దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న టీ హబ్

ఆలోచనలకు ఆవిష్కరణలు జతచేసే కలల సౌథం

దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న టీ హబ్

Saturday November 05, 2016,

3 min Read

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ వందకు వంద శాతం సక్సెస్ అయింది. ఒక్క ఏడాదిలోనే అద్భుత విజయాలు సాధించింది. ఎన్నో స్టార్టప్ కంపెనీలు ఇంక్యుబేషన్ సెంటర్ లో ఊపిరి పోసుకున్నాయి. మరెన్నో విదేశీ కంపెనీలు పెట్టబుడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. టీ-హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా యువర్ స్టోరీ స్మాల్ రివ్యూ..

టీ హబ్! ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే చర్చ. ఒక్క ఏడాదిలోనే టీ హబ్ అద్భుత విజయాలు సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఐటీ రంగాభివృద్ధి కోసం ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అదే టీ హబ్. అతి తక్కువ సమయంలో దేశవిదేశీ పారిశ్రామిక దిగ్గజాల మన్ననలు పొందడమే కాకుండా.. ప్రముఖుల సందర్శనతో టీ-హబ్ వార్తల్లోకెక్కింది. తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో టీ హబ్ ద్వారా యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తోంది. వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా తీర్చిదిద్దే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా టీ హబ్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం 150కి పైగా స్టార్టప్‌లు టీ హబ్ లో పనిచేస్తున్నాయి. 20 లక్షల నుంచి 4 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి.

image


2015 నవంబర్ 5న రతన్‌ టాటా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ చేతుల మీదుగా టీ-హబ్ ప్రారంభమైంది. గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 40 కోట్ల వ్యయంతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ ఏర్పాటైంది. 200 స్టార్టప్‌ లు, వెయ్యి మంది పనిచేసుకునే విధంగా టీ-హబ్‌ ను రూపొందించారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతిక వసతులు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్లతో పూర్తి ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్‌ నిర్మించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్, ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నల్సార్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో టీ-హబ్ పనిచేస్తోంది. యువ ఆంట్రప్రెన్యూర్లకు ఇది పర్ ఫెక్ట్ ప్లాట్ ఫామ్. వినూత్న ఆలోచనలతో వచ్చే వారికి టీ-హబ్ దారిదీపంలా పనిచేస్తుంది. వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చడంలో తోడ్పాటు అందిస్తుంది. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన మార్కెటింగ్‌ సదుపాయం, పెట్టుబడులను కూడా సమకూర్చి పెట్టే టీ హబ్ లాంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు.

మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో టీ-హబ్ ఒక్క ఏడాదిలోనే అద్భుతాలు చేసింది. స్టార్టప్‌ లను ప్రోత్సహిస్తూ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌గా అవతరించింది. టీ-హబ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగడంతో.. ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు టీ-హబ్‌ ను సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, ఇన్ఫోసిస్ సీఈవో విషాల్ సిక్కా, అరోబా నెట్‌ వర్క్స్ కో-ఫౌండర్ కీర్తి మెల్కొటే టీ-హబ్‌ ను చూసి అబ్బురపడ్డారు. ఇక్కడి వసతులు, సౌకర్యాల గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న తీరును అభినందించారు. టీ-హబ్‌ తో కలిసి పనిచేసేందుకు, టెక్నాలజీ సహకారం అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ మంత్రి మనో హర్ పారికర్‌ తో పాటు వివిధ రాష్ర్టాల ఐటీ మంత్రులు, దేశ విదేశీ ఐటీ సంస్థల ప్రతినిధులు కూడా టీ-హబ్‌ను సందర్శించి ప్రశంసలు కురిపించారు.

టీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, హాజరైన గవర్నర్, రతన్ టాటా

టీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, హాజరైన గవర్నర్, రతన్ టాటా


ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐటీ సెక్టార్ ను డెవలప్ చేస్తున్నారు. ఇందుకోసం దేశవిదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. బడా బడా విదేశీ కంపెనీలు హైదరాబాద్ లో స్టార్టప్ లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా టీ హబ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. స్టార్టప్ ల ఏర్పాటుకు సాయం చేయడానికి నాస్కామ్ సంస్థ టీ-హబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉబెర్ ఎక్స్ ఛేంజ్ సంస్థ కూడా టీ హబ్ తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇంకా చాలా సంస్థలు టీ-హబ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు..

image


టీ-హబ్ సక్సెస్ కావడంతో రెండో దశను కూడా ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం రాయదుర్గంలోని సర్వే నెంబరు 83లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్, 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, వసతులతో రెండో దశను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 400 మంది ఒకేసారి పనిచేసుకోవచ్చు. వంద కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేంత ప్లేస్ ఉంటుంది. అధునాతన సౌకర్యాలతో కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించనున్నారు. త్వరలోనే టీ హబ్ రెండో దశ అందుబాటులోకి రానుంది. అటు హైదరాబాద్‌ తో పాటు వరంగల్‌, నిజామాబాద్‌ లాంటి మిగతా సిటీస్‌ లలో కూడా టీ హబ్‌ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసిన సందర్భంగా

సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసిన సందర్భంగా


సాంకేతికరంగంలో ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో మరో కీలక కూడా పడింది. ఐటీ ఆవిష్కరణల కేరాఫ్ అడ్రస్ సిలికాన్ వ్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం ఔట్‌పోస్ట్‌ ను ఇటీవలే ఏర్పాటు చేసింది. ఉబర్, టై సిలికాన్ వ్యాలీతో కలిసి టీ బ్రిడ్జ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మొన్న అమెరికా పర్యటన సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. టీ బ్రిడ్జ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అనుసంధానమై తమ ఆలోచనలు పంచుకుంటారు.

టీ హబ్ దిగ్విజయంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 12న సైబర్ సిటీ కన్వెన్షన్స్ లో ఫస్ట్ యానివర్సరీని ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నెట్ వర్కింగ్, పిచ్ సెషన్స్ తో పాటు కొన్ని ఎంటర్ టైన్ మెంట్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.