నాలుగు ముక్కలు ఇంగ్లిష్ మాట్లాడలేని ఆ వ్యక్తే.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత న్యూక్లియర్ విభాగంలో సైంటిస్ట్

ఫెయిల్యూర్స్ ఆర్‌ ది స్టెప్స్ ఆఫ్ సక్సెస్ అంటారు. కష్టాలను అధిగమించి...కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే.. సక్సెస్ వెతుక్కుంటూ వస్తుదంటారు... CERN శాస్త్రవేత్త డాక్టర్ విజయరాఘవన్ విశ్వనాధన్.

నాలుగు ముక్కలు ఇంగ్లిష్ మాట్లాడలేని ఆ వ్యక్తే.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత న్యూక్లియర్ విభాగంలో సైంటిస్ట్

Sunday August 30, 2015,

4 min Read

ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి రోజు చేరినప్పుడు ఎవరికి వారు పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కనీసం ఇంగ్లీష్‌లో నాలుగు ముక్కల కంటే ఎక్కువ మాట్లాడడం లేకపోవడంతో ఆ విద్యార్థి కళ్ళలో అప్పుడు నీళ్లు తిరిగాయి. ఆ విద్యార్థి ఇప్పుడు డా. విజయ రాఘవన్. CERN సైంటిస్ట్ , ఓ ఆంట్రప్రెన్యూర్ కూడా.

image


మధురైలో రాజపాల్యానికి చెందిన విజయ్ తండ్రి ఓ రైతు, తల్లి సాధారణ గృహిణి. అయితే చదువుకోవాలనే పట్టుదలే ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని చెబుతుంటారు విజయ్. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ పై ఉన్న మక్కువతో గాడ్జెట్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. తర్వాత అదే ఆసక్తితో కోయంబత్తూరులోని అమృత ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు. దురదృష్టవశాత్తు, రెండవ సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా, విజయ్ చదువు ఆపేయాల్సి వచ్చింది. అయితే అతని ఆసక్తి, పట్టుదల చూసి కొంత మంది బంధువులు, స్నేహితులు సాయం చేశారు. దీంతో బ్రేక్ పడిన అతని చదువు మళ్లీ ముందుకు సాగింది. ఇదే సమయంలో మెరిట్ స్కాలర్‌షిప్స్ కూడా రావడంతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి కావడానికి దోహదపడింది. ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. లార్సెన్ & టుబ్రోలో ప్లేస్‌మెంట్ లభించింది.

ఇంగ్లిష్ భయం ఎలా పోయిందంటే... !

కళాశాలలో మొదటి సంవత్సరంలో జరిగిన సంఘటనలను మాత్రం ఆయన మరిచిపోలేనివని చెబుతుంటారు. కాలేజ్‌లో ఉండే ప్రొఫెసర్ మీనన్ అంటే నిజంగా భయపడ్డానంటారు. అయితే ఆ ప్రొఫెసర్ సహకరించడం వల్లే ఇంగ్లీష్ బాగా వచ్చిందని కూడా గుర్తుచేసుకుంటారు. విజయ్ పరిస్థితిని గమనించిన ఆ ప్రొఫెసర్... రోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లలోని ఎడిటోరియల్స్ చదవమని సలహా ఇచ్చారు. వాటిల్లోని కొత్త పదాలకు అర్ధం తెలుసుకోవడం కోసం గంటల కొద్దీ లైబ్రరిలో గడిపేవాడినని.. అలా ఎన్నో కొత్త విషయాలపై అవగాహన పెరిగి భాషపై పట్టు సాధించనట్లు చెప్తారు విజయ్. 

మెరిట్ స్టూడెంట్‌గా మారడంతో స్కాలర్ షిప్ వచ్చి... ఉన్నత విద్య చదవడానికి ప్రేరణ లభించింది. తరువాత విజయ్ విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో చదువు కోసం బ్యాంక్ లోన్‌ కోసం ప్రయత్నించారు. చివరి సెమిస్టర్‌లో 88 శాతం మార్కులు వచ్చినప్పటికీ... బ్యాంకర్లు అప్పు ఇవ్వడానికి తిరస్కరించారు. అంతే కాదు మీకు డబ్బులు ఇస్తే... డిఫాల్టర్ అవుతారంటూ మొహం మీదే చెప్పేశారు. పరిస్థితులను అర్ధం చేసుకున్న విజయ్ 100 శాతం స్కాలర్‌షిప్ అందించే విద్యాలయాల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు ఫలించి మూడు దేశాల్లో కోర్సు ఉందని తెలుసుకున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లు ఇలాంటి విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. అయితే ఆయన ఇటలీ-భారతదేశం స్కాలర్‌షిప్ అందించే వర్శిటీలో చేరారు. దీంతో విజయ్ తమిళనాడు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆగస్టు 2007 లో విజయ్ విదేశీ ప్రయాణానికి వీసా ప్రాసెస్ కోసం ముంబై వెళ్లారు. అప్పుడే విమానంలో ప్రయాణం చేయడం మొదటి సారి. చెన్నై నుంచి ముంబైకి వెళ్లడానికి భయపడ్డానని...చివరకు మిత్రులు ధైర్యం చెప్పారని వివరిస్తారు.

చలికి జాకెట్ కొనలేని స్థితి

సెప్టెంబర్ 5, 2007 న ఇటలీకి బయలుదేరిన విజయ్ మధ్యలో సింగపూర్ చేరుకున్నారు. మధ్యలో మిలాన్‌లో దిగినప్పుడు అక్కడ మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు ఉండడంతో... తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవలసి వచ్చింది. చలిని తట్టుకొనే జాకెట్ లేకపోవడం ఇబ్బంది పడ్డారు. నైపుణ్యం సాధించినప్పటికి అర్ధిక అవసరాలను తీర్చుకొనే స్తోమత లేకపోవడం ఆయనకు మైనస్ పాయింటే. అలాగే అక్కడి పరిస్థితులను తెలుసుకొనే ప్రయత్నం చేసుకోలేదంటారు. చివరకు ఆయనకు ఓ మిత్రుడు జాకెట్ అందించారు. అలా సమస్యలతో, ఇబ్బందులతో సహజీవనం చేస్తూనే ఉన్నారు. శాఖాహారి అయిన విజయ్... అక్కడి రెస్టారెంట్‌లో శాండ్ విచ్‌కు ఆర్డర్ ఇస్తే... దాంట్లో ఫిష్ వచ్చింది. చివరకు వంట చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. వంట నేర్చుకోవడానికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారు. అయితే ఈ అనుభవాలు, స్టడీపై ఎలాంటి ప్రభావం చూపించకుండా... దృష్టి పెట్టారు. 

image


రెండు సంవత్సరాల నానో టెక్నాలజీ కోర్సులో 110 కు 108 ప్రాజెక్టులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. తర్వాత త్రీ డి స్టాకింగ్ కెమెరాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. నానో ఎలక్ట్రానిక్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. 

ఇదే సమయంలో CERN (CERN అనేది యూరోప్ దేశ న్యూక్లియార్ పరిశోధనా సంస్థ) ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. వాటిలో అధునాతన రేడియేషన్ డిటెక్షన్ ప్రాజెక్టు ఉంది. 

ఇదే సమయంలో క్యాన్సర్‌తో విజయ్ అత్త అత్త మరణించారు. దీంతో క్యాన్సర్ సంబంధిత సమస్యల పై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా CERN 14 మందితో ఈ కార్యక్రమాన్ని ప్రకటించడంతో విజయ్ రాఘవన్ దరఖాస్తు చేసుకున్నారు. CERN చెక్ రిపబ్లిక్‌లో చేపట్టిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిసెర్చ్ సైంటిస్టులతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో అనుభవం గడించానని చెబుతున్నా... ఆయన కొత్త కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చిందని వివరిస్తారు. పరిశోధక రంగంలో ఎక్స్ఛేంజ్ లెర్నింగ్ ఉండాలంటరు.

image


రైతు బిడ్డగా....

విజయ్ రైతు కుటుంబంలో పుట్టడం వల్ల సహజంగానే వాళ్ల సమస్యలపై అవగాహన ఉంది. వ్యవసాయ రంగంలో టెక్నాలజీతో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత రాజపాల్యం సందర్శించినప్పుడు ఒక ఐడియా కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. రైతులకు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో నీటి సమస్య ఒకటి. 100 లీటర్ల నీటిని సమర్ధవంతంగా ఎలా వాడుకోవచ్చో తెలియచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ప్రతి దాన్ని కొలిచేందుకు యంత్రాలు ఉన్నాయి. మట్టి, ఖనిజాలు PH స్థాయిలు ఎదుర్కొనే..విధంగా నీటిలో తేమ కొలిచే పరికరాలను సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి చిన్న గ్రామం, పట్టణాల్లో ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోయినా.. సెల్ ఫోన్లు మాత్రం వచ్చేశాయి. సో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా రైతులకు సెల్ ఫోన్లకు సమాచారం ఇవ్వవచ్చని గ్రహించారు.

స్మార్ట్ వ్యవసాయం

వ్యవసాయం దండగ అనుకుంటున్న పరిస్థితుల్లో స్మార్ట్ సిస్టమ్ తీసుకొచ్చి పండగ చేసేశారు. KIC ఆ పరికరంతో పొలంపై పిచికారి చేస్తే.. మరొక పరికరం డేటాను స్టడీ చేస్తుంది. మొక్కలకు నీటి అవసరం పై సమాచారం అందిస్తుంది. వీటి వల్ల నీటి వాడకం తగ్గడం.. ఫలితంగా విద్యుత్ వినియోగం కూడా ఆదా అవుతుంది. అయితే ఆయన స్టడీ చేసిన ఈ ప్రాజెక్టుకు దేశంలో ఫండింగ్ కోసం ప్రయత్నించారు. 

తర్వాత CERN కి వెళ్ళినప్పుడు యూరోపియన్ కమిషన్‌కు ఈ ప్రాజెక్టు వివరించడం... ఆయనకు ఆర్ధిక సాయాన్ని అందిస్తానని చెప్పడంతో విజయ్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. దేశంలో ఈ ప్లాన్ అమలు చేయడానికి నెల రోజుల సెలవు తీసుకున్న తరువాత, పరిశోధన, పునాది కోసం దేశానికి తిరిగి వచ్చారు. UN ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ టెలికాం యూనిట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో విజయ్ ఆవిష్కరణ టాప్ 10 లో ఒకటిగా నిలిచింది. విజయ్ ప్రోగ్రామ్స్‌కు CERN తో పాటు పలు ప్రపంచ సంస్థల నుంచి మద్దతు లభించింది.

మే, 2015 జపాన్ లో జరిగిన ఆసియా ఆంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డుకు స్మార్ట్ అగ్రి సంస్థ తరపున ఆయన ఎంపిక అయ్యారు. ఆ తర్వాత విజయ్ నిర్వహించే స్మార్ట్ అగ్రి సంస్థ స్విట్జర్లాండ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌లో అవార్డును గెలుచుకుంది. దీంతో విజయ్‌కు ఇంటర్నేషనల్ సంస్థల నుంచి కూడా మద్దతు లభించింది. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు విజయ్. CERN లో బిజీగా ఉండే విజయ్... వీకెండ్స్‌లో స్మార్ట్ అగ్రి పని చేస్తుంటారు. మనిషి జీవితానికి సైన్స్ ఎంతో ప్రాముఖ్యత ఉందని... వాటిని ఒక సక్రమమైన పద్ధతుల్లో వినియోగించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని విజయ్ రాఘవన్ చెబుతారు. స్మార్ట్ అగ్రి ప్రయోగశాలల్లో సక్సెస్ అయింది.. దీన్ని గ్రౌండ్ లెవల్ లో పరీక్షిస్తున్నామన్నారు ..


అతని ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదామా !