ఈ-చెత్తకు సరైన పరిష్కారం.. సామాజిక బాధ్యతతో కూడిన వ్యాపారం  

దేశంలోనే మొట్టమొదటి సోషల్ రెస్పాన్సిబిలిటీ స్టార్టప్

1

ఎలక్ట్రానిక్ రంగం నానాటికీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త గాడ్జెట్ మార్కెట్లోకి వస్తోంది. పాత వెర్షన్లన్నీ క్రమంగా మూలకు పడుతున్నాయి. పెన్ డ్రైవ్ దగ్గర్నుంచి లాప్ టాప్ దాకా పాతవి చెత్తకుప్పలో పడేసి.. కొత్తవాటి వెంట పరుగులు పెడుతున్నారు. ఇలా పాడైపోయినవీ, పాతబడ్డవి గార్బేజీలో పడేయడం వల్ల కలిగే ముప్పు ఏంత తీవ్రంగా ఉంటుందో చాలామందికి తెలియదు. అన్నిటికంటే అతి ప్రమాదకరమైనది ఎలక్ట్రానిక్ వేస్టేజీ అని గుర్తించేవారు తక్కువ మంది. ఆ ముప్పు నుంచి కాపాడ్డానికే ఈ-వేస్టేజీ రీసైకిల్ మెకానిజంతో ముందుకొచ్చింది టెర్రాప్రో. ఆ మాటకొస్తే ఇది దేశంలోనే ఇది మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ స్టార్టప్.

ఎలక్ట్రానిక్ వేస్టేజీలో ప్రపంచంలోనే ఇండియా ఐదో అదిపెద్ద దేశం. 95 శాతం అసంఘటిత రంగాల ద్వారానే ఈ-చెత్తంతా పోగవుతోంది. ఈ-వేస్టేజీ తగలబెట్టడం మూలంగానో, అడ్డగోలుగా పారబోయడం వల్లనో, పర్యావరణం దారుణంగా దెబ్బతింటోంది. అత్యంత విషరసాయనాలు వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. 70 శాతం చెత్త కంప్యూటర్, ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారానే పోగవుతోంది. 15 శాతం మెడికల్, ఎలక్ట్రికల్ నుంచి వస్తుంది. ఈ-వేస్టేజీ ద్వారా 40శాతం నుంచి 70 శాతం విషపూరిత హెవీ మెటల్స్ భూమిలో కలిసిపోతున్నాయి. ఏడాదికి 30శాతం చొప్పున ఎలక్ట్రానిక్ వేస్టేజీ పెరిగిపోతోందని అసోచాం నివేదికలో తేలింది. 5 నుంచి 7 లక్షల మంది చిన్నారులు ఈ వేస్టేజీ సేకరణలో, డంప్ యార్డుల్లో మగ్గిపోతున్నారు.

అందుకే జీరో లాండ్ ఫిల్ పాలసీతో, చైల్డ్ లేబర్ అనే మాటే లేకుండా, కాలుష్య రహిత వాతావరణం కోసం ఈ వేస్టేజీనంతా రీసైకిల్ చేసే బాధ్యత భుజాలకెత్తుకుంది టెర్రాప్రో స్టార్టప్.

హేమంత్ బగాయ్‌, మాణిక్ బగాయ్‌. ఈ ఇద్దరు టెర్రాప్రో స్టార్టప్ ఫౌండర్లు. ఇది బేసిగ్గా యూరోపియన్ కాన్సెప్ట్. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన దగ్గర స్టార్టప్ నెలకొల్పారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో కలిసి ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది.

పేరు చివర ఇద్దరికీ బగాయ్ ఉండటంతో ఒకే కుటుబం అనుకునే ప్రమాదముంది. నిజానికి వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఫ్రెండ్స్ మాత్రమే. 2008లో ఇన్ఫోసిస్ లో పరిచయమయ్యారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు షిఫ్టయ్యారు. మాణిక్ ఎంబీయే రూరల్ మేనేజ్‌మెంట్ చేయడానికి వెళ్తే.. ఫైనాన్షిల్ కన్సల్టెంట్ గా హేమంత్ ఓ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఐఐఎం లక్నో నుంచి ఎంబీఏ చేశాడు. మళ్లీ ఇద్దరూ అనుకోకుండా ఏడాదిక్రితం ఒక సందర్భంలో కలిశారు. రూరల్ బ్యాంకింగ్, కేపిటల్ మార్కెట్, టెలికం, ఫైనాన్స్.. ఇలా ఇద్దరి క్యుమిలేటివ్ ఎక్స్ పీరియెన్స్ 19 సంవత్సరాలు. ఆ అనుభవంతోనే టెర్రాప్రో స్టార్టప్ నెలకొల్పారు.

మొదటి ఆరు నెలలు ఊపిరి సలపని పని. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సీఎఫ్‌ఎల్ తయారీదారుల నుంచి అవకాశాలు వచ్చాయి. ఈపీఆర్, కన్సల్టింగ్, ఈపీఆర్ ప్లాన్, రిటర్న్స్ ఇలా అన్ని సర్వీసులను అనతికాలంలోనే ఇవ్వగలిగింది టెర్రాప్రో.

ఈపీఆర్ అంటే ఎక్స్ టెండెడ్ ప్రాడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే గార్బేజీ కింద పడిన అన్ని ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ ని రి సైకిల్ చేయడమన్నమాట. ఇక ఈపీఆర్ రిటర్న్ అనేది -ఆదాయపన్ను కోసం ఐటీ రిటర్న్స్ సమర్పించినట్టు.. అంటే ఉత్పత్తిదారు ఏడాదిపాటు ఎంత వేస్టేజీ- మేనేజ్మెంట్ కోసం ఇచ్చాడో టెర్రాప్రో ఒక నివేదిక ఇస్తుంది. దాన్ని సదరు కంపెనీ ఐటీ రిటర్న్ లాగా ప్రభుత్వానికి తెలుపుతుంది.. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కంపెనీ ఇంత చెత్తను రీ సైకిల్ చేసింది అని నివేదికలో పేర్కొంటుంది.

పర్యావరణ పరిరక్షణ చట్టం(1986)లో భాగంగా 2011లో మొదటిసారిగా కేంద్రం ఈ-వేస్ట్ మేనేజ్మెంగ్ నియమ నిబంధనలు రూపొందిచింది. 2016 మార్చిలో దానికి సంబంధించిన కొన్ని సవరణలు కూడా చేసింది. అన్ని కంపెనీలను ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేసే విధంగా ప్రేరేపించింది.

అయితే, టెర్రాప్రో ఈపీఆర్ మాండేట్ ఒక్కటే కాకుండా, కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీలు, డిజిటల్ ఇండియాకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మెథడాలజీని ఫాలో అవుతోంది.

డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాల్లో ఈ-వేస్ట్ మనేజ్మెంట్ కూడా ఒక భాగమే. చెప్పాలంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఇది గుండెకాయలాంటిది. ఎందుకంటే స్మార్ట్ సిటీ కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాడతామో ఈ వేస్టేజ్ కూడా అంతే నిష్పత్తిలో విడులవుతుంది.

ఇక టెర్రాప్రో టీం గురించి చెప్పాలంటే.. మాణిక్ ఆపరేషన్స్ చూసుకుంటాడు. హేమంత్ బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చూసుకుంటాడు. ప్రస్తుతానికైతే ప్రథమ శ్రేణి నగరాల్లో టెక్నికల్ టీం, ఆపరేషన్స్ స్టాఫ్ ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఆపరేషన్స్ నిర్వహించాలనేది కంపెనీ షార్ట్ టర్మ్ ప్లాన్. భవిష్యత్తులో రాష్ట్రాల వారీగా వేస్ట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్లతో ఒప్పందం కుదుర్చుకుని.. సొంతంగా డిస్పోజల్ సైట్ నెలకొల్పాలని లాంగ్ టర్మ్ ప్లాన్ గా పెట్టుకుంది.

ప్రస్తుతానికి ఢిల్లీతో పాటు నోయిడా, గూర్గావ్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, ముంబైలో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వేస్టేజీ ద్వారా పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ తెస్తున్నారు.

ప్రస్తుత జమానాలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక గాడ్జెట్ ఉంటోంది. డిమాండ్ కు తగ్గట్టే ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. అయితే ప్రతీ కంపెనీ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తోందే తప్ప.. పాడైపోయిన, పాత వస్తువులను బాధ్యతగా రీ సైకిల్ చేయడం లేదు. వాటినలా చెత్తకింద పారబోయడం వల్ల పర్యావరణానికి అంతులేని కీడు జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా టెర్రాప్రో వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది.

“Reduce consumption as much as you can and reuse for as long as you can”- మాణిక్, హేమంత్ సిద్ధాంతం ఇదే.  

Related Stories