మీ గూగుల్ లో నాకు జాబ్ ఇస్తారా..? సుందర్ పిచాయ్ కి ఓ చిన్నారి లేఖ!

మీ గూగుల్ లో నాకు జాబ్ ఇస్తారా..? సుందర్ పిచాయ్ కి ఓ చిన్నారి లేఖ!

Saturday February 18, 2017,

1 min Read

గూగుల్ లో పనిచేయాని ఉంది.. ఉద్యోగం ఇస్తారా ఓ ఏడేళ్ల చిన్నారి సుందర్ పిచాయ్ కి లెటర్ రాసింది. బ్రిటన్ కి చెందిన క్లోయ్ బ్రిడ్జ్ అనే పాప రాసిన ఉత్తరానికి.. గూగుల్ బాస్ తెగ మురిసిపోయాడు. బాగా చదువుకుని రా.. నీ అప్లికేషన్ కోసం ఎదురుచూస్తుంటా అని లెటర్ ద్వారా బదులిచ్చాడు.

image


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోకి అపురూపమైన విజ్ఞప్తి వచ్చింది. లండన్ కి చెందిన క్లోయ్ అనే ఏడేళ్ల చిన్నారి తనకు గూగుల్ లో ఉద్యోగం చేయాలని ఉందని సుందర్ పిచాయ్ కి స్వహస్తాలతో లెటర్ రాసింది. తనకు కంప్యూటర్ అంటే ఇష్టమని, స్విమ్మింగ్ అంటే కూడా బోలెడంత సరదా అని తెలిపింది. ఒలింపిక్స్ లో పాల్గొని స్విమ్మింగ్ చేస్తానని లేఖలో రాసింది. తండ్రి ఇచ్చిన ట్యాబ్ లో రోజూ రోబో ఆట ఆడతానని.. అది కంప్యూటర్ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని లెటర్ లో పేర్కొంది. చదువులో ముందుంటానని, ఏదో ఒక రోజు గూగుల్లో ఉద్యోగం సాధిస్తానని ముద్దుముద్దు అక్షరాలతో లెటర్ రాసింది. సీఈవోకి ఎలా లెటర్ రాయాలని నాన్నని అడిగితే.. హెల్ప్ చేశాడని చెప్పింది.

చిన్నారి లేఖను అందుకున్న సుందర్ పిచాయ్ తెగ మురిసిపోయాడు. అంతేకాదు పాపకు తిరిగి ఉత్తరం కూడా రాశాడు. నీకు కంప్యూటర్లు, రోబోలు అంటే ఇష్టమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని లెటర్ లో పేర్కొన్నాడు. టెక్నాలజీ గురించి ఇంకా నేర్చుకో అని చెప్పాడు. కష్టపడి చదివితే అనుకున్నది తప్పకుండా సాధిస్తావు అని రాశాడు. నీ ఉద్యోగ దరఖాస్తు కోసం ఎదురు చూస్తుంటా.. నీకు, నీ కుటుంబానికి శుభాకాంక్షలు అని లేఖలో తెలిపాడు. గూగుల్ సీఈవో నుంచి లెటర్ రావడంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పాపను ఎంకరేజ్ చేయడానికి ఈ ఉత్తరం ఎంతగానో ఉపయోగపడుతుందని పాప తండ్రి అన్నాడు.