ఆడుతూపాడుతూ డబ్బు సంపాదిస్తున్న 'జెబూ గేమ్స్'

0

జాక్ గోల్డ్... స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్. మిగతా గ్రాడ్యుయేట్ సీనియర్లలా ఓ సమ్మర్‌లో ఆగ్నేయాసియా టూర్ వెళ్లాడు. స్నేహితుడు అక్షయ్‌తో కలిసి థాయ్‌లాండ్, ఇండోనేషియా, భారతదేశాల్లో పర్యటించి అడవుల్లో, సముద్రాల్లో తిరగాలనుకున్నారు. అనుకున్నట్టుగానే దేశమంతా తిరిగారు. భారతదేశంలో మైసూర్, కొయంబత్తూర్, చెన్నై ప్రాంతాల్లో పర్యటించారు. కాలేజీ రోజుల్లో ఎన్నో బోర్డ్ గేమ్స్ ఆడాడు జాక్. మొబైల్‌లో వర్డ్ గేమ్స్ అంటే ఇష్టం. కొత్తగా ఇంకేదైనా ట్రై చేయాలనుకున్నాడు. అప్పుడే అక్షయ్.. 'వర్డ్ మింట్' గేమ్‌ని పరిచయం చేశాడు. జెబూ గేమ్స్ తయారు చేసిన వర్డ్ గేమ్ అది. ఇదీ అన్ని గేమ్స్‌లా ఉంటుంది అనుకున్నాడు జాక్. కానీ ఆ గేమ్ కు అతుక్కుపోతానని ఊహించలేదు. సమ్మర్ ట్రిప్‌లో జాక్, అక్షయ్‌లు కలిసి వర్డ్ మింట్ ఆడటంలో పోటీ పడ్డారు. లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యామిలీ మెంబర్స్ స్కోరెంతో తెలుసుకునేందుకు వాట్సప్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేశాడంటే ఈ గేమ్‌కి ఎంతలా అడిక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క జాక్ మాత్రమే కాదు... ప్రపంచంలో మొబైల్ గేమ్ లవర్స్ కోట్లల్లో ఉంటారు. మొబైల్ గేమ్స్ మార్కెట్ తక్కువేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఇండస్ట్రీని పరిశీలించే సంస్థ ఇటీవలి రిపోర్ట్ ప్రకారం మొబైల్ గేమ్స్ వ్యాపారం సుమారు లక్ష కోట్లుంటుందని అంచనా. మొబైల్ మార్కెట్ వృద్ధి నిలకడగా కొనసాగుతోంది. గ్లోబల్ మొబైల్ గేమ్ కన్ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం 2014లో పాతిక బిలియన్ డాలర్ల మార్కెట్ ఉండగా... 2017 నాటికి నలబై మిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా. యాంగ్రీ బర్డ్స్, క్యాండీ క్రష్ లాంటివి... పది కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డౌన్ లోడ్స్ దాటాయి. రజిల్ లాంటి వర్డ్ గేమ్స్ కూడా ఐదు కోట్ల డౌన్ లోడ్స్ దాటాయంటే మొబైల్ గేమ్ లవర్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

జెబూ గేమ్.... లోడింగ్..

ఇక జెబూ గేమ్స్ స్టోరీ చూస్తే... ఇదీ ఓ మొబైల్ గేమ్స్ స్టార్టప్. సాధారణంగా స్టార్టప్‌ల పేరు వింటే కుర్రాళ్లు గుర్తొస్తారు. కానీ జెబూ గేమ్స్ స్టార్ట్ చేసిన శ్రీకృష్ణ, బికాష్ చౌదరీ ఇద్దరూ పిల్లల తండ్రులే. మొదట్లో బెంగళూరులో మొబైల్ గేమ్ స్టూడియోని ప్రారంభించాలనుకున్నారు. స్టార్టప్ సెక్టార్‌కు ఇద్దరూ కొత్తే. అయితే బికాష్‌కు మాత్రం ఇన్ మొబిలో పనిచేసిన అనుభవం కాస్త ఉంది. ఆ ధైర్యంతో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.

"2011 మధ్యలో మాకు ఈ ఐడియా వచ్చింది. అప్పుడే నేను ఈ రంగంలోకి అడ్డుపెట్టాను. ఈ మొబైల్ బిజినెస్ ఎంత పెద్దదో అని అప్పుడే నాకు తెలిసింది. చిన్నచిన్న బృందాలతో కలిసి లక్షలకు లక్షల రూపాయల వ్యాపారం ఎలా చేస్తున్నారో అర్థమైంది" అంటారు బికాష్.

గత నవంబర్ వరకు నేషనల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ నడిపించిన శ్రీకృష్ణ... అక్కడ బ్రేక్ తీసుకొని మళ్లీ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలనుకున్నారు. బికాష్, శ్రీకృష్ణ కలిసి పనిచెయ్యడం ఇదే మొదటిసారి కాదు. 2000 దశకంలో ఇంపల్స్ సాఫ్ట్ పేరుతో ఓ స్టార్టప్ కోసం పనిచేశారు వీరిద్దరూ. ఆ తర్వాత సిర్ఫ్ టెక్నాలజీ పేరుతో మరో స్టార్టప్ కోసం పనిచేశారు.

వినోదం+విజ్ఞానం= జెబూ గేమ్స్

నేర్చుకోవడాన్ని బోర్ గా ఫీలయ్యే వారికి... వినోదాన్ని పంచుతూ, విజ్ఞానాన్ని అందించేలా గేమ్స్ రూపొందిస్తోందీ సంస్థ. అసలు ఇలాంటి గేమ్స్ ఎలా తయారు చేయాలన్నదానిపై ఇద్దరూ ఎంతో మేథోమథనం చేశారు. ఆ తర్వాత మొబైల్ గేమింగ్ ఐడియా వచ్చింది. మిగతా ఆంట్రప్రెన్యూర్స్ లాగే తామూ చిన్నచిన్న తప్పులు చేస్తామన్న భయం వాళ్లని వెంటాడింది. అయితే వారికి గతంలో స్టార్టప్ ప్రారంభించిన అనుభవాలున్నాయి. తమకున్న అనుభవంతో కొత్త స్టార్టప్ ప్రారంభిస్తే ఆ తప్పులు చేయకుండా ఉంటామనున్నది వారి ధీమా. అలా జెబూ గేమ్స్ ప్రారంభించారు. 

మొదట ఆరు లక్షల రూపాయల పెట్టుబడితో రంగంలోకి దిగారు. అయితే వారి ఆలోచనలకు జీవం పోసే మొబైల్ గేమ్ డెవలపర్ కొరత ఉంది. అప్పుడే వారికి కొల్లోల్ దాస్ అనే మూడో ఫౌండర్ దొరికారు. ఆయన అద్భుతమైన గేమ్ డెవలపర్. ఇక ఈ ముగ్గురూ కలిసి తమ సంస్థ తరఫున తొలి గేమ్‌ను హోంబౌండ్ పేరుతో విడుదల చేశారు. సరిగ్గా డిసెంబర్‌లో విడుదలైన ఆర్కేడ్ గేమ్ ఇది. ఆ తర్వాత జెబూ గేమ్స్ మరో రెండు గేమ్స్ (వర్డ్ మింట్, ఫాలో ది డాట్స్) ప్రారంభించారు.

"వర్డ్ మింట్ సింగిల్ ప్లేయర్ గేమ్. యూజర్ సింగిల్ లెటర్స్‌తో మింట్ వర్డ్స్ తయారు చేయాలి. ఇక ఫాలో ది డాట్స్ ఫింగర్ రన్నర్ ట్రేసింగ్ గేమ్. ఈ రెండు గేమ్స్ ఎంతో వినోదాన్ని పంచుతాయి. పిల్లలతో గడిపే వాళ్లకి ఈ గేమ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. పదజాలం, చేతితో కంటి సమన్వయం పెంపొందించుకోవడానికి ఈ గేమ్స్ దోహదపడతాయి. ఇప్పటి వరకు రెస్పాన్స్ చాలా బాగుంది. శిక్షణా కేంద్రాల నుంచి మాకు ఫీడ్ బ్యాక్ వచ్చింది. వికలాంగులైన చిన్నారులు ఫాలో ది డాట్స్ గేమ్ కి బాగా రెస్పాండ్ అవుతున్నారట" అంటూ గర్వంగా చెబుతారు బికాష్.

ఫ్యూచర్ ప్లాన్

జెబూ గేమ్స్ వారి మొదటి గేమ్ హోం బౌండ్ ప్రస్తుతం దొరకట్లేదు. మిగతా రెండు గేమ్స్ పది వేలకు పైగా డౌన్ లోడ్స్ జరిగాయి. ఫ్రీ టు ప్లే గేమ్స్ తయారు చేయడాన్ని కొనసాగిస్తామంటోందీ సంస్థ. భవిష్యత్తులో ఇన్ గేమ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా ఆదాయం పొందాలనుకుంటోంది. ఫ్యూచర్ గురించి వీరికి స్పష్టమైన ప్రణాళికలున్నాయి. ఈ ఏడాదిలో ఐదు గేమ్స్, ఆ తర్వాత ఏడాదికి పన్నెండు గేమ్స్ రిలీజ్ చేయడం తర్వాతి టార్గెట్. ఇప్పటికే వీరి దగ్గర మరో మూడు గేమ్స్ నమూనాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ ఏడాదిలో ఐదు గేమ్స్ విడుదల చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కొత్తవి మిగతా గేమ్స్‌కు కొనసాగింపుగా ఉంటాయి. అన్నీ వర్డ్ గేమ్స్‌కు సంబంధించినవే. మరిన్ని భాషల్లో గేమ్స్ విడుదల చేయాలనుకుంటోందీ సంస్థ. ఆంట్రప్రెన్యూర్స్‌గా రాణిస్తున్న ఈ ఇద్దరు తండ్రులు... తమ పిల్లలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నారంటారు. "మా పిల్లలు మమ్మల్ని అడుగుతుంటారు... 'నాన్నతర్వాత గేమ్ ఏం రిలీజ్ చేయబోతున్నారు' అని" అంటారు శ్రీకృష్ణ.