స్టార్టప్‌ ప్రారంభిస్తున్నారా ? అయితే ఈ ఐదు అగ్రిమెంట్లు తప్పనిసరి !

స్టార్టప్ ప్రారంభించాలంటే ముందు ఏం చేయాలి ?ఎలాంటి ఒప్పందాలు ఉండాలి ? ఏ తరహా డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసుకోవాలి ?ఏ అగ్రిమెంట్ లేకపోతే ఏంటి ఇబ్బంది ?

స్టార్టప్‌ ప్రారంభిస్తున్నారా ? అయితే ఈ ఐదు అగ్రిమెంట్లు తప్పనిసరి !

Thursday June 04, 2015,

3 min Read

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు... తమ ఆలోచనలను ఓ కంపెనీగా, పరిశ్రమగా మార్చేందుకు మహా ఉత్సాహంగా ఉంటారు. తమ ప్రణాళికలు పదును పెట్టడంలో బాగా బిజీగా గడిపేస్తుంటారు. అయితే కొన్ని కీలకమైన న్యాయపరమైన విషయాలను అసలు మొదలుపెట్టకుండానో, మధ్యలోనో వదిలేస్తుంటారు. కానీ కొన్ని ఒప్పందాలు ఏ పారిశ్రామికవేత్త కూడా అసలు మర్చిపోకూడదు. అలాంటివి ఐదు అగ్రిమెంట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

image


1) వ్యవస్థాపక ఒప్పందాలు(Founder Agreements)

ఏర్పాటు చేయబోతున్న సంస్థ ఏదో నిర్ణయించుకోగానే.. ఎలాంటి భేషజాలకూ పోకుండా వ్యవస్థాపకులందరూ కలిసి ఫౌండర్ అగ్రిమెంట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ అది భాగస్వామ్య కంపెనీ అయిన పక్షంలో పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ తప్పనిసరి. వ్యాపారాన్ని ఏ విధంగా నడపదల్చుకున్నారో భాగస్వాములందరూ ఒప్పందం చేసుకోవాలి. అవన్నీ అగ్రిమెంట్‌లో ఉండాలి. వ్యవస్థాపకులు అందిస్తున్న మూలధనం వివరాలు- వారు విధిస్తున్న షరతులతో పాటు... ఆ కంపెనీ నిర్వహణకు అవసరమైన మేథో సంపత్తిని అందిస్తున్న వ్యక్తి వివరాలు, దానికి సంబంధించిన లైసెన్స్ డీటైల్స్‌ను అగ్రిమెంట్‌లో పొందుపరచాలి. భవిష్యత్తులో షేర్ల జారీ చేసే అవకాశం, దానికి సంబంధించిన అధికారం ఎవరిదో వివరించాలి. యజమానుల మధ్య మౌఖిక ఒప్పందాలు, పరస్పర అవగాహన చాలా ముఖ్యమే అయినా... రాతపూర్వక ఒప్పందాలు అంతకు మించి అవసరమని చాలామంది పారిశ్రామికవేత్తలు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇలాంటి ఒప్పందం లేకపోవడంతో చాలా కంపెనీలు కార్యకలాపాలు మానేసి, మూసివేయాల్సిన అవసరం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యవస్థాపకుల మధ్య విబేధాలు వచ్చినపుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఫౌండర్ అగ్రిమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

2) ఛార్టర్ డాక్యుమెంట్స్

మెమరాండం ఆఫ్ అసోసియేషన్(MoA), సంస్థకు గురించిన వివరాలు ఉండే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(AoA)లు ఛార్టర్ డాక్యుమెంట్స్‌లో ఉంటాయి. సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, ఆయా వ్యక్తుల వాటాల వివరాలు, మెంబర్ల బాధ్యతల వంటివి మెమరాండం ఆఫ్ అసోసియేషన్‌లో ఉంటాయి. జనరల్ మీటింగ్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు, వోటింగ్ హక్కుల వివరాలు వంటి కంపెనీ నిర్వహణకు సంబంధించిన డీటైల్స్ ఏఓఏలో చూడొచ్చు.

3) ట్రేడ్‌మార్క్ లైసెన్స్ అగ్రిమెంట్స్

ఏ కంపెనీకయినా, వ్యవస్థాపకులకైనా ట్రేడ్‌మార్క్ ఓనర్లతో ఒప్పందాలు తప్పనిసరి. లేకపోతే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ తరహా కాంట్రాక్ట్ ద్వారా సొంతదారులతో ట్రేడ్‌మార్క్ వినియోగంపై హక్కును పొందచ్చు. ఆ బ్రాండ్ వినియోగానికి సంబంధించిన అధికారం దక్కించుకోవచ్చు. రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్, వస్త్ర దుకాణాల వంటి ఉత్పత్తులు, సేవలందించే స్టార్టప్‌లకు ఈ అగ్రిమెంట్ చాలా ముఖ్యం. ఓ బ్రాండ్‌ను వారు నిర్మించుకోవడమో, అభివృద్ధి చేయడమో, ఉపయోగించుకోవడమో చేయడం ద్వారా ఆయా కంపెనీ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫ్రాంచైజీ రూట్లో మార్కెట్ పెంచుకోవాలని అనుకునేవారికీ ఈ తరహ బ్రాండింగ్ తప్పనసరి. స్థానిక విక్రేతల నుంచి వేరుగా కనిపించడం కోసం.. ఇలాంటి బ్రాండింగ్ కోసం పాకులాడతాయి కంపెనీలు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులనుంచి గట్టెక్కించేందుకు ట్రేడ్‌మార్క్ లైసెన్స్ అగ్రిమెంట్ ఉపయోగపడుతుంది.

4) ఎంప్లాయ్‌మెంట్ అగ్రిమెంట్

ఉద్యోగుల హక్కులు, బాధ్యతలు, విధులు, ప్రయోజనాలతో కూడిన ఒప్పందం కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక వేళ ఏదైనా కంపెనీ మేథో సంపత్తి, మానవ వనరులపై ఆధారపడితే... ఐపీ ప్రొటెక్షన్ నిబంధనలపైనా ఒప్పందాలుండాలి. యజమానికి మేథో సంపత్తిని దోచుకున్నాడనో, తస్కరించారనో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ వ్యవస్థాపకుడే మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం జరిగితే... దానికీ ఓ ఒప్పందం ఉండాలి. ఎండీ నియామకంపై కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం బోర్డ్/షేర్ హోల్డర్ల ఆమోదంతో ఓ రిజల్యూషన్ పాస్ చేయాలి. వర్క్ ప్లేస్‌లలో లైంగిక వేధింపులు, సెక్యూరిటీ ట్రేడింగ్, అవినీతి నిరోధం వంటి కొత్త చట్టాలపైనా అవగాహన ఉండాల్సిందే.

5) షేర్ సబ్‌స్క్రిప్షన్

ఈ ఒప్పందంలో యాజమాన్యానికి లభించే వాటా, షేర్ హోల్డర్ల హక్కులతో పాటు వాటికి సంబంధించిన నియమ, నిబంధనలన్నీ ఉంటాయి. అలాగే భవిష్యత్తులో షేర్ల విక్రయం, తిరిగి కొనుగోలు వంటి వాటినీ పొందుపరచచ్చు. ఎవరైనా వైదొలగాలని అనుకుంటే అందుకోసమూ రూల్స్ ఉంటాయి. విస్తరణ, నిర్వహణ వంటి కార్యకలాపాల కోసం మరుసటి రౌండ్ నిధులు సేకరించేందుకు... మదుపర్లు, షేర్ హోల్డర్ల నుంచి ఏ తరహా అనుమతులు కావాలో నిర్ణయించుకోవచ్చు. కేపిటల్ వినియోగంపై షేర్ హోల్డర్లు, మేనేజ్మెంట్ మధ్య కుదిరే కీలక ఒప్పందం ఇది. కీలకమైన డాక్యుమెంట్ల రూపకల్పన, నిర్వహణ విషయంలో వ్యవస్థాపకులకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది.

రచయిత గురించి రెండు మాటలు

హరిణి సుబ్రమణి, విషయ నిపుణురాలు

హరిణి సుబ్రమణి, విషయ నిపుణురాలు


ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో హరిణి సుబ్రమణి రచించారు. జె.సాగర్ అసోసియేట్స్‌లో కన్సల్టెంట్. చెన్నైలో ఉన్న ఈ సంస్థలో కార్పొరేట్ కమర్షియల్ టీంలో పని చేస్తున్నారు హరిణి. ప్రైవేట్ ఈక్విటీ కొనుగోలు ఒప్పందాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి. ఈమె స్టార్టప్ కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు న్యాయ సలహాలు ఇస్తుంటారు. www.indialawforindiastartups.wordpress.com బ్లాగ్‌కు జె.సాగర్ అసోసియేట్స్‌ భాగస్వామి ఆరతి శివనాధ్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. న్యాయవృత్తి విభాగంలోకి వెళ్లేముందు జర్నలిస్టుగా ది మింట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి కంపెనీలకు విలీనాలు, కొనుగోళ్లపై పలు కథనాలు రాశారు హరిణి సుబ్రమణి.