మహిళలకు ఇంటి సాయం- అదే వ్యాపార మార్గం

- తల్లులు, నిపుణులు, గృహిణులకు సహకారం- ఇళ్ళకూ, సేవా సంస్థలకూ అనుసంధానం- భారతీయ గృహావసరాలు తీర్చే విపణి రూపకర్త

మహిళలకు ఇంటి సాయం- అదే వ్యాపార మార్గం

Friday April 17, 2015,

3 min Read

పాత్రికేయురాలైన ఆమె గృహావసరాలు తీర్చేందుకు ఉపక్రమించారు. దానికోసం ఓ సంస్థను స్థాపించారు. తనదైన మార్గంలో పయనిస్తూ గృహిణులూ, తల్లులూ, ఉద్యోగ నిపుణులకు సేవలందిస్తున్నారు. టైమ్‌సేవర్స్ సంస్థకు సి.ఇ.ఓ., సహవ్యవస్థాపకురాలు అయిన దేవదత్తా ఉపాధ్యాయ. భారతీయ గృహావసరాలు తీర్చే ఓ విశిష్టమైన మొబైల్-ఫస్ట్ విపణి టైమ్‌సేవర్స్. “జీవితాన్ని మీరెలా కావాలంటే అలా మలచుకోవచ్చు. మనలో ప్రతిఒక్కరికీ ఓ ఎంపిక ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్నదాన్నిబట్టి సులువైన అంశమో, కష్టమైన అంశమో దాన్నుంచి ఉత్పన్నమవుతుంది” అంటారామె.


దేవదత్త

దేవదత్త


దేవదత్త (దేవ్) తన సకల ప్రయత్నాల్నీ, ప్రేరణనీ విజయం దిశగా మళ్ళించుకున్నారు. సాహిత్యంలో పటిష్టమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె పాత్రికేయురాలు కావాలని ఎల్లప్పుడూ కోరుకునేవారు. తన కలలను సాఫల్యం చేసుకోవడం కోసం నాగపూర్‌లోని ది టైమ్స్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సేల్స్ విభాగంలో ఆమె చేరాల్సి వచ్చింది. దీనితో మీడియా-సేల్స్ విభాగంలో ఓ రెస్పాన్సివ్ ఎగ్జిక్యూటివ్‌గా వృత్తిజీవితాన్ని ఆరంభించారు. ఆ తరువాత, అప్పుడే ఆరంభమైన సంస్థల నుంచీ ఫార్చ్యూన్ 500 సంస్థలవరకూ అత్యుత్తమ మీడియా సంస్థలు కొన్నిటిలో ఆమె పనిచేసి అనుభవం గడించారు.

దేవ్ వ్యక్తిగతమైన, వృత్తిపరమైన ప్రయాణం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోడానికి హర్ స్టోరీ ఆమెతో సంభాషించింది.

తొలినాళ్ళ ముచ్చట్లు

ఒడిశాలో ఉక్కునగరమైన రూర్కెలాలో దేవ్ జన్మించారు. ఆమె తండ్రి ఓ హెచ్ ఆర్ నిపుణుడు. తల్లి విద్యా వేత్త. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత, తొంభయ్యవ దశకం చివర్లో ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ కి ఆమె కుటుంబం తరలిపోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె నాగపూర్‌కి వెళ్ళారు. అక్కడే ఆమె వృత్తిపరమైన ప్రయాణం ఆరంభమయింది. జర్నలిజం విద్యార్థిని అయిన దేవ్ తన వివాహం తర్వాత, మీడియా సేల్స్ రంగంలో ప్రవేశించారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, యాహూ! ఇండియా, వీడోపియా ఇంక్.లాంటి అగ్రశ్రేణి సంస్థలకు ఆమె సేవలందించారు.

ఆరంభం

సొంతంగా ఏదైనా చేయాలనే కోరిక తనను ఎల్లప్పుడూ వెన్నాడేదని దేవ్ అంటారు. అయినప్పటికీ, ఓ వ్యాపార భావనగా టైమ్‌సేవర్స్ ఆమె ఆలోచనల్లోకి అంత త్వరగా రాలేదు. వ్యక్తిగతమైన ఓ అనుభవం కలిగిన తరువాత దీనికి అంకురార్పణ జరిగింది. 2012లోకి వెళ్తే, ఉద్యోగినిగా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన జీవితం మధ్య దేవ్ సతమతమైపోయేవారు. గృహిణిగా, ఓ తల్లిగా, ఓ వృత్తి నిపుణురాలిగా తన పాత్రల్ని సమన్వయం చేసుకోవడం ఆమెకు ఎల్లప్పుడూ కష్టమైపోతూ ఉండేది.

“వేగంగా పరిగెడుతున్న నగరజీవనంలో, అండగా నిలిచే ఎలాంటి వ్యవస్థా లేకుండా, ఓ చిన్న కుటుంబంలో శిశువుకు తల్లిగా ఉండడాన్ని ఊహించుకోండి. రోజువారీ పనులూ, కార్యకలాపాలకు అందుబాటులో సాయం దొరకబుచ్చుకోవడం కేవలం నాకు మాత్రమే కాదు నాలాంటి చాలామందికి ఓ పెద్ద సవాలు. ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నప్పుడు, ఎల్లప్పుడూ విస్తరణకు అవకాశం ఉన్న నాలుగు బిలియన్ డాలర్ల మార్కెట్ రూపంలో అవకాశం కనిపించింది. నేనూ, నా సహవ్యవస్థాపకులు మరొకరూ కలిసి టైమ్‌సేవర్స్ గురించి ఆలోచించాం, మా మానసపుత్రిక అయిన ఈ సంస్థ ఇప్పుడు ఓ సాకారమైన వ్యాపారంగా ఆవిర్భవించింది” అని వివరించారు దేవ్.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తన ప్రయాణాన్ని నిర్దేశించుకున్న ఆమె ఇప్పుడు పదేళ్ళ బిడ్డకు పూర్తికాలం ఆలనాపాలనా చూస్తున్న తల్లి కూడా.


మొక్కవోని ధైర్యమే దేవ్‌ విజయ రహస్యం

మొక్కవోని ధైర్యమే దేవ్‌ విజయ రహస్యం


టైమ్‌సేవర్స్ గురించి ఆమె ఏమంటున్నారంటే...

గృహ సేవా అవసరాలన్నిటికీ పరిష్కారం చూపించే ఏకైక గమ్యం టైమ్‌సేవర్స్ అని దేవ్ అంటున్నారు. ధ్రువీకరణ పొందిన హోం సర్వీస్ ప్రొవైడర్లను పరిశీలించి, పర్యవేక్షించిన తర్వాత కస్టమర్లకు ఇది అనుసంధానం చేస్తుంది. ఈ సేవల్లో ఎక్కువశాతం గృహ నిర్వహణ, వన్-టైమ్ సేవలు లాంటివి ఉంటాయి. ఇది ఈ సంస్థ అందిస్తున్న సేవల్లో ఒక కోణం మాత్రమే. అసంఘటితంగా ఉన్న హోం సర్వీస్ ప్రొవైడర్లను మరింత సంఘటితమయ్యేందుకు ఇది తోడ్పడుతోంది. తద్వారా వారి జీవన ప్రమాణం మెరుగయ్యేందుకు దోహదం చేస్తోంది. ప్రస్తుతం, ముంబాయి, పూణే నగరాల్లో 500కు పైగా సర్వీస్ ప్రొవైడర్లకు ఈ కంపెనీ చేరువైంది. వారికి తగినంత గౌరవం, హుందాతనం కల్పిస్తోంది.

“ఈ వెంచర్ ని మూడేళ్ళ కిందట ముంబాయిలో ఆరంభించాం. గృహ సేవా అవసరాల్లో దాదాపు 70 నుంచి 75 శాతం వరకూ తీరుస్తున్నాం. అయితే కంపెనీ పయనించాల్సిన దూరం ఇంకా చాలానే ఉంది” అన్నారు దేవ్. ఆమె మాటల్లో ఆశా దృక్పథం తొణికిసలాడింది.

ఆమెను నడిపించే శక్తులేమిటంటే...

దేవ్ జీవితంలో దశలు మారుతున్న దరిమిలా ఆమెను నడిపించే శక్తులు కూడా మారిపోతూ వచ్చాయి. మూడేళ్ళ కిందటి వరకూ కార్పొరేట్ ప్రపంచంలో తనదైన ముద్ర సృష్టించడమనేది తనకు చోదకశక్తిగా ఉండేదనీ, ఇప్పుడు తన కుమారుడు పెరుగుతున్న దశలో అతనికి ఎక్కువ సంరక్షణ, మద్దతు, మార్గదర్శకత్వం అవసరం కాబట్టి తన కుమారుడితో గరిష్టమైన కాలం గడపడం తనకు కీలక చోదకశక్తి అవుతోందనీ ఆమె వివరించారు.

టైమ్‌సేవర్స్ కాకుంటే ఏం చేసేవారు?

“బాలల విద్యారంగంలో ఏదైనా చేయడం నాకు చాలా ఇష్టమైన విషయం” అన్నారు దేవ్. నిజమే మరి, ఆమె సాధించిన అభివృద్ధికి మూలాలన్నీ పటిష్ఠమైన విద్యావ్యవస్థమీదే ఆధారపడి ఉన్నాయి. అత్యుత్తమ విద్యను పొందేలా ప్రతిఒక్కరినీ ప్రోత్సహించడం చాలా ముఖ్యమన్నది ఆమె విశ్వాసం.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆమె ఇచ్చే సలహా ఏమిటంటే...

వ్యవస్థాపకత్వం అనేది ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకూ ఒకే రకమైన కష్టాలూ, సాఫల్యాలూ, విజయాలతో వస్తుందని దేవ్ నమ్ముతారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆధారపడడాన్ని సిగ్గు పడే విషయం అనుకుని దూరంగా ఉండిపోకూడదనీ, ఒంటరిగా ఉండడం కన్నా కలిసికట్టుగా ఉన్నట్టయితే మరిన్ని ఎక్కువ సమస్యలను వారు పరిష్కరించుకోగలరనీ ఆమె సూచిస్తున్నారు.