బిలియన్ డాలర్ల బిజినెస్ ఎక్కడుందో గుర్తించిన హిమాలయన్ యోగి

యోగాపై అవగాహనే కాదూ అద్భుత మార్కెటింగ్ కూడా....ఒక్క అమెరికాలోనే యోగా మార్కెట్ 17 బిలియన్ డాలర్లు...చైనా షావలిన్ టెంపుల్ లాంటిది తయారు చేయాలని యోచన...కూర్గ్, మైసూర్‌లో పవర్ యోగా సెంటర్లు...అక్షర్ యోగి మాటల్లో ఆత్మ సాక్షాత్కారం...

బిలియన్ డాలర్ల బిజినెస్ ఎక్కడుందో గుర్తించిన హిమాలయన్ యోగి

Sunday April 19, 2015,

5 min Read


నీ ప్రార్ధ‌న వెంట‌నే ఫ‌లించ‌కపోవ‌చ్చు.. కానీ, ఎప్ప‌టికైనా త‌ప్ప‌క ఫ‌లిస్తుంది. నీ ప‌ని నువ్ నిశ్శ‌బ్ధంగా చెయ్.. నీ విజ‌యం పెను శ‌బ్ధ‌మే చేస్తుంది.. స‌ర్వ రోగాల‌కు యోగాకు మించిన మందులేదు. ఆస‌నాల్లో భ‌విష్య‌త్తును శాసించే శాస‌నాలున్నాయి.. సాధ‌న చెయ్యాలేగానీ నీ శ‌రీరంలో తిరుగులేని శ‌క్తి సామ‌ర్ధ్యాలున్నాయి. లే.. లేచి యోగా చెయ్..! జీవితంలో నువ్వు కోరుకున్న భోగాల‌ను అనుభ‌వించు..!! అనుభ‌వ‌మే అస‌లు సిస‌లైన గురువు.. ఇది ఎవ‌రో 90 ఏళ్ల వృద్ధ గురువు చెప్పిన మాట‌లు కావు.. 30ఏళ్లు కూడా నిండ‌ని ఒక యోగా గురువు చెప్పిన మాట‌లు. అత‌ని మాట‌లే కాదు.. చేష్ట‌లు ఇంకా శ‌క్తిమంత‌మైన‌వి.. ప్ర‌పంచం మొత్తానికి యోగా నేర్పించాల‌న్న‌దే అత‌ని ల‌క్ష్యం. త‌న యోగా సెంట‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా హ‌బ్ కావాల‌న్న‌దే ధ్యేయం. అత‌డే అక్ష‌ర్ యోగి.

అక్షర్ యోగి

అక్షర్ యోగి


అయినా పాత కాలం నాటి యోగా నేర్చుకునేదెవ‌రు? అందులోని గొప్ప‌దనాన్ని తెలుసుకునేదెప్పుడు? ఇది పాత చింత‌కాయ ప‌చ్చడి క‌దా? ప‌్ర‌స్తుత ప్ర‌పంచం మంత్రాల‌కు చింత‌కాయ‌లు. యోగాస‌నాల‌కు మామిడికాయ‌లు రాల‌వ‌న్న గ‌ట్టి నిశ్చ‌యంతో ఉంది. దీన్నెలా అధిగ‌మిస్తారు? అంత‌క‌న్నా మించి యోగాను ప్ర‌పంచ వ్యాప్తం ఎలా చేయ‌గ‌ల‌రు? అనంటే ఆయ‌న.. హ‌లో ఎక్స్‌క్యూజ్ మీ! మీకు తెలీక పోతే తెలియ‌న‌ట్టు ఉండండి.. యోగా ఒక్క అమెరికాలోనే 17 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర్షం కురిపించే వ్యాపారం.. అంటారు అక్ష‌ర్. తాను చేస్తున్న ప‌నిలో ఎంత‌టి శ‌క్తి ఉందో.. దాన్నెలా వాడాలో.. ఇక్క‌డి జ‌నాల చేత ఎలా సాధ‌న చేయించాలో.. త‌న‌కు బాగా తెలుస‌ని అంటారీయ‌న‌. అందుకే త‌న యోగా సెంట‌ర్‌కి అక్ష‌ర్ ప‌వ‌ర్ యోగా అకాడెమీ అన్న పేరు పెట్టుకున్నారు. ఆయ‌న క్యాప్ష‌న్ ఏంటో తెలుసా? 15 రోజులు యోగా చేయండీ! 3 కేజీల బ‌రువు పూర్తిగా త‌గ్గిపోండి..!! ఇది చాలు ఒబేసిటీతో విల‌విల‌లాడుతున్న ఈ స‌మాజాన్నిత‌న ప‌వ‌ర్ యోగా సెంట‌ర్‌కి పరుగులు పెట్టించ‌డానికి.


యోగాస‌నాలు చేస్తే దైవ‌సాక్షాత్కారం అవుతుందో లేదో గానీ.. వెయిట్ లాస్ అయితే అవుతుందిగా.. అంత‌క‌న్నా కావ‌ల్సిందేముందీ. అనుకుంటూ అత‌ని యోగా ధ్యాన కేంద్రానికి ప‌రుగులు పెడుతున్నారు సాధ‌కులు. ద‌టీజ్ అక్ష‌ర్ యోగి. అక్ష‌ర్‌ని క‌దిలిస్తే అత‌నిలోని యోగి పుంగ‌వుడే కాదు యోచ‌నా ప‌రుడు కూడా వెలుగు చూస్తాడు.. యోగాస‌నాల్లోని భోగాల‌న్నిటినీ బ‌య‌ట పెట్టేస్తాడు..

యోగా భార‌తీయ విజ్ఞాన గ‌ని.. ఇది తిరుగులేని స‌త్యం. కానీ, ఈ విష‌యం ఇక్క‌డెవ‌రికీ ప‌ట్ట‌దు. భార‌తదేశం యోగుల జ్ఞాన మందిరం. ఇక్క‌డ ఎటు చూసినా యోగులే ద‌ర్శ‌న‌మిస్తారు. కానీ అమెరికా మ‌న యోగా టీచ‌ర్ల శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను లెక్కిస్తోంది. వారికి ఫిట్ అన్ ఫిట్ అంటూ స‌ర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇదెలా సాధ్యం? మ‌న యోగా గురించి వాళ్ల‌కేం తెలుసు? యోగా నేర్పించ‌డంలో కూట‌మిగా ఏర్ప‌డుదాం రండి అంటుంది యూఎస్. మీ యోగా ఇక్క‌డ ఎంచెక్కా సాధ‌న చేసుకుకోవ‌చ్చు.. అని ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది.. అయినా త‌న బిడ్డను బ‌య‌ట వారిని సాక‌మ‌ని ఏ త‌ల్లైనా ఎలా వ‌దిలిపెడుతుంది? ఈ విష‌యంలో మ‌నం అప్ర‌మ‌త్తం కావ‌ల్సి ఉంద‌ని అంటారు అక్ష‌ర్ యోగి.

image


యోగి క‌ల్చ‌ర్ భార‌త‌దేశంలోని హిమాల‌యాల నుంచి వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌న యోగా స్కూళ్లు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. ఒక్క యూఎస్సే కాదు ర‌ష్యా, చైనా, యూర‌ప్ లో కూడా మ‌న యోగా కేంద్రాల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఆయుర్వేదాన్ని ఆక్ర‌మించిన‌ట్టే యోగాను కూడా యూఎస్ సొంతం చేసుకోవాల‌నుకుంటోంది. అణుశ‌క్తిని పుట్టించ‌డం మ‌హాభార‌తం నుంచి నేర్చుకున్న అమెరికా.. మ‌న శ‌క్తియుక్త‌ల‌న్నిటి మీద దృష్టి నిలిపిన విష‌యం మ‌నం గ్ర‌హించ‌లేక పోతున్నాం. మాయోపాయంతో ఒక్కో భార‌తీయ విజ్ఞానాన్నిశాస్వ‌తంగా స్వాధీన ప‌రుచుకోవాల‌ని చూస్తోంది. ఇది ముమ్మాటికీ మంచిది కాదు. మ‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక‌మైన శ‌క్తుల‌ను ఇత‌రుల ప‌రం చేయ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం?

మ‌నం క‌ళ్లూ ముక్కూ మూసుకుని యోగా, ధ్యానం మాత్ర‌మే చేస్తున్నాం. క‌ళ్లు మూసుకున్నాం క‌దాని.. కంటి ముందు మ‌న జ్ఞాన సంప‌ద దోచుకు పోతుంటే ఊరుకోడానికి కాదు. మ‌నం ముక్కు మూసుకుంది మ‌న విద్య‌ల‌పై వాళ్లు వ్యాపారం చేస్తుంటే వాస‌న ప‌సిగ‌ట్ట‌కుండా ఉండ‌టానికి కాద‌ని గుర్తించాల‌ని అంటాడు అక్ష‌ర్ యోగి. అందుకే అతి త్వ‌ర‌లో బెంగ‌ళూరులో అంత‌ర్జాతీయ యోగా స‌ద‌స్సు ఏర్పాటు చేస్తాన‌ని అంటున్నారీయ‌న‌.

మేనెజ్‌మెంట్ యోగి

భుజాల వ‌ర‌కూ వేలాడే జుట్టు. కంఠాన్ని తాకే గడ్డం.. రంగు రంగుల దోవ‌తులు క‌ట్టుకుని అక్ష‌ర్ చూడ్డానికి యోగి పుంగ‌వుడిలా ఉంటాడు. కానీ అత‌ని ఆలోచ‌న‌లు మాత్రం మేనేజ్‌మెంట్ కోర్సు చ‌దివిన విద్యార్ధిలా చురుగ్గా ఉంటాయి. వ్యాపార సూత్రాల‌ను నేర్చుకోడానికి ప్ర‌త్యేకించీ ఇలాంటి కోర్సులేం చ‌ద‌వ‌క్క‌ర్లేదు. మ‌న నీతిక‌థ‌ల్లో ఇలాంటి చిట్కాలు చాలానే దాగి ఉన్నాయి. నేర్చుకోవాలేగానీ సోదాహ‌ర‌ణంగా వివ‌రించి ఉంటాయి. అవే త‌న‌ను న‌డిపిస్తాయ‌ని అంటారాయ‌న‌. మ‌న పూర్వీకులు నిక్షిప్తం చేసిన ప్ర‌తి ప‌దంలో భ‌విష్య‌త్తుకు దారి చూపే దివిటీలున్నాయి. గ్ర‌హించాలేగానీ, చిమ్మ‌చీక‌ట్లో దారి చూప‌డంలో వాటి త‌ర్వాతే ఎంత‌టి ఫ్ల‌డ్ లైట్ల‌యినా.. అంటారు అక్ష‌ర్.. ఇలాంటి విష‌యాల‌తో త‌న ద‌గ్గ‌ర‌కు సాధ‌న‌కు వ‌చ్చిన వారిని చైత‌న్యవంతుల‌ను చేస్తుంటారీ యోగా గురు.

అక్ష‌ర్ ప‌వ‌ర్ యోగా ప‌రిధి విస్త‌రిస్తోంది. అక్ష‌ర్ త‌న‌ కాళ్ల మీద అత‌ను నిల‌బడ్డ‌మే కాదు. ఇత‌రుల‌ను కూడా నిల‌బ‌డేలా చేస్తున్నారు. చైనాలోని షావ‌లిన్ టెంపుల్ అంత‌టి ప్ర‌ఖ్యాత యోగా కేంద్రాన్ని త‌యారు చేయాల‌న్న‌ది అక్ష‌ర్ యోగి క‌ల‌. అందుకు కూర్గ్ స‌రైన చోట‌ని భావిస్తున్నారు. ఇక్క‌డ క‌మాండోల‌కిచ్చే శిక్ష‌ణ‌తో స‌మాన‌మైన శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. చైనీయులు కుంగ్ఫూ నేర్చుకునేది సైన్యంలో చేర‌డానికి కాదు. శ‌రీరంలోని అంత‌ర్లీన‌మైన శ‌క్తిని ఎప్ప‌టికీ అందుబాటులో ఉంచుకోడానికి. ఇప్పటికీ త‌మ కుంగ్ఫూను వాళ్లెంత‌గా కాపాడుకొస్తున్నారో.. అంత‌గా మ‌నం మ‌న‌ యోగాను నిలిపుకోలేమా? ఈ ప్ర‌య‌త్నం ఎందుకు జ‌ర‌క్కూడ‌దు? యోగా శ‌క్తి విదేశీయుల‌కు తెలుస్తోందే.. మ‌నం ఎందుక‌ని గుర్తించ‌లేక పోతున్నాం? అంటారు అక్ష‌ర్ యోగి.

ఒక్క కూర్గ్ లోనే కాదు మైసూర్‌లో ఒక యోగా కేంద్రం నెల‌కొల్పుతున్నారు అక్ష‌ర్ యోగి. దీన్ని యోగా హ‌బ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాల‌న్న‌ది ఆయ‌న ఆశ‌యం. ఇప్ప‌టికే అక్ష‌ర్ యోగి, శిక్ష‌ణా కేంద్రంలో మెరిక‌ల్లాంటి శిక్ష‌కులున్నారు. అక్ష‌ర్ నేర్పిన విద్య‌తో ఆరితేరిన యోగ సాధ‌కులు త‌యార‌య్యారు. ఇరాన్, ప్యారిస్ వంటి ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన వీరికి ఇక్క‌డ నేర్చుకుని ఇక్క‌డి వారికే నేర్పించేంత‌టి శ‌క్తి సొంత‌మైందిప్పుడు.

యోగాను హిందువులకు పరిమితం చేయొద్దు

మ‌న‌లోని శ‌క్తి చేత‌న‌మై.. నిరంతర ప్ర‌వాహంలా మారాలి. అలా జ‌ర‌గాలీ అంటే యోగా సాధ‌నే అందుకు మార్గం. ఆస‌నాల్లో అస‌లైన మార్గ‌ముంద‌ని చెబుతారు అక్ష‌ర్. శారీర‌క, మాన‌సిక ప‌టుత్వానికి వీటికి మించిన వైద్యం లేద‌ని అంటారాయ‌న‌. కౌండిన్య ఆస‌నం చేస్తూ ఓం కౌండిన్యాయ‌న‌మః అని జ‌పిస్తే ఆధ్యాత్మిక వైభ‌వం క‌ళ్ల‌కు క‌ట్ట‌డం త‌ధ్యంగా చెబుతారు అక్ష‌ర్ యోగి. అయితే ఇలా 21వేల సార్లు జ‌పించాల్సి ఉంటుంద‌ని అంటారు అక్ష‌ర్.

అలాగ‌ని అక్ష‌ర్ యోగి కేవలం సంప్ర‌దాయాల‌నే ప‌ట్టుకుని వేలాడ‌రు. ఎంత ట్రెడిష‌న‌ల్లో అంత‌ మోడ్ర‌న్‌గా ఉండాల‌ని అంటారాయ‌న‌. యోగా అన‌గానే ఓం ప్ర‌ధ‌మంగానే ప్రారంభించాల‌ని లేద‌ని అంటారు అక్ష‌ర్. యోగా ఒక కులానికో.. మ‌తానికో.. సంబంధించిన‌ది కాదు. యోగా ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌ర‌మైంది.. అనువైంది. వీళ్లు యోగా చేయాల‌నీ.. వాళ్లు చేయ‌కూడ‌ద‌నీ.. ఏ శాస‌నాల్లోనూ రాయ‌లేదు. ఇదేం హిందువుల‌కు మాత్ర‌మే చెందిన విష‌యం కాదు. ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఈ విద్య నేర్చుకోడానికి అర్హులే. సూర్యుడు హిందువుల‌కొక్క‌రే క‌నిపించే దేవుడు కాదు. ప్ర‌పంచ‌మంతా సూర్య‌కాంతిని ఆస్వాదిస్తోంది. సూర్య‌న‌మ‌స్కారాలు కేవ‌లం వీళ్లే చేయాల‌న్న నిబంధ‌న‌ ఎక్క‌డా లేదు. అందుకే యూఎస్, యూకేలాంటి దేశాల్లో యోగా ఇంత ప్రాచుర్యం పొందింద‌ని చెప్పుకొస్తారీ యోగీశ్వ‌రుడు.

అక్ష‌ర్ ది జ‌గ‌న్నాథ ప‌రంప‌ర‌! పూరీ జ‌గ‌న్నాథ్ టెంపుల్లో సూర్యారాధ‌న చేసే కుటుంబం నుంచి వ‌చ్చారీయ‌న‌. తాను పుట్టుక‌తో యోగిన‌ని చెప్పుకుంటారు. యోగులు రెండు ర‌కాలు. ఒక‌రు సాధ‌న ద్వారా త‌యార‌య్యేవారు. రెండు జ‌న్మ‌తః పుట్టేవాళ్లు. హిమాల‌యాల్లో పుట్టిన వాళ్లంతా యోగిపుంగ‌వులే. తాను కూడా అలాంటి వారినేన‌ని అంటారు అక్ష‌ర్ యోగి.

బరువు తగ్గమనే ప్రచారమే వ్యాపారాన్ని పెంచింది

అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత స‌మాజానికేం కావాలో అది అందించ‌డానికి వెన‌కాడ‌కూడ‌ద‌ని అంటారు అక్ష‌ర్. అందుకే త‌న యోగా కేంద్రంలో బ‌రువు త‌గ్గే వెస‌లుబాటుంద‌ని అంత బాహ‌టంగా ప్ర‌క‌టించింద‌ని చెప్పుకొస్తారీ యోగా గురు. క‌ర్నాట‌క‌లోని ప‌లు న‌గ‌రాల్లో ఆయ‌న యోగ ముద్ర‌ల‌తో కూడిన హోర్డింగుల్లోని ప్ర‌చారం.. బ‌రువు త‌గ్గించడం మీదే సాగుతుంది. సాధార‌ణంగా యోగా దైవిక సాధ‌న. అంటే ఇది పూర్తిగా మ‌న‌స్సు మీద అదుపు తెచ్చుకోడానికి చేసే ప్ర‌య‌త్నం. కానీ, ఇప్పుడు దైవ‌త్వం మీద గురి పెట్టే ఓపిక ఎవ‌రికుంది? దేహ‌మే దేవాల‌యం. ఆ దేవాల‌యం కొవ్వుతో పెరిగి చేటు తేకుండా ఉండాలంటే యోగాకి మించిన మందులేద‌ని ప‌బ్లిసిటీ చేయ‌డం మీద దృష్టి నిలిపారు అక్ష‌ర్. దీని వ‌ల్ల స్వామి కార్యం స్వ‌కార్యం నెర‌వేర్చుకోవ‌చ్చ‌ని అంటారు.

భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం యోగా స‌రైన దారిలోనే వెళ్తోంది.. అక్ష‌ర్ ప‌వ‌ర్ యోగా సెంట‌ర్లో ఎక్కువ శాతం క్లాసులు వెయిట్ లాస్ మీదే జ‌రుగుతాయి. ఇక్క‌డికి వ‌చ్చే వాళ్ల స‌మ‌స్య కూడా ఇదే. పెరిగిపోయే శ‌రీరాన్ని అదుపులోకి తేవ‌డం కోస‌మే ఎక్కువ మంది వ‌స్తుంటారు. భౌతిక ప్రేమ కొద్దీ వ‌చ్చి.. ఆధ్యాత్మిక ఆనందానికి అల‌వాటు ప‌డిపోతుంటారు. అలౌకికానందం సొంతం చేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఎక్క‌డ దేనికి డిమాండ్ ఉందో దాన్ని ద్వారానే మ‌న ప‌ని మ‌నం చేసుకు పోవాలి! ఇదే.. తాను పాటించే విజ‌య సూత్రంగా చెబుతారు.. అక్ష‌ర్ యోగి. ఇది ఆయ‌న నేర్చించే యోగా క‌న్నా ఎక్కువ యోగ‌వంతంగా ఉంది క‌దూ!! అయితే ఎంచ‌క్కా మీమీ వ్యాపారాల్లో అమ‌లు చేసెయ్యండి మ‌రి!!!