బోర్ కొట్టే చదువుల నుంచి విముక్తి కలిగించే ఈజ్ఎడ్

ఈజీగా చదువులు నేర్పించే సైట్ఈ లెర్నింగ్ వెబ్ పోర్టల్ పై విశేష స్పందనఏడాది కాలంలో 250పైగా వీడియోలు తయారీ

బోర్ కొట్టే చదువుల నుంచి విముక్తి కలిగించే ఈజ్ఎడ్

Tuesday June 16, 2015,

4 min Read

2003లో సుప్రసిద్ధ గణాంకశాస్త్రవేత్త యేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఎడ్వర్డ్ రాల్ఫ్ టఫ్టే ఒక వ్యాసం రాస్తూ, మైక్రో సాఫ్ట్ పవర్ పాయింట్ మీద ఘాటైన విమర్శలు చేశారు. ఒక మేధావిగా ఆయన ఆ సాఫ్ట్ వేర్ మీద తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. నిజాన్ని సంక్షిప్తం చేసి, ఆలోచనను పలచనచేసి, చెత్త గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను దృష్టి మళ్ళించే సాధనంగా పవర్ పాయింట్‌ని అభివర్ణించారు. విషయాన్ని విశ్లేషిస్తూ ప్రేక్షకులతో పరస్పరం సంభాషిస్తూ వివరించటానికి బదులు కేవలం చెప్పే వ్యక్తినే కేంద్రంగా చేసుకొని సాగే ప్రవచనంలా మార్చే ప్రక్రియగా దాన్ని తయారు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు.

“మామూలుగా చూసే వాళ్లకు అది పాయింట్ల వారీగా సూటిగా చెబుతునట్టు, ఒక ఆలోచనను క్రమబద్ధం చేసినట్టు అనిపించవచ్చునేమోగాని వాస్తవంలో మాత్రం అది నిజం కాదు. విశ్లేషణ నుంచి తప్పించుకోవటానికి అదొక మార్గం మాత్రమే” అంటారాయన. నిజానికి బిజినెస్ ప్లానింగ్‌లోనూ కార్పొరేట్ వ్యూహాల రూపకల్పన లోనూ విస్తృతంగా వాడుకుంటున్నప్పటికీ ఇది ఆలోచనను చాలా పరిమితం చేస్తుందని, పైపైన స్పృశిస్తూ సాగుతుందని హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కూడా ఒక అధ్యయనం అనంతరం విశ్లేషించింది. మొత్తంగా చూస్తే ఈ మేధావులందరూ చెబుతున్నదేంటంటే, బులెట్ పాయింట్ల బోధన మనల్ని వెర్రివెంగళప్పలుగా మారుస్తుందని. అయితే ఈ రోజుకీ మన పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల దాకా పవర్ పాయింట్ అనేది బోధనలో చాలా విస్తృతంగా వాడుతున్న ఉపకరణం. విద్యార్థులు కూడా సమగ్రంగా ఆధ్యయనం చేయటానికి బదులు కేవలం ఆ పాయింట్ల చుట్టూ ఆలోచనకే పరిమితమవుతున్నారు. కాకపోతే, మరింత ఎక్కువగా ఆధ్యయనం చేస్తున్నట్టు అనిపించటానికి ఒక కాన్సెప్ట్‌ను మూడు భాగాలుగా విభజించి మూడు స్లైడ్స్ తయారు చేస్తున్నారు. కానీ అలా చేయటం విద్యార్థులకు మరింత బోర్ కొట్టించటమే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు.

ఇంక్రీడ్ టీం క్యారికేచర్

ఇంక్రీడ్ టీం క్యారికేచర్


పూర్తిగా సరళతరంగా మారిన పవర్ పాయింట్ వలన టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ముందున్నామనే భావనలో ఉండగా అది తెలియని సంప్రదాయ ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోధన అనేది విద్యార్థులను చురుగ్గా ఆలోచింపజేస్తూ, చర్చిస్తూ సాగాల్సి ఉండగా ... పవర్ పాయింట్ అందుకు పూర్తిగా భిన్నమైన ధోరణిని ప్రోత్సహించటం పట్ల ఆవేదన చెందుతున్నారు. విద్యాపరంగా ఏర్పడిన ఇలాంటి శూన్యాన్ని నింపటానికి ఒక పూర్తి స్థాయి డిజిటల్ అధ్యయన ఉపకరణాల సమూహం ఒకటి రూపుదిద్దుకొంది. సంజయ్ గాంధి, భీషమ్ గాంధి, షమిలా ఠాకూర్ కో ఫౌండర్లుగా 2012 జూన్ లో ఇంక్రీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. విద్యార్థులను కేంద్రబిందువుగా పెట్టుకొని కాన్సెప్ట్‌ని వివరించటమే ధ్యేయంగా ఈ సంస్థ EzEd.in, UniEd అనే రెండు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదలచేసింది. భారతదేశంలోని 17 లక్షలకు పైబడిన ఇంజనీరింగ్ విద్యార్థులకు అనేక సంక్లిష్టపు కాన్సెప్ట్‌లను సరళంగా వివరించటం ఇందులో చూడవచ్చు.

ఈజ్ఎడ్ కోర్సులు

ఈజ్ఎడ్ కోర్సులు


ఇంక్రీడ్ టీం

తాజా ఆలోచనలతో, ఆదర్శాలతో అప్పుడే అమెరికా నుంచి దిగింది షమిలా. ఇంజనీరింగ్ పరికరాల అమ్మకాలతో కుస్తీ పడుతూ తన మేధాశక్తిని వృధా చేస్తున్నానని బాధపడుతున్నాడు సంజయ్. అసహనం, ఆదర్శభావాలు, ఏదైనా చేయాలన్న తపన, రిస్క్ తీసుకోవటానికి వెనకాడని మనస్తత్వం వెరసి ఈ వెంచర్ ప్రారంభాన్ని ప్రేరేపించాయంటాడు భీషమ్.

''నేను సంజయ్‌తో కలిసి మార్కెటింగ్ డివిజన్ పనులు చూసుకుంటున్నా. ఆ సమయంలో మేం మా ఇంజనీరింగ్ ఉత్పత్తులను వివరించటానికి కొన్ని యానిమేషన్ వీడియోలు తయారుచేశాం. ఎంతో సంక్లిష్టమైన ఆలోచనను అంత సులువుగా, సమర్థవంతంగా తెలియజెప్పగలగటం చూసి మా క్లయింట్స్ చాలా ఆశ్చర్య పోయారు. సరిగ్గా అప్పుడే క్రియేటివిటీ మీద నాకున్న ప్రేమాభిమానాలు అర్థమయ్యాయి. విజువల్ మీడియంలో చాలా పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని అప్పుడే నాకనిపించింది''.

EzEd.in అనేది వాళ్ళ ఈ-లెర్నింగ్ వెబ్ పోర్టల్. అందులో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోర్సులుంటాయి. అది చాలా తక్కువ నిడివిగల యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ద్వారా క్లిష్టమైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్‌లను వివరిస్తుంది. దానికి తోడుగా ఈ-నోట్స్, ఆఖరి నిమిషంలో రివిజన్‌కి పనికొచ్చే పాయింట్లు, యూనివర్సిటీ ప్రశ్నలు-జవాబులు, స్వయంగా పరీక్షించుకోవటానికి అపరిమితమైన ప్రశ్నావళి, తద్వారా కాన్సెప్ట్‌లు సమగ్రంగా అర్థం చేసుకోవటానికి వీలుకల్పించటం ఇందులో ఉంటాయి.

మరో వైపు UniEd (యూనివర్సల్ ఎడ్యుకేషన్) అనేది ప్రత్యేకంగా యూనివర్సిటీ సిలబస్ కోసం రూపొందించింది. బోధనకూ, అధ్యయనానికీ ఉపయోగపడే మల్టీమీడియా పాఠాలుంటాయి ఇందులో. UniEd ద్వారా విద్యార్థులు తమ సిలబస్‌ని మరింత మెరుగ్గా కళ్ళకు కట్టినట్టు చూసుకోగలుగుతారు. అప్పుడు ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడా అదనపు సమాచారం అందిస్తూ విద్యార్థులకు వ్యక్తిగతమైన ఫీడ్ బాక్ ఇస్తూ వాళ్ళ పనితీరును కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయటానికి వీలవుతుంది.

ఇంటర్నెట్ విస్తృతి బాగా పెరుగుతున్నకొద్దీ విద్యార్థులు తమ అనుమానాలన్నిటికీ ఆన్ లైన్‌లో పరిష్కారం వెతుక్కోవాలనుకుంటున్నారు. ప్రధాన స్రవంతిలోని విద్యార్థులకు సరికొత్త విధానంలో చదువు అందించటానికి ప్రధాన వనరుగా ఉండాలన్నది EzEd, UniEd లక్ష్యం. చదువు అనేది ఒకప్పటికంటే ఇప్పుడు బాగా సంక్లిష్టంగానూ, ఆచరణాత్మకంగానూ తయారైంది. పైగా, భారతీయ పాఠశాలల్లో అనుసరిస్తున్న సంప్రదాయ పరోక్ష అధ్యయన విధానాలు అదే పనిగా విఫలమవుతూ వస్తున్నాయి. లక్షలాది మంది చురుకైన విద్యార్థులు కాలం చెల్లిన విద్యావిధానానికి బలవుతున్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయటానికి, ఆ మార్పునకు పునాదులు కావటానికి సంజయ్, భీష్మ, షమిలా సిద్ధమయ్యారు. ఆలోచిస్తూ నేర్చుకోవటమనే ప్రక్రియకు విస్తృతమైన ప్రజాదరణ కల్పించటానికి పూనుకున్నారు.

“అందుబాటులో ఉన్న టెక్నాలజీని మేం పూర్తిగా వాడుకున్నాం. విద్యార్థులనే కేంద్రబిందువుగా ఊహించుకుంటూ వ్యక్తిగతంగా వాళ్ళు నేర్చుకుంటున్న అనుభూతి కలిగేలా ఒక్కో విద్యార్థికీ అతడి వేగానికీ, సమయానికీ, అనుకూలతకూ తగినట్టుగా రూపొందించటం మా ప్రత్యేకత “ అంటారు షమిలా.

ఇంక్రీడ్ టీం

ఇంక్రీడ్ బృందం అంతా యువకులే. అందరూ అవిశ్రాంతంగా కృషి చేసేవారే. కొత్త ఉద్యోగులను తీసుకోవాలంటే ఒకటే పరీక్ష. ఒక సంక్లిష్టమైన అంశాన్ని ఎంత సులభంగా వివరించవచ్చో వాళ్ళకు తెలిసి ఉండాలి. “మేం మా సొంత కంటెంట్‌నే పునఃసమీక్షించుకుంటాం. మాకు అర్థం కాకపోతే మళ్ళీ మార్చి తయారు చేస్తాం. యూజర్‌కి ఏమీ తెలియదని, ఇంజనీరింగ్ మీద ముందస్తు పరిజ్ఞానం అసలే లేదని, అయినప్పటికీ ఇది బాగా అర్థం కావాలని అనుకొని చేస్తాం. “ అని చెప్పారు సంజయ్.

సెమీ కండక్టర్లమీద చేసిన తొలి వీడియో మొదలుకొని EzEd.in వెబ్ సైట్ ప్రారంభం నుంచి UniEd కి ప్రొఫెసర్లనుంచి అభినందనలతో కూడిన ఫీడ్ బాక్ వరదలెత్తింది. కేవలం ఏడాది కాలంలో 250 వీడియోలు తయారుచేశారు. అ విధంగా ఇంక్రీడ్ బృందం దూసుకుపోతూనే ఉంది. కాస్త పెద్ద ఆఫీసు తీసుకొని, టీమ్ ని విస్తరించుకుంటూ భారతదేశమంతటా ఉన్న విశ్వవిద్యాలయాలన్నిటి కోర్సులకూ వీడియోల రూపకల్పన సాగిస్తోంది. ఇంక్రీడ్ ఇప్పుడు విద్యారంగం లోని ఇతర విభాగాల వైపు కూడా దృష్టి సారిస్తోంది.

“ మేం మా సొంత కంటెంట్ తయారుచేసుకోగలగటం, మాకంటూ ఒక యానిమేషన్ బృందం ఉండటం వలన దాన్ని మేం సమర్థంగా ఉఅపయోగించుకోవాలనుకున్నాం. అలా ఏర్పడిందే యానిమేషన్ డివిజన్ DiViz. అది విద్యా సంస్థలకు వాళ్ళు కోరిన విధంగా కంటెంట్ తయారుచేసి ఇస్తుంది. అలాగే కార్పొరేట్ సంస్థలకు తమ ఉత్పత్తులను వివరించే వీడియోలు, సిబ్బంది శిక్షణకు అవసరమయ్యే వీడియోలు తయారుచేసి ఇవ్వటం మొదలు పెట్టాం.”విద్యారంగం మీద, దాని వ్యాపారం మీద, కంటెంట్ తయారీ మీద, యానిమేషన్ మీద దాదాపు ఎలాంటి అవగాహనా లేకుండానే సంజయ్, షమిలా, భీషమ్ ఇందులో అడుగుపెట్టారు. తెలియని చోట ఇలా అడుగుపెట్టటం వాళ్ల జీవితాల్లో అతి పెద్ద రిస్క్. కానీ ఆ రిస్క్ కి తగిన ఫలితం చేకూరింది. కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళ వీడియోల ద్వారా లబ్ధి పొందిన లక్షలాది మంది విద్యార్థులకి కూడా.

ఇంక్రీడ్ టీం

ఇంక్రీడ్ టీం


“మాకున్నదల్లా ఒకటే ఆలోచన, మేం సాధించగలమన్న మా నమ్మకం మాత్రమే. అందుకే ముందూ వెనకా ఆలోచించకుండా ఈ లోతైన నీళ్ళలో దూకేశాం. ఇప్పుడిక ఈత నేర్చుకోక తప్పలేదు మరి “