూజర్స్‌కి తమను పరిచయం చేసుకున్నారు. 2013 నవంబర్‌లో హాలిడిఫైకి రిబ్బన్ కట్ చేస్తే మొదటి నాలుగు నెలల్లోనే యాక్టివ్ యూజర్ల సంఖ్య 150 శాతం పెరిగింది. 

"నవంబర్‌లో లాంఛ్ చేస్తే డిసెంబర్ లో మాకు 1500 రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. కానీ మొదటి నాలుగు నెలల్లోనే యాక్టీవ్ యూజర్స్ సంఖ్య 13 వేల మార్క్ దాటింది" అని గర్వంగా చెబుతారు కో ఫౌండర్ రోహిత్ ష్రాఫ్.

ఇంత వేగంగా ఎదగడానికి యూజర్స్ ఫీడ్ బ్యాక్ కారణమని వీరు నమ్ముతున్నారు. వీరి ప్రచార వ్యూహంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. మంచి కథనాలను, ఫోటో కాలమ్స్‌ని పోస్ట్ చెయ్యడమే కాకుండా... వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ బ్లాగ్‌లో మహా శివరాత్రి, హోలీ లాంటి పండుగలకు సంబంధించిన కథనాలను పోస్ట్ చేశారు. అంతే కాదు... భారతదేశంలోని అందమైన పర్యాటక ప్రాంతాలను చూపించిన 'హైవే' లాంటి సినిమాలను పోస్ట్ చేశారు. దీంతో రిజిస్ట్రేషన్లు, బ్లాగ్ ను వీక్షించే వారి సంఖ్య రెండింతలైంది.

సగటున ప్రతీ యూజర్ మూడు వేర్వేరు పర్యాటక ప్రాంతాలను బ్రౌజ్ చేసేవాళ్లు. 40 శాతం మంది యూజర్లు మూడు రోజుల్లో తిరిగి హాలిడిఫైని చూశారు. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లాలనుకునే ప్రాంతాలను వెతకడం సులభతరం చేసేందుకు... 'వారాంతపు విహారాలు' పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ గురించి ఒకరి ద్వారా మరొకరికి తెలిసింది. "యూజర్ల నుంచి మాకు చాలా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. మా గురించి కాలేజ్ క్యాంపస్, ఆఫీసుల్లో మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో మా వెబ్ సైట్‌ని షేర్ చేశారు. మేము ఎక్కువగా కష్టపడకపోయినా ఆ ప్రచారం వల్ల మాకు మరింత మంది యూజర్లు వచ్చారు. ఆ తర్వాత మా మరింత అత్యుత్తమ కంటెంట్‌తో మేము రంగంలోకి దిగాం. వాటికి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది" అంటాడు కోవిద్. ప్రస్తుతం వందల సంఖ్యలో ప్రదేశాల వివరాలను అందిస్తున్నారు. త్వరలో ఆ మార్క్ వెయ్యి దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

image


టూరిస్టుల టేస్ట్ మార్చేస్తున్న హాలిడిఫై

గతంలో అయితే ప్రముఖంగా వినిపించే ప్రాంతాలను సందర్శించేవారు. కానీ ఇప్పుడు పర్యాటకుల అభిరుచులు మారుతున్నాయి. కొత్త ప్రదేశాలను చూసేందుకు, ఎప్పుడూ వినని ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. చాలా మంది వినూత్నంగా ఉండే ప్రాంతాలపై ఆసక్తి చూపిస్తున్నారు. "పర్యాటకానికి సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాం. ఇవన్నీ పర్యాటకులకు కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు మరింత స్ఫూర్తిగా నిలిచాయి. అంతేకాదు తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లు, రెడ్ బస్ ద్వారా బస్సు సర్వీసులు, ఓలా క్యాబ్స్ ద్వారా క్యాబ్ బుకింగ్ సదుపాయం మాకు మరింత సహాయపడ్డాయి" అంటారు కోవిద్. యూజర్లకు మరింత దగ్గరయ్యేందుకు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు ట్రావెలాగ్ రైటింగ్ కాంటెస్ట్ నిర్వహించారు. అంటే ఇవి యాత్రా కథనాల్లాంటివి. ఎవరైనా టూర్ కి వెళ్లినప్పుడు అక్కడ ఎదురైన అనుభవాలు, అనుభూతుల సారాంశాన్ని వివరిస్తూ రాయడం, ఫోటోలను జతచెయ్యడమే ఈ కాంటెస్ట్. ఫోటోలు, వీడియోలు, రచన కలిపి పంపించాలి. ముగ్గురు విజేతలకు కాంప్లిమెంటరీ ట్రిప్‌ను బహుమతిగా ఇస్తారు. ఇలా రకరకాల ప్రచార వ్యూహాలతో పర్యాటకులకు మరింత దగ్గరవుతోంది హాలిడిఫై. 

WEBSITE