మూడేళ్లు.. వెయ్యి మంది క‌స్ట‌మ‌ర్లు.. రూ.250 కోట్ల లోన్లు.. కేపిట‌ల్ ఫ్లోట్ విజ‌య గాథ!

Sunday March 06, 2016,

4 min Read


మీరొక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. వ్యాపారం ఎంత చిన్న‌దైనా పెట్టుబ‌డి కంపల్సరీ! కిందా మీదా ప‌డి కొంత రొక్కం స‌మ‌కూర్చారు! కానీ అది స‌రిపోదు! పోనీ బ్యాంకు నుంచి అప్పు తెద్దామా అంటే.. కాళ్ల‌రిగేలా తిరిగినా లోన్ వస్తుందన్న గ్యారంటీ లేదు! మ‌రెలా? స‌రిగ్గా మీ లాంటి వాళ్ల కోస‌మే వ‌చ్చింది కేపిట‌ల్ ఫ్లోట్! ఒకే ఒక్క క్లిక్ తో ఆన్ లైన్ లోనే రుణం మంజూరు చేస్తుంది!

ఏమిటీ కేపిటల్ ఫ్లోట్..?

కేపిట‌ల్ ఫ్లోట్ గురించి తెలుసుకునే ముందు శశాంక్ రిష్యాశ్రింగా, గౌరవ్ హిందూజా గురించి తెలుసుకోవాలి. ఇద్ద‌రూ స్టాన్ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్. మేనేజ్ మెంట్ పాఠాలు ఔపోస‌న ప‌ట్టిన న‌వ‌త‌రం మేధావులు. చ‌దువు పూర్తి చేసుకొని ఇండియా తిరిగొచ్చిన వెంట‌నే బిజినెస్ ఐడియా మీద దృష్టి పెట్టారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాల‌న్న‌ది వీళ్ల ప్లాన్. ముందుగా చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీ(ఎస్ఎంఈ)ల గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. బెంగళూరులోని 80 శాతం ఎస్ఎంఈలు ఫేస్ బుక్ అకౌంట్, 60 శాతం కంపెనీలు నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నాయ‌ని, పైగా వాటి య‌జ‌మానులంద‌రికీ ఆధార్ కార్డులు ఉన్నాయని తెలుసుకున్నారు. త‌మ బిజినెస్ ఐడియా వ‌ర్క‌వుట్ కావ‌డానికి ఈమాత్రం చాల‌ని అనుకున్నారు.

        


2013లో శ‌శాంక్, గౌర‌వ్ బెంగళూరులో స్టార్టప్ ప్రారంభించారు. అదే కేపిట‌ల్ ఫ్లోట్! ఇదొక సరికొత్త మనీ లెండింగ్ కంపెనీ. ఆన్ లైన్ ద్వారానే రుణాలు మంజూరు చేస్తుంది! బిజినెస్ భారీగా ఉండ‌టమే కాదు కస్టమర్ల విషయంలోనూ అంతే భారీత‌నం క‌నిపించాల‌ని ఇద్ద‌రూ మొద‌టి రోజే డిసైడయ్యారు. మూస పద్ధతిలో కాకుండా టెక్నాలజీని ఉప‌యోగించి వ్యాపారం మొదలెట్టారు. స్టార్టప్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఈ కామర్స్ మర్చంట్స్ కి రుణాలు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మార్పు తీసుకొచ్చే బిజినెస్ ఒక‌టి స్టార్ట్ చేయాలని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నామంటాడు 32 ఏళ్ల శశాంక్. గత మూడేళ్లలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వ‌ర‌కు రుణాలు మంజూరు చేశామ‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా 40 నగరాల్లో వెయ్యి మందికి పైగా కస్టమర్లు ఉన్నారని చెప్పారు.

ఆన్ లైన్ మంత్రా..!!

4జీ కాలంలో అంతా ఆన్ లైన్ మంత్ర‌మే జ‌పిస్తున్నారు. టీవీ కొనడం దగ్గర్నుంచి మూవీ టికెట్లు బుక్ చేయ‌డం దాకా ఆన్ లైన్ నే న‌మ్ముకుంటున్నారు జ‌నం. కానీ ఇప్ప‌టికీ లోన్ కావాలంటే మాత్రం బ్యాంకు మెట్లు ఎక్కాల్సిందే! కాళ్ల‌రిగేలా తిర‌గ‌డం, కాగితాల‌తో కుస్తీ ప‌ట్ట‌డం! అబ్బో.. అదొక పెద్ద త‌ల‌నొప్పి యవ్వారం! కానీ కేపిటల్ ఫ్లోట్ వ‌చ్చాక ఆ చిక్కుల‌న్నీ తొల‌గిపోయాయి. పెట్టుబ‌డి అవసరం ఉన్న వారిని కంపెనీయే సంప్రదించి, అది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా అన్న తేడా లేకుండా రుణాలు మంజూరు చేస్తుంది.

స‌వాళ్లు, అడ్డంకులు..!

కంపెనీ పెట్టే ముందు అంద‌రిలాగే శ‌శాంక్, గౌర‌వ్ కూడా క‌ష్టాలు ఎదుర్కొన్నారు. లెండింగ్ బిజినెస్ అంటే అర్రిబుర్రి య‌వ్వారం కాదు. ముక్కూ మొఖం తెలియ‌ని వాడికి లోన్ ఇవ్వ‌డం రిస్కే! కానీ స‌వాళ్ల‌నే అవ‌కాశాలుగా మ‌లుచుకున్నారిద్దరూ! టెక్నాలజీకి తోడు మెషిన్స్, డేటాను ఉప‌యోగించుకున్నారు. లెండింగ్ ప్రాసెస్ ను సరికొత్తగా మార్కెట్లో ప్రజంట్ చేశారు. కంపెనీలో చేరే ఉద్యోగులు కూడా థింక్ డిఫరెంట్ పద్ధతిలో ప‌నిచేయాల‌ని కండీష‌న్ పెట్టారు.

బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా మంది చాలా రకాలుగా భయపెట్టారు. బ్రాంచీలు లేనిదే వ్యాపారం నడవదని, ఎస్ఎంఈల‌కు లోన్లు ఇవ్వ‌డం ఆన్ లైన్ ద్వారా అయ్యే పని కాదని నిరుత్సాహపరిచారు. కానీ మేం అవేమీ పట్టించుకోలేదు. ప్రస్తుతం సింగిల్ బ్రాంచి కూడా లేకుండా విజ‌య‌వంతంగా కంపెనీ నడుపుతున్నాం. ఇప్పుడు మాకు ప్రతీ పది నిమిషాలకో అప్లికేషన్ వస్తోంది. కేపిటల్ ఫ్లోట్ లాంటి సంస్థలు మహా అయితే నాలుగైదు నగరాలకే పరిమితం అవుతాయన్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ మాకొచ్చే అప్లికేష‌న్ల‌లో స‌గం టైర్-2, టైర్-3 సిటీల నుంచే వస్తున్నాయి. కొన్నిసార్లయితే కనీసం పేరు కూడా వినని ప్రాంతాల నుంచి దరఖాస్తులు వస్తుంటాయి. ఆన్ లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టే ఇది సాధ్యమవుతోంది- శ‌శాంక్

ఈ-కామ‌ర్స్ కంపెనీల‌తో జోడీ!

శ‌శాంక్, గౌర‌వ్ ఇద్ద‌రూ మ‌హా తెలివైన వారు! మార్కెట్లోకి చొచ్చుకెళ్లి, క‌స్ట‌మ‌ర్ల‌ను ప‌ట్ట‌డానికి ఓ మార్గం ఆలోచించారు. మార్కెట్లోకి ఎంటరవడానికి ముందే ఈ-కామర్స్ వ్యాపారులతో జ‌ట్టు క‌ట్టారు. 2014 ప్రారంభంలో స్నాప్ డీల్, మింత్రా, పేటీఎం, ఈబే వంటి కంపెనీల‌కు కేపిట‌ల్ ఫ్లోట్ భాగ‌స్వామిగా ప‌నిచేసింది. దీనిద్వారా ఇంత‌కు ముందెన్న‌డూ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోని చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కంపెనీల‌కు చేరువైంది.

నిధుల సేక‌ర‌ణ‌లోనూ తోపు!

మొద‌టి విడ‌త నిధుల సేక‌ర‌ణ‌లో భాగంగా కేపిట‌ల్ ఫ్లోట్ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో 13 మిలియ‌న్ డాల‌ర్లు సేక‌రించింది. ఎస్ఏఐఎఫ్ పార్ట్ న‌ర్స్, సెక్వియా క్యాపిట‌ల్, ఆస్పాదా కంపెనీల నుంచి ఈ మొత్తాన్ని సేక‌రించింది. 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేపిట‌ల్ ఫ్లోట్ రూ.1.4 కోట్ల ఆదాయాన్ని చూసింది. రుణాల మీద వ‌చ్చే వడ్డీ, ఫీజులే కంపెనీకి ఆదాయ మార్గం. లోన్ మీద వడ్డీ 16 శాతం నుంచి 19 శాతం వరకూ ఉంటుంది. రుణం తీసుకునే వ్యక్తి రిస్క్ అసెస్ మెంట్ ను బట్టి వడ్డీ రేటు నిర్ణయిస్తారు. ప్రాసెసింగ్ లో ఉన్న‌ లోన్ మీద ఒకటి నుంచి రెండు శాతం వరకు ఫీజు వ‌సూలు చేస్తారు.

పెద్ద పెద్ద బ్యాంకుల‌కు వెయ్యి నుంచి రెండు వేల దాకా పోర్ట్ ఫోలియోలు ఉంటాయి. కాబ‌ట్టి వాటికి క‌స్ట‌మ‌ర్ల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. కానీ మా లాంటి కొత్త స్టార్టప్.. ఆక‌లిగొన్న పులిలా ప‌నిచేయాలి. త్వ‌ర‌గా మార్కెట్లోకి దూసుకెళ్లాలి. ఇదివ‌ర‌కు బ్యాంకుల ముఖం చూడని వాళ్ల‌కు లోన్లు ఇవ్వ‌డ‌మంటే కొంత రిస్కే! అలాగ‌ని చేతులు ముడుచుకొని కూర్చోలేం క‌దా! వ్యాపారం అన్నాక‌ మంచీ చెడ్డా ఉంటుంది. కాబ‌ట్టే ధైర్యంగా ముంద‌డుగేశాం- శ‌శాంక్

ఫైనాన్స్ టెక్ కంపెనీలు ఒక విష‌యాన్ని గుర్తుంచుకోవాలంటారు ఎస్ఏఐఎఫ్ పార్ట్ న‌ర్స్ కంపెనీకి చెందిన మృదుల్ అరోరా. ఫైనాన్స్, టెక్నాలజీ మ‌ధ్య స‌మ‌తూకం పాటించాల‌ని.. అందులో గౌర‌వ్, శశాంక్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పారు. అతి క్లిష్ట‌మైన ఈ మార్కెట్లోకి అత్యంత వేగంగా చొచ్చుకెళ్లారన్నారు. కేపిట‌ల్ ఫ్లోట్ కంపెనీ తిరుగులేని లోన్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్ ను క్రియేట్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహ లేద‌న్నది ఆయ‌న అభిప్రాయం. ఇక‌పోతే త‌న వ్యాపారానికి కూడా కేపిట‌ల్ ఫ్లోట్ ఎంతో ఆర్థిక సాయం చేసింద‌ని ఫ్యూచ‌ర్ టెక్ సొల్యూష‌న్స్ అధినేత ఇంద్ర‌నీల్ బోస్ అంటున్నారు.

భ‌విష్య‌త్ ల‌క్ష్య‌మిది!

ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 100 సిటీలకు కేపిటల్ ఫ్లోట్ ను విస్తరించాలన్నదే శ‌శాంక్, గౌర‌వ్ టార్గెట్. దేశ నలుమూలల‌కు చొచ్చుకెళ్లి చిన్న కంపెనీల‌కు ఆర్థికంగా అండ‌గా నిలుస్తామంటున్నారు ఈ యువ ఆంట్ర‌ప్రెన్యూర్స్!

వెబ్ సైట్

undefined

undefined