పేదపిల్లలను చదివిస్తున్న ఈ ఆటోడ్రైవర్ మనసున్న మారాజు

0

రోజూ తండ్రి తాగి రావడం.. తల్లి నాలుగిళ్లలో పాచిపనులు చేయడం.. డబ్బుల విషయంలో ఇద్దరూ తగువులాడుకోవడం.. రాత్రిళ్లు పిల్లలు పస్తులు పడుకోవడం.. పేద మధ్యతరగతి ఇళ్లలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. ఫలితంగా పసివాళ్లు చదువుకు దూరమవుతుంటారు. తల్లికి ఆర్ధికంగా ఆసరా కావడానికి ఏదో ఒక పనిలో చేరిపోతారు.

అలా జరగడానికి వీల్లేదు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. అలాంటి వాళ్లందరినీ చేరదీసి పెద్దమనసుతో చదివిస్తున్నాడో ఆటో డ్రైవర్. తమిళనాడుకి చెందిన రాజా ఆటో నడుపుతుంటాడు. వచ్చిన నాలుగు డబ్బులు తన అవసరాలకే సరిపోవు. అయినా సరే ఒక మంచి పనిని తలకెత్తుకున్నాడు. ఆటో నడపగా వచ్చిన సంపాదనంతా పేద పిల్లల చదువుల కోసమే ఖర్చుపెడుతున్నాడు.

ముగ్గురు పిల్లలతో మొదలైన రాజా ప్రయాణం ఇవాళ 1,300 మంది విద్యార్ధుల దాకా వెళ్లింది. వాళ్లను పదో తరగతి వరకు సరిగా చదివిస్తే చాలు.. తర్వాతి భవిష్యత్ వాళ్లే చూసుకుంటారు అనేది రాజా నమ్మకం. కనీసం పుస్తకాలు కూడా కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద పిల్లలను చేరదీసి, వాళ్లకు బుక్స్, బ్యాగులు, లంచ్ బాక్సులు వగైరా కొనిస్తాడు. ఇతను చేస్తున్న మంచి పనికి ఉపాధ్యాయులు కూడా మద్దతు పలికారు. ప్రతీ విద్యార్ధి మీద ఎంత లేదన్నా ఏడాదికి రూ. 1,700 ఖర్చు పెడతాడు. అతని మంచితనమే అతనికి డబ్బు సమకూరుస్తుందని తోటి ఆటోడ్రైవర్లు అంటుంటారు.

గత ఏడాది తమిళనాడు వ్యాప్తంగా సుమారు 37,488 మంది పిల్లలు చదువు మధ్యలో మానేశారు. 2,203 మంది పిల్లల డ్రాపవుట్ తో కోయంబత్తూరు రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలబడింది. చదువు మధ్యలో ఆగిపోవడానికి కారణం పేదరికం.. అందునా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కుటుబాలే ఎక్కువ. అలాంటి పేదపిల్లల చదువుకు రాజా కొండంత అండగా ఉన్నాడు.

కేవలం పిల్లలను చదివించడంతోనే తన కర్తవ్యం అయిపోలేదు అంటాడు రాజా. హెచ్ఐవీ బారినపడ్డ పిల్లలకు కూడా మనోధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా వాళ్లు సంతోషంగా గడిపేలా చేస్తున్నాడు. పిల్లల కోసం ఏవో కొన్ని బహుమతులు తీసుకెళ్లడం.. వాళ్లతో సరదాగా ఆడిపాడటం లాంటివి చేస్తుంటాడు.

పేరులో రాజా ఉన్న ఈ ఆటో డ్రైవర్ నిజంగానే మనసున్న మారాజు..

Related Stories

Stories by team ys telugu