దాతృత్వం... దైవత్వం

 దాతృత్వం... దైవత్వం

Wednesday December 09, 2015,

2 min Read

ఇవ్వగలిగే గుణం ఈవి, ఒకప్పుడు అది రాజ ఠీవి. ఇప్పుడు రాజులు,రాజ్యాలు మచ్చుకు కొన్ని మిగిలాయి.

“ కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే ? వారేరీ సిరిమూట కట్టికొని పోవంజాలరే ? ” బలిచక్రవర్తి తన గురువైన శుక్రాచార్యునితో అన్న మాటలివి. ఎంత గొప్ప సత్యం ! సంపదను అనుభవించగలమే కానీ మూటగట్టుకొని పోలేము. ఇది గ్రహించాడు కాబట్టే బలిచక్రవర్తి చిరంజీవి కాగలిగాడు.

image


ఆధునిక కాలంలో జనం , సంపాదనకు ఇస్తున్న ప్రాధాన్యం సంసార బాధ్యతలు మోయడానికి కూడా ఇవ్వడం లేదు. ఇంత చేసి తన జీవిత కాలంలో మానవుడు తాను సంపాదించిన దానిలో 30శాతం కంటే ఎక్కువ ఖర్చుపెట్టలేడని అంచనా. తన సంతానం కోసం, వారి సంతానం కోసం చింతించి, వగచి, పొదుపుచేసి, గతించి కాటికి పోవడం నేటి మానవ ధర్మంగా మారిపోయింది.

ఇతరుల గురించి ఆలోచించడం, సాటివారికి సాయపడటం, సంఘానికి,దేశానికి , లోకానికి మేలు చేయాలని తపన పడటం లాంటివి ఈ రోజుల్లో ఎవరు చేస్తారు ? నూటికి, కోటికి ఒకడు చేసినా నేటి ప్రపంచం మరింత నివాస యోగ్యంగా మారుతుంది. 

మహాభారతంలో ఒక కథ ఉంది. అది కర్ణుడి దాతృత్వం గురించి చెబుతుంది. వర్షాకాలంలో యాగం తలపెట్టిన ఒక బ్రాహ్మణుడికి ఎండు కట్టెలు కావల్సివచ్చింది. అంతకు ముందు మాటిచ్చిన దుర్యోధనుడు కూడా మాట తప్పాడు. “ ఈ జడివానల్లో నీవు యాగం తలపెట్టడమే తప్పు” అని తిరిగి పంపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు కర్ణుడి వద్దకు వచ్చి యాచిస్తాడు. కర్ణుడు తన భవంతి పై కప్పుకు ఆలంబనగా వాడిన దంతెలను తన విలువిద్యా నైపుణ్యంతో తొలగించి ఇచ్చి పంపిస్తాడు. ఒకే సారి పది బండ్ల నిండూ ఎండు కట్టెలు! బ్రాహ్మణుని యాగం పూర్తయింది.

“ దుర్యోధనుడు రారాజు, కర్ణుడు తన సామంత రాజు. కానీ దానగుణంలో రారాజును మించిన మారాజు..! ”
image


నేటి కాలంలో కూడా అపర కుబేరులున్నారు. కానీ సాటి మనిషికి సాయం చేయాలనుకునే వారు చాలా తక్కువ. భార్యలకు బహుమానంగా విమానాలను విహంగాలుగా కొనిచ్చే వారిని మనం చూస్తున్నాం. వేల కోట్లు ఖర్చుపెట్టి అద్భుతమైన భవంతులను కట్టి, ఇదే మా నివాసం అని విలాసంగా లోకానికి చాటి చెప్పేవాళ్లు, మన దేశంలోనూ ఉన్నారు. ఒక మహానగరం కన్నీటి కడలిగా మారినా, నీట మునిగినా అటువైపు తిరిగిచూడని వాళ్లు, ఒక్క రూపాయి విదల్చని వాళ్లు మన దేశంలోనే అపర కుబేరులు జాబితాలో ఉన్నారు.

కానీ ఒక ఆడపిల్ల తొలి సంతానంగా జన్మించిన శుభ వేళ, లోక కళ్యాణం కోసం తన సంపాదనలో 99 శాతం.. దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయిలు విరాళంగా ప్రకటించారు మార్క్ జుకెర్‌బర్గ్, ప్రిసిల్లా చాన్ దంపతులు. వాళ్ల పుత్రిక మాక్సిమా మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలి ఉంటారు.

image


మహాధనవంతుడు బిల్ గేట్స్ ఇచ్చిన 95శాతం కంటే ఈ 99శాతం భారీ విరాళంతో మార్క్ జుకెర్‌బర్గ్ ఒక కొత్త ‘మర్క్’ ని సాధించాడు. ముఖ పుస్తకం(ఫేస్ బుక్) సృష్టికర్త మనుషుల గుండెలపై చెరగని ముఖ చిత్రంగా, తన చిన్న కుటుంబాన్ని చిత్రించాడు. ఈ యువ దంపతులు తమకు పుత్రికగా జన్మించిన మాక్సిమాతో పాటు కలకాలం వర్థిల్లాలి.

- దేశం జగన్‌మోహన్‌ రెడ్డి