రిక్షాతొక్కుతూ బతుకుబండి లాగుతున్న మొట్టమెదటి బంగ్లాదేశ్ మహిళ  

0

బంగ్లాదేశ్ లాంటి శుద్ధ సంప్రదాయవాద దేశంలో.. పనిని బట్టి ఆడ-మగ అని లింగబేధం పాటించే అక్కడి సమాజంలో.. ఒంటరి స్త్రీ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకోవడమంటే మాటలు కాదు. మహిళ అడుగు బయట పెట్టడమే నేరంగా భావించే ఆ దేశంలో.. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తూ అందరిచేత శెభాష్ అనిపిస్తోంది. యావత్ బంగ్లాదేశ్‌ లోనే రిక్షా నడిపే మొట్టమెదటి మహిళగా అందరి మన్ననలు అందుకుంటోంది.

మోసమ్మత్ జాస్మిన్ అంటే పెద్దగా తెలియదు. అదే- క్రేజీ ఆంటీ అని అడగండి. చిట్టగాంగ్ చుట్టుపక్కల వారంతా ఠక్కున చెప్పేస్తారు. అంత ఫేమస్ ఆమె. జాస్మిన్ అంటే అందరికీ రిక్షా పుల్లర్ గానే తెలుసు. కానీ ఆ వృత్తి ఎంచుకోవడం వెనుక ఉన్న కన్నీళ్లు కష్టాలు ఎవరికీ పెద్దాగా తెలియవు.

ఐదేళ్లుగా జాస్మిన్ రిక్షా లాగుతూ జీవనం కొనసాగిస్తోంది. అంతకు ముందు కొందరి ఇళ్లలో పనిచేసేది. కొంతకాలం ఫ్యాక్టరీలో. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా రెండో పూట పస్తులు ఉండాల్సి వచ్చేది. వచ్చే నాలుగు పైసలు తినడానికే సరిపోనప్పుడు- పిల్లలకు చదువు, వాళ్ల బాగోగుల మాటేమిటి? ఈ విషయంలో జాస్మిన్ తీవ్రంగా ఆలోచించింది.

ఎందుకంటే కట్టుకున్నవాడు కాదు పొమ్మని వెళ్లగొట్టాడు. ఆయన వేరే యువతిని పెళ్లిచేసుకుని వీళ్లని వదిలేశాడు. ముగ్గురు కొడుకుల పోషణ జాస్మిన్ పై పడింది. బంగ్లాదేశ్ లాంటి శుద్ధ సంప్రదాయవాద దేశంలో ఒక మహిళ ధైర్యంగా బయటకొచ్చి ఉద్యోగం చేయమంటే సాహసమే అని చెప్పాలి. అందునా మగవాళ్లు చేసే పని ఆడవాళ్లు చేస్తామంటే అస్సలు ఒప్పుకోరు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా జాస్మిన్ నెగ్గుకొచ్చింది.

మొదట్లో రిక్షాలో ఎవరూ కూర్చునేవారు కాదు. విచిత్రంగా చూసేవారు. ఆడదానివి ఏం లాగుతావ్ లే అన్నట్టు ఇగ్నోర్ చేసేవారు. అవహేళన, అవమానం. అయినా సరే పట్టువదలకుండా పెడల్ మీద కాలు తీయలేదు. ఆత్మాభిమానంతో బతకాలన్న జాస్మిన్ తపన సమాజాన్ని ఆలోచింపజేసింది. క్రమంగా ఆమెపై గౌరవం పెరిగింది. పిల్లల పోషణ కోసం ఆమె పడే ఆరాటాన్ని అర్ధం చేసుకున్నారు. రోజుకి ఎంతలేదన్నా ఐదు వందలు సంపాదిస్తుంది.

జాస్మిన్ ఎప్పుడు రిక్షా తొక్కినా విధిగా హెల్మెట్ ధరిస్తుంది. ట్రాఫిక్ పోలీసులకు ఆమె పాటిస్తున్న రూల్ నచ్చింది. మోటార్ వాహనం కాకపోయినా, పదిమందీ తనను చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో హెల్మెట్ ధరిస్తున్న ఆమెను అభినందించారు.

కడుపున పుట్టిన వాళ్లు ఆకలితో అల్లాడిపోవద్దు. వాళ్ల కడుపు నింపడమే కాదు.. మంచి చదువు చెప్పించే బాధ్యత తల్లిగా నాపై ఉంది. దేవుడు కాళ్లు రెక్కలు ఇచ్చాడు. వాటిని నమ్ముకునే బతుకుతాను అంటారామె.

ఎలాగోలా బతికేయడం వేరు.. ఆత్మగౌరవంతో బతకడం వేరు. సంపాదించేది పది రూపాయలైనా సరే, అందులో ఉండే ఆనందమే వేరు. జాస్మిన్ కి దక్కిన సంతోషం అలాంటిదే

Related Stories

Stories by team ys telugu