ప్రయాణ ఖర్చు, పర్యావరణ కాలుష్యం తగ్గించే 'కో యాత్రి'

ప్రయాణ ఖర్చు, పర్యావరణ కాలుష్యం తగ్గించే 'కో యాత్రి'

Saturday September 26, 2015,

3 min Read

దసరా,దీపావళి,సంక్రాంతి వంటి పెద్ద పండగలు వచ్చాయంటే.. చాలు .. హైదరాబాద్ సగానికిపైగా ఖాళీ అయిపోతుంది. జనం అంతా ఊళ్లకు వెళ్లిపోతారు. చాలా ఏళ్ల నుంచి ఇది జరుగుతూనే ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయినా పండగ రోజుల్లో ఆర్టీసికి ఉన్నంత డిమాండ్ అంతా ఇంతా కాదు. ట్రెయిన్స్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ప్రైవేట్ వెహికల్స్ కూడా బాదేయడం మొదలుపెడతారు. మరి దీనికి పరిష్కారం లేదా ? అంటే ఎందుకు లేదూ.. తాము ఈ సమస్యకు పరిష్కారం సూచిస్తామంటున్నారు కోయాత్రి ఫౌండర్ ప్రదీప్ రెడ్డి.

“ ప్రతీ ఏడాది దసరాకి నేను వరంగల్ కి వెళ్తా. అదే సంక్రాంతి వస్తే మా అమ్మమ్మ వాళ్లూరు ఖమ్మం వెళ్తా. ప్రతిసారి ఊరికెళ్లినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కంఫర్టబుల్‌గా జర్నీ చేయలేకపోవడం . ఈ సమస్యకే పరిష్కారం చూపాలని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నా”- ప్రదీప్.
image


పెద్ద పండుగలు వచ్చినప్పుడు యాత్రికుల కోసం ఎన్ని బస్సులు, రైళ్లు ఏర్పాటైనా అవి ఏ మూలకూ సరిపోవు. సొంతూరు వెళ్లాలంటే వ్యవయప్రయాసలు తప్పవు. అలాంటి కష్టాలను తప్పించాలనే తాపత్రాయంతో మొదలైన స్టార్టప్ కోయాత్రీ డాట్ కామ్ . ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో కార్ పూలింగ్ యాప్‌లు ఉన్నాయి. కానీ కోయాత్రీ ఇంటర్ సిటీ కార్ పుల్లింగ్ యాప్. ఇప్పటి వరకూ 600 రైడ్స్‌తో చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరారు. ఇది గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ ఇలాంటి సిస్టమ్‌కు అలవాటు పడటం అనేది ముఖ్యం.

ఇంటర్‌సిటీ కార్ పూలింగ్

హైదరాబాద్ నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో కార్లు వైజాగ్, విజయవాడ, వరంగల్, కడప ఇలా వివిధ జిల్లాలకు వెళ్తుంటాయి. కార్ ఓనర్ ఒక్కరే కార్‌లో వెళ్లేకంటే తోడుగా అక్కడకు వెళ్లే వారిని తీసుకెళ్లడం మంచిది కదా. దీంతో కో ప్యాసింజర్లు ఇచ్చే దానితో ఎంతో కొంత పెట్రోల్ భారమైనా తగ్గుతుంది కదా.. ? లేకపోతే టోల్ గేట్ ఖర్చులకైనా పనికొస్తుంది కదా.. ? ఇది ఓనర్ల పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక కో ప్యాసింజర్లకూ కొన్ని లాభాలు ఉన్నాయి. బస్సులోనో లేదా ఏదైనా ప్రైవేట్ వాహనంలో వెళ్లే కంటే అటువైపు వెళ్లే కార్‌లో వెళ్లడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుంది. ఇదొక కేస్ స్టడీలా తీసుకొని ప్రారంభించిందే ఇంటర్ సిటీ కార్ పూలింగ్. దీనికి తన అనుభవం కూడా తోడు కావడంతో ఈ స్టార్టప్ ప్రారంభం నుంచే సక్సస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

“హైదరాబాద్‌లో ఐటి ఐటి ఆధారిత, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలెక్కువ. లక్షల్లో జనం ఇక్కడకి వస్తుంటారు. సెలవులకు సొంతూరు వెళ్లడం అందరికీ అలవాటైన విషయమే. నేనుకూడా అందులో ఒకడినే. ఇలా ఊరెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అభివృద్ధి చేసిందే ఈ కోయాత్రి ప్లాట్ ఫాం.” అంటారు ప్రదీప్
ప్రదీప్ , కోయాత్రి ఫౌండర్

ప్రదీప్ , కోయాత్రి ఫౌండర్


ఇప్పటి వరకూ ఎంతమంది యాత్రికులు

2014 ఏడాది చివర్లో ఈ స్టార్టప్ ప్రారంభించారు.ఇప్పటి వరకూ 600లకు పైగా రైడ్స్ పూర్తయ్యాయి. కార్ పూలింగ్ కల్చర్ మనకి కొత్త విషయమే. అయినప్పటికీ జనం దాన్ని ఎడాప్ట్ చేసుకోవడం ఆనందించదగినదే. ప్రతి రోజు 10నుంచి 15మంది కొత్త యూజర్లు లాగిన్ అవుతున్నారు. ఆండ్రాయిడ్ యాప్ 10వేల డౌన్ లోడ్స్ ని పూర్తి చేసింది. 9 లక్షలు ట్రాంజాక్షన్ పూర్తయింది. ఈ ఫిగర్లన్నీ తక్కువగా అనిపించొచ్చు. కానీ పూర్తి భిన్నమైన ఈ కాన్సప్ట్‌ను జనాలు ట్రై చేయడం మా స్టార్టప్ భవిష్యత్ పై ఆశలు చిగురించేలా చేస్తోంది. రోజూ చాల మంది రైడ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్ సంఖ్య బాగానే ఉంటుంది. ఇదొక మంచి పరిణామం. కంఫర్టబుల్ జర్నీ కోసం జనం ఖచ్చితంగా ఇలాంటి సాధనాలు వినియోగించక తప్పదు. ఈ ఫ్లాట్ ఫాంలో తాము ముందుగా ఉండటం గర్వంగా ఉందని ప్రదీప్ చెబ్తున్నారు.

కోయాత్రీ టీం

టీం విషయానికొస్తే ప్రదీప్ కోయాత్రీ ఫౌండర్ సీఈఓగా ఉన్నారు. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రదీప్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్‌లో ఉంటూనే గతంలో కిరాణాఘర్ పేరుతో ఓ స్టార్టప్ ప్రారంభించారు. అయితే అది పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌తో కోయాత్రీ ప్రారంభించారు. 6నెలల్లోనే పదివేల డౌన్ లోడ్స్ తో దూసుకు పోతోంది. క్రిష్ణ విదాలా కంపెనీకి సీటీఓగా వ్యవహరిస్తున్నారు. భాస్కర్ సర్గందమ్ కంపెనీ బిజినెస్ డెవలపర్‌. వీళ్లతో పాటు మరో ముగ్గురు కూడా ఈ స్టార్టప్‌లో పనిచేస్తున్నారు. మొత్తం ఆరుగురు టీంతో కోయాత్రీ నడుస్తోంది.

image


భవిష్యత్ ప్రణాళికలు

పూర్తి బూట్ స్ట్రాప్డ్‌ స్టార్టప్ అయిన కోయాత్రీకి అమెరికాకు చెందిన న్యూమరిక్ టెక్నాలజీ కంపెనీ ప్రెసిడెంట్ సుధీర్ గద్దం రూ. 60 లక్షల్ సీడ్ ఫండింగ్ ఇచ్చారు. ఏంజిల్ ఫండింగ్ వస్తే కార్ పూలింగ్‌ను దక్షిణాది నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. ఇంట్రాసిటీలో కూడా పూర్తి స్థాయి పూలింగ్‌కు కోయాత్రీ కసరత్తు చేస్తోంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్య కూడా కొద్దిగానైనా పరిష్కారం లభిస్తుందనే స్లోగన్‌ను జనంలోనికి తీసుకెళ్లడానికి కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నారు. తమతో కలసి వచ్చే స్వచ్ఛంద సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫౌండర్ అంటున్నారు. ఫండింగ్ వస్తే టీం ను కూడా మరింత విస్తరించి, మరిన్ని సేవలను తీసుకురావాలని యోచిస్తున్నారు.