8 ఏళ్లకే పెళ్లయింది..! 20 ఏళ్లకు మెడిసిన్‌లో మెరిసింది!

0

ఎనిమిదేళ్లకే పెళ్లయిందంటే ఆ అమ్మాయి కుటుంబం ఆర్ధికంగా, సామాజికంగా ఎంత వెనుకబడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిత్య పేదరికంలో పెరిగి, ముక్కుపచ్చలారని వయసులోనే పెళ్లిచేసుకున్న ఆ అమ్మాయి -నీట్‌ లో డాక్టర్ సీట్ కొట్టిందంటే- ఊహకందని విషయం. అవరోధాలను, కట్టుబాట్లను దాటుకుని మెడలో స్టెతస్కోప్ వేసుకుని గర్వంగా నిలబడబోతున్న రూపా యాదవ్ యావత్ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది.

రూపా యాదవ్‌ కు ఊహ తెలిసేనాటికే మెడలో తాళిబొట్టు పడింది. అప్పుడు భర్త వయసు 12 సంవత్సరాలు. రాజస్థాన్ లోని కరేరికి చెందిన ఆమె కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. ఆర్ధికంగానూ అంతంత మాత్రమే. రూప మూడో క్లాసులో పెళ్లయింది. ఆయినా ఆమెకు చదువుపై మమకారం పోలేదు. అత్తింటివాళ్లతో చదువుకుంటాను చెప్పింది. వాళ్లు కాదనలేదు. ఇల్లాలిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే చదువుకుంది.

పదో క్లాసులో రూప 84 శాతం మార్కులు సంపాదించింది. అదే స్ఫూర్తితో ఇంటర్ కూడా పూర్తిచేసింది. 80 శాతానికి పైగా మార్కులొచ్చాయి. ఇక చదువు ఆపొద్దని నిశ్చయించుకుంది. ఆ సమయంలో రూప మామయ్య సరైన వైద్యం అందక గుండెపోటుతో చనిపోయాడు. ఆ క్షణాన ఆమె మనసులో డాక్టర్ కావాలన్న ఆలోచన వచ్చింది. ఆ విషయం అత్తమామలకు చెప్పింది. వాళ్లు కాదనలేదు. భర్తనుంచి పూర్తి సహకారం లభించింది.

కానీ ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో స్కాలర్ షిప్ ఇచ్చేందుకు అల్లెన్ అనే కోచింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇంటర్ తర్వాత బీఎస్సీలో చేరింది. కోచింగ్ కోసం కోటా పంపించారు. గత ఏడాది నీట్ రాస్తే రాలేదు. మళ్లీ పట్టువదలకుండా కష్టపడింది. ఈ ఏడాది రాస్తే 603 స్కోర్ తో 2612 ర్యాంక్ సంపాదించింది. సామాజికంగా, ఆర్ధికంగా ఎన్నో అవరోధాలను దాటుకుని మెడలో స్టెతస్కోప్ వేసుకుని గర్వంగా నిలబడబోతున్న రూపా యాదవ్ యావత్ మహిళా లోకానికే ఆదర్శం. 

Related Stories