సరదాగా ఆడుతూ ఫేస్ బుక్‌నే రక్షించాడు !

సరదాగా ఆడుతూ ఫేస్ బుక్‌నే రక్షించాడు !

Monday March 30, 2015,

3 min Read


ఏపనైనా ఇష్టంతో చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి. మనకే ప్రత్యేకమైన రంగంలో కృషి చేస్తే.. అద్వితీయమైన గౌరవమూ లభిస్తుంది. అంతేనా ఆ ప్రావీణ్యం.. మనకంటూ ప్రత్యేక గుర్తింపును తెస్తుంది. వివేక్ భన్సాల్ ను దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

image


వివేక్ భన్సాల్.. సివిల్ ఇంజనీరింగ్ సీటు పొందడం దాదాపు ఖాయమైంది. అయితే.. ఆఖరు క్షణంలో అతను తన కోర్సును మార్చుకోవాలని తీసుకున్న నిర్ణయం.. అతడి జీవితాన్నే మార్చిపారేసింది. సాఫ్టువేర్ ఇంజనీర్ గా పట్టా పుచ్చున్న వివేక, ఫేస్ బుక్ తో ఓ ఆటాడేవాడు. ఫేస్ బుక్ ఎపిఐ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ) ద్వారా... ఫేస్ బుక్ కు బెడద లాంటి ఓ బగ్ ను కనుగొన్నాడు. ఫలితంగా.. ఫేస్ బుక్ నిర్వాహకుల నుంచి రెండు వేల డాలర్లతో పాటు.. ఫేస్ బుక్ బగ్ బౌంటీ అవార్డునూ సొంతం చేసుకున్నాడు.

వివేక్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గఢ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. 2001లో.. తన ఐదో తరగతిలో తొలిసారిగా, కంప్యూటర్ ను వినియోగించాడు. అప్పటినుంచి సాంకేతికతపై అతడి ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీన్ని గుర్తించిన వివేక్ తండ్రి.. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మరో ఊళ్ళో.. కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో.. వివేక్ ను చేర్పించాడు. అక్కడ బేసిక్, కోబాల్ నేర్చుకున్నాడు. అదే ఊపులో చెస్ కి, విఖ్యాత టీవీ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతికి... సాఫ్టువేర్ ప్రోగ్రామ్ ని రాశాడు.

వివేక్ స్నేహితులు, ఉపాధ్యాయులు.. అతడు రూపొందించిన ఆటలను ఆడేవాడు. అది వివేక్ కు ఎంతో ఆనందాన్ని కలిగించేది., అయితే.. ఆ సంతోషం ఎంతకాలమో నిలవలేదు. వివేక్ తల్లిదండ్రులు.. అతణ్ణి.. కంప్యూటర్ ల్యాబ్ లేని మరో స్కూలుకు మార్చారు. అయితే.. వివేక్ బుర్రలోని ఆలోచనలు అంతరించి పోలేదు. స్కూలు చదువు అయిపోయాక, మళ్ళీ తన అభిలాషను నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు.

సివిల్ ఇంజనీరింగ్ బదులు.. కంప్యూటర్ సైన్స్ తీసుకునేందుకు.. తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎంతగా శ్రమించిందీ వివేక్ వివరిస్తూ.. “ నేను ఇంజనీరింగ్ లో చేరక ముందు.. మా కుటుంబ సభ్యులు మెకానికల్ ఇంజనీరింగ్ లో కానీ, సివిల్ ఇంజనీరిగ్ లో కానీ ప్రవేశం తీసుకోవాలని బాగా ఒత్తిడి తెచ్చారు. అయితే.. నాకేమో కంప్యూటర్ సైన్స్ పైనే ధ్యాసంతా. చివరికి, నేను కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో ప్రవేశం తీసుకొని.. తల్లిదండ్రుల సంతోషం కోసం వారికి మాత్రం సివిల్ ఇంజనీరింగ్ లో చేరినట్లు అబద్ధం చెప్పారు.

కాలేజీ రోజుల్లో.. వివేక్.. కంప్యూటర్ రక్షణ, హ్యాకింగ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. తొలి దశలో.. అతడు వైఫై పాస్ వర్డ్ లను హ్యాక్ చేసి.. మిత్రులకు వాటిని ఇచ్చేవాడు. దీంతో వివేక్ మిత్రులు అపరిచితుల వైఫై సౌకర్యాన్ని ఉచితంగానే వాడుకునే వారు. కాలేజీ నుంచి బయటికి వచ్చాక, వివేక్.. ఐనాక్స్ యాప్స్ లో చేరాడు. ఇక్కడే అతడు ఫేస్ బుక్ ఎపిఐ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ) ద్వారా... ఫేస్ బుక్ లాగిన్స్ లో లోపాలు ఉన్నట్లు గుర్తించాడు.

“ ఫేస్ బుక్ యూజర్స్.... టైమ్ లైన్_పోస్టింగ్ కు సంబంధించినంత వరకూ.. ఫేస్ బుక్ చరిత్రలోనే ఇది రెండో సెక్యూరిటీ బగ్. 2013 జులై నెలలో.. ఖలీల్ అనే వ్యక్తి ఫేస్ బుక్ రక్షణ విషయంలో లోపాలను గుర్తించి, మార్క్ జక్కర్ బర్గ్ వాల్ లో దాన్ని పోస్టు చేశాడు. ఈసారి, రెండో బగ్ ను నేను కనుగొన్నాను.” అని వివరించారు వివేక్ !

“ నేను ఆండ్రాయిడ్ డెవలపర్ ని. ఎన్నో యాప్స్ ని వృద్ధి చేశాను. అయితే.. నా కాలేజి స్నేహితులు ఎప్పుడూ నన్ను ప్రశంసించక పోగా.. ఏడిపించేవారు. పైగా... ఈ ప్రోగ్రామింగ్ నీతో కాకపోవాలీ.. అప్పుడుంటుంది బిడ్డా నీ కథ అంటూ బెదిరించేవారు. దాంతో వారికి గుణపాఠం నేర్పాలని సరదాగా అనుకున్నాను... “ అని ఈ ఫేస్ బుక్ బగ్ ను కనుక్కోవడం వెనుక సరదా కథను వినిపించారు వివేక్.

ఆ రోజుల్లో, వివేక్ తన సరికొత్త యాప్స్ కోసం.. ఫేస్ బుక్ ఏపీఐ పై పనిచేసేవాడు. “ మా స్నేహితులకు ప్రమేయం లేకుండా.. వారి వాల్స్ పైన, సరదా మెసేజ్ లు పోస్టు చేసేలా యాప్ ను వృద్ధి చేయాలన్నదే అప్పట్లో నా ఏకైక లక్ష్యం. ఆరకంగా.. స్నేహితులను ఆటపట్టించాలనుకున్నాను. కొన్ని రోజులు గడిచాక.. ఫేస్ బుక్ లో బగ్ ను కనుక్కొన్నాను. వాళ్ళనుంచి ఎలాంటి ప్రచురణ అనుమతులూ పొందకుండా.. కోడ్ ను వారి వాల్ పై రాశాను. తర్వాత ఆ కోడ్ పై మరింత కృషి చేశాక, ఏ వెబ్//ఆండ్రాయిడ్ గానీ, ఐఓఎస్, బ్లాక్ బెర్రీ, విండోస్ అప్లికేషన్స్, ద్వారా కానీ, ఎక్కడి నుంచైనా.. ఎన్నిసార్లయినా... యూజర్ నుంచి ఎలాంటి అనుమతినీ పొందకుండానే అతడి వాల్ పై దేన్నయినా పోస్ట్ చేయవచ్చని గుర్తించాను.

స్నేహితులను ఆటపట్టించేందుకు చేసిన ప్రయత్నంలో.. వివేక్, ఫేస్ బుక్ లోని లోపాలను గుర్తించి, సదరు సంస్థకు వివరించారు. దాదాపు 30 మిలియన్ల ప్రజలు ఫేస్ బుక్ ను మొబైల్స్, వెబ్ అప్లికేషన్ల ద్వారా లాగిన్ అవుతున్నారు. అట్లాంటప్పుడు ఈ బగ్ కారణంగా... యూజర్ సమాచారానికి రక్షణ కష్టమన్న విషయాన్ని ఫేస్ బుక్ సంస్థ గుర్తించింది. ఇదెంత తీవ్ర సమస్యో తెలుసుకొని.. బగ్ ను గుర్తించిన వివేక్ ను, యుఎస్.డి-2000 బగ్ బౌంటీ గా నామినేట్ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. అతణ్ణి హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తించింది.

ఈ బగ్ మాత్రమే కాదు.. ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో మరిన్ని లోపాలు ఉన్నట్లు వివేక్ చెబుతున్నారు. అయితే.. వాటిని సంస్థ గుర్తించి పరిహరించే వరకూ.. బయటికి మాట్లాడబోనని వెల్లడించాడు.