టైలర్ నుంచి ఉబెర్ డ్రైవర్‌గా తెలుగమ్మాయి ప్రస్థానం

ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతం నుంచి బెంగళూరుకు వలస..బెంగళూరులో మొదటి మహిళా ఉబెర్ డ్రైవర్..

టైలర్ నుంచి ఉబెర్ డ్రైవర్‌గా తెలుగమ్మాయి ప్రస్థానం

Tuesday July 21, 2015,

2 min Read

ఈ మధ్య ఒక రోజు బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా ఆఫీస్‌కు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఓ లేడీ డ్రైవర్ క్యాబ్ తీసుకుని రావడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు. మజుందార్ షాకే కాదు డ్రైవర్ భారతికి కూడా ఈ ప్రయాణం ఓ మధురానుభూతి.

కిరణ్‌ మజుందార్‌షాతో విమెన్ డ్రైవర్ భారతి

కిరణ్‌ మజుందార్‌షాతో విమెన్ డ్రైవర్ భారతి


బెంగళూరులో ఉబెర్ సంస్థకు భారతి మొదటి మహిళా డ్రైవర్. ఇటీవలే ఆమె కొత్త కారు కొని సంస్థలో భాగస్వామి అయ్యారు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్న భారతి ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక. తోటి మహిళా డ్రైవర్లకు ఆమె ఆదర్శం. అంతేకాక.. తన ఫోర్డ్ ఫియెస్టా ఈఎంఐకి సరిపడా సంపాదించడంలో భారతి సక్సెస్ అయింది. వచ్చే ఏడాది ఆమె మెర్సిడెజ్ కొనాలనుకుంటోంది. కేవలం డ్రైవింగ్ నేర్చుకోవడం భారతి సాధించిన సక్సెస్ కాదు.. ఆమె వెనుక ఇంకేదో ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కుగ్రామం నుంచి భారతి 2005లో సోదరుడితో కలిసి ఉండేందుకు బెంగళూరు వచ్చింది. కేవలం పదో తరగతివరకూ మాత్రమే ఆమె చదువుకుంది. టైలరింగ్ ద్వారా ఉపాధి పొందేది. అయితే ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ఇతర ఉద్యోగాలకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలా ఓ ఎన్జీవో సంస్థకు మహిళా డ్రైవర్లు కావాలనే ప్రకటన కంటపడింది. అయితే ఉన్న ఉద్యోగాన్ని వదిలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోవడం కష్టమైన నిర్ణయం. అయితే తనకు తెలిసిన మహిళా డ్రైవర్లు ఎవరూ లేరు. అంతేకాక పురుషాధిక్య సామ్రాజ్యంలో నిలదొక్కుకోగలనా ? అనే భయం ఆమెను వెంటాడింది. అయితే బాగా ఆలోచించిన తర్వాత టైలరింగ్ జాబ్ వదిలేసి డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. 2009లో ఢిల్లీలో మహిళా డ్రైవర్లు కావాలంటూ ప్రకటన వెలువడింది. అంతేకాక రూ.15వేలు జీతం ఇస్తామంటూ భారతికి ఆఫర్ వచ్చింది. ఇది ఆమెలో మరింత నమ్మకాన్ని పెంచింది. అయితే ఆమె ఆ ఉద్యోగంలో చేరలేదు. బెంగళూరులోనే పని చేయాలనేది ఆమె కోరిక. ఇందుకోసం ఆమె అనేక ట్రావెల్ ఆపరేటర్లను సంప్రదించింది. చివరకు ఎంజెల్ సిటీ క్యాబ్స్‌లో చేరింది. బెంగళూరులో మొదటి మహిళా డ్రైవర్ గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2013లో ఉబెర్ సంస్థలో జాయిన్ అయింది. నాలుగు నెలల్లోపే సొంతంగా కారు కొనాలని నిర్ణయించుకుంది. వెంటనే 2014 ఫిబ్రవరిలో ఫోర్డ్ ఫియస్టాను బుక్ చేసింది. ఇది భారతి సాధించిన అతి పెద్ద విజయం. తన ఊహలకు రెక్కలొచ్చిన సందర్భం. తన కలలు నిజమైన అద్భుత సమయం..

తన కారు ముందు భారతి

తన కారు ముందు భారతి


“1.సాధారణంగా మహిళలు ఇలాంటి ఉద్యోగం చేయడం చాలా మందికి నచ్చదు. 

2. పురుషులతో సమానంగా మహిళలు పనిచేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు.

3. బయటి ప్రపంచంతో ఎలా మెలగాలో మహిళలకు తెలీదు. కేవలం ఇంటి పనులు చేయడానికే మహిళలు పనికొస్తారు అనేది పురుషుల ఆలోచన అంటారు” భారతి. 

అయితే భారతి ఇప్పుడు ఎంతో నేర్చుకుంది. మహిళా హక్కులపైన కూడా పోరాడుతోంది. మహిళల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటోంది. “కారు కొనాలనుకుంటున్నట్లు భారతి చెప్పగానే మేం చాలా సంతోషించాం. సొంతంగా, సమర్థవంతంగా పని చేయడానికి ఆమెకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. తప్పకుండా ఆమె ఈ రంగంలోకి మరింత మంది మహిళలు ప్రవేశించేందుకు దోహదపడుతుంది.” అంటున్నారు ఉబెర్ సంస్థ బెంగళూరు మేనేజర్ భవిక్ రాథోఢ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉబెర్ సంస్థ తొలి కస్టమర్ కు రూ.500 తగ్గింపునిచ్చింది. ఇది భారతి పేరుపైన అందించడం ఆమెకు దక్కిన గౌరవం.