పసిపిల్లలకు మర్దనా చేసేందుకు పుట్టిన సంగోపన్

2011లో కేవలం ఇద్దరితో మొదలైన సంగోపన్ నాలుగేళ్ళలో అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు సంగోపన్ లో 12 మంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యిమంది తల్లిబిడ్డలకు మసాజ్ సేవలు అందించారు.

పసిపిల్లలకు మర్దనా చేసేందుకు పుట్టిన సంగోపన్

Friday May 01, 2015,

3 min Read

‘‘మొన్న రీచా ఫోన్ చేసింది. 8నెలల గర్భవతిగా వున్న రీచా.. ఈసారి కూడా పుట్టిన బిడ్డకి సంగోపన్ మర్దన కావాలంటోంది. నాలుగేళ్ళ క్రితం సంగోపన్ మొదలైనపుడు రీచా తన తొలిబిడ్డకి ఇక్కడే మర్దన చేయించింది. సంగోపన్ లో జరిగిన మొదటి మసాజ్ కూడా అదే. అప్పటి నుంచీ ఆమె సంగోపన్ సేవలను మర్చిపోలేదు. అందుకే మళ్ళీ వస్తోంది. ’’ అని సంగోపన్ మేనేజింగ్ డైరక్టర్ తేజశ్రీ ఆనందంగా చెప్పారు.

పసిపిల్లలకు చేసే మర్దనా

పసిపిల్లలకు చేసే మర్దనా


సంగోపన్ అనేది సంస్కృత మూలాలున్న పదం. దీనికి అర్థం శిశు సంరక్షణ. అమ్మతనం అనేది స్త్రీ జీవితంలో అత్యంత అమూల్యమైనది. బిడ్డకు జన్మనిచ్చే తల్లి మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులకు లోనవుతుంది. సంగోపన్‌లో మేం సంప్రదాయ మెళకువలను, ఆధునిక వైద్యశాస్త్రాన్ని కలగలిపి పుట్టిన బిడ్డకు, బాలింతరాలకి మసాజ్ చేస్తాం..’’ అంటారు తేజశ్రీ.

అకౌంట్స్ నుంచి హెల్త్ కేర్ వరకు

చదివింది కామర్స్, అకౌంట్స్ అయినా, తేజశ్రీకి చిన్నప్పటినుంచి వైద్యం, ఆరోగ్యసేవలంటేనే మక్కువ ఎక్కువ. హోమియోపతిలో పోస్టల్ కోర్సులు చేసిన తేజశ్రీ, హైదరాబాద్ లోని ఓ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ కంపెనీలో పనిచేసారు. ఇంటి నుంచే పలు కంపెనీలకు ఎడిటర్‌గా పనిచేయగలగడం ఎంతో సంతృప్తినిచ్చింది అంటారు. దాంతో పాటు వైద్యశాస్త్రంపై ఆమె అవగాహన కూడా పెరిగింది.

తేజశ్రీ కాన్పుర్‌లో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి లెదర్ ఫ్యాక్టరీలో టెక్నాలజిస్టు.

‘‘మా నాన్న ఉన్నంత వరకూ ఆయన సంపాదన మీదే కుటుంబం నడిచేది. ఆయన చనిపోయాక, మా అమ్మ ప్రింటింగ్ బిజినెస్ మొదలుపెట్టింది. నాలో కూడా వ్యాపారానికి సంబంధించిన ఆసక్తి అప్పుడే మొదలైంది.’’ అని చెప్పారు తేజశ్రీ.

తమ టీంతో తేజశ్రీ

తమ టీంతో తేజశ్రీ


సంగోపన్ ఎలా పుట్టిందంటే..

తేజశ్రీ రెండో బిడ్డ కడుపులో వున్నప్పుడు, బిడ్డ పుట్టగానే మర్దన చేయడానికి ఒక ట్రెయిన్డ్ నర్స్ కోసం వెతికారు. అయితే, అలాంటి నర్సు దొరకడం చాలా కష్టమైంది. దీంతో ఈ రంగంలో డిమాండ్ చాలా వుందని ఆమెకి అర్థమైంది.

‘‘ఇటు తల్లులైన వారికి ఈ మర్దనా చేసేవారి అవసరం ఎంతుందో.. ఈ రంగంలో ఉద్యోగాలు కల్పించడం ద్వారా సమాజంలో వెనకబడిన వారిని ఆదుకునే అవకాశం కూడా ఉందనిపించింది.’’ అని సంగోపన్ వెనుక ఉద్దేశాన్ని వివరించారు తేజశ్రీ.

‘‘ఆడవాళ్ళంటేనే ఉద్యోగానికి, ఇంటిపనికీ సమతూకం పాటించాల్సి వుంటుంది. నేను గతంలో మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ రంగాన్నిఎంచుకున్నది కూడా అందుకే. ఈ సంగోపన్‌లో కూడా నేను, నాతో పాటు పనిచేసే మహిళలు, ఇటు వృత్తికీ, అటు కుటుంబానికీ సమానంగా ప్రాధాన్యం ఇవ్వొచ్చని అనిపించింది’’ అంటారు తేజశ్రీ.

ఇలా చాలా రకాలుగా ఆలోచించిన తర్వాత ఇలాంటి మర్దన అవసరమున్న తల్లుల వివరాల కోసం పేరంటింగ్ ఫోరమ్‌కు ఓ మెయిల్ పంపారు తేజశ్రీ. ఆ మెయిల్ కు వచ్చిన విపరీతమైన స్పందన చూసిన వెంటనే 2011లో పదివేల రూపాయల నామమాత్రపు పెట్టుబడితో సంగోపన్ మొదలైంది.

ఎత్తుపల్లాలు, ఎదురుదెబ్బలు

ఈ పనిలో ఇప్పుడు తేజశ్రీ టీమ్ ఎక్కడ లేని ఆనందాన్ని ఆస్వాదిస్తోంది . అయితే, సంగోపన్ ప్రయాణం అంతా పూలదారి కాదు. ఎన్నెన్నో సవాళ్ళు.. ప్రతి సవాలునూ ఓ పాఠంగా మార్చుకుని, ప్రగతికి దారులు వేసుకున్నారు.. తేజశ్రీ.

‘‘ ఇదసలే అప్పుడే పుట్టిన బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం. అయితే, మా మెయిడ్స్, నర్సింగ్ మెయిడ్స్, చెప్పిన టైమ్ కి రాకపోవడంతో చాలా సార్లు విసుగొచ్చేది. అయితే, ఓపికగా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కష్టనష్టాలను కూడా తెలుసుకుంటూ, ఈ పనిలో వారి అవసరాన్ని వారికి అర్థమయ్యేలా వివరిస్తూ.. మొత్తం వ్యవహారాన్ని ఒక దారికి తీసుకురావడం, ఒక పెద్ద యజ్ఞమే..

‘‘వ్యాపారమెళకువలు అలవాటు చేసుకోవడం ఇంకో పెద్ద సవాలు. ఇప్పటికీ సంగోపన్‌లో నేనొక్కదాన్నే అన్ని ఎంక్వయిరీలకు స్పందించే సేల్స్ పర్సన్‌ని. గడిచిన నాలుగేళ్లలో దాదాపు 300 మంది తల్లులతో మాట్లాడి, మా సేవల గురించి వాటి ప్రయోజనం గురించి వివరించాను.. ’’అన్నారు తేజశ్రీ.

తేజశ్రీ రెండో కూతురు నాలుగేళ్ళవయసున్నపుడు సంగోపన్ మొదలైంది. దీంతో ఆమె ఇటు ఇంటిని, అటు కంపెనీని చూసుకోవడం చాలా కష్టమయ్యేది. ఇదంతా అప్పుడూ ఇప్పుడూ కష్టమే. చాలా సార్లు ఇక ఈ వ్యాపారం మన వల్ల కాదు.. వదిలేద్దాం.. అనిపిచేది. కానీ, నా భర్త ఇచ్చిన సహకారంతో ఈ సవాళ్లను అధిగమించగలిగాను’’ అని అంటారు తేజశ్రీ.


తేజశ్రీ జోషి, సంగోపన్ సిఈఓ

తేజశ్రీ జోషి, సంగోపన్ సిఈఓ


మరిచిపోలేని క్షణాలు

‘‘ఎన్ని సమస్యలున్నా.. కస్టమర్ల సంతృప్తి ముందు అవన్నీ పెద్ద దూదిపింజల్లా మారిపోయేవి. బిడ్డకి మర్దనా ఎలా చేయాలో.. ఒక తల్లికి నేర్పినప్పుడు, ఆమె తండ్రి కళ్ళల్లో ఆనందభాష్పాలు చూసినప్పుడు, కవలల్ని కన్న ఓ తల్లి మా సేవల్ని దాదాపు ఏడాది పాటు వినియోగించుకున్నప్పుడు, కేవలం మా సేవల కోసమే, ఓ జంట అమెరికా నుంచి బెంగళూరు వచ్చి మూడునెలల పాటు సర్వీస్ అపార్టమెంట్లో ఉన్నప్పుడు.. మాకు కలిగిన తృప్తి ముందు ఎన్ని కోట్లయినా తక్కువే. ’’అని నవ్వేసారు. తేజశ్రీ.

భవిష్యత్తు

భవిష్యత్తు మరింత ఆసక్తిగా, ప్రోత్సాహకరంగా వుంది ఈ రంగంలోకి మరికొంత మంది వచ్చారు. అయితే, ఎంతమందొచ్చినా సరిపోయేంత డిమాండ్ వున్న రంగం ఇది.

‘‘ఈ రంగంలో మేమే ఆద్యులం, మాదే అతి పెద్ద సంస్థ అనే తృప్తి వుంది’ ’అని గర్వంగా చెప్పారు తేజశ్రీ. త్వరలోనే కన్సల్టేషన్ వర్క్ షాపులు, యోగా, లమాజే సేవలు, నానీ(ఆయమ్మ) సేవలు వంటివి కలుపుకుంటూ, తమ వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని తేజశ్రీ ప్లాన్ చేస్తున్నారు.

WEBSITE - SANGOPAN