ఒంటికి యోగా మంచిదేగా.. !!  

జూన్ 21న రెండో ఇంటర్నేషనల్ యోగా డే

0


కాలం మారింది. ఎంత ఉరుకులు పరుగుల జీవితమైనా మనిషి కూసింత ఆరోగ్యం మీదా దృష్టి పెడుతున్నాడు. ఈ మధ్య జనానికి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. పొద్దున ఏ జిమ్ చూసినా కిటకిటలాడుతోంది. పార్కుల్లో యోగా శిబిరాలు వెలిశాయి. కమ్యూనిటీ సెంటర్లు యోగా కేంద్రాలుగా అవతారమెత్తాయి. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల పెద్దాయన దాకా శరీరాన్ని విల్లులా వంచేస్తున్నారు. ఏం చేసినా ఆరోగ్యం కోసమే. అందునా చాలా మంది ఓటు యోగాకే వేస్తున్నారు!

యోగా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక రూపం. వ్యాయామ సాధనల సమాహారం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగానే పునాది. మునుల నుంచి సామాన్యుల దాకా అందరికీ యోగా అవసరమే. యోగాసనాలు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతాయి. శారీరకంగానూ ప్రయోజనాలు అనేకం. బౌద్ధ, జైన, సిక్కు వంటి ధార్మిక మతాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక సాధనల్లోనూ యోగా ప్రాధాన్యత కనిపిస్తుంది.

యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలింది. ఇండియాలో పురుడు పోసుకున్న యోగా.. ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. ఎక్కడ చూసినా యోగా గురించే చర్చ. పోయిన ఏడాదే తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాం. ఆ జ్ఞాపకాలు ఇంకా మనోఫలకం మీది నుంచి చెరిగి పోకముందే మళ్లీ యోగా సంబరం రానే వచ్చింది. జూన్ 21 నాడు ప్రపంచ వ్యాప్తంగా రెండో ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకోబోతున్నాం.

2014 సెప్టెంబర్ 27. యోగా దినోత్సవానికి బీజం పడిన రోజు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 69వ సదస్సు ఒక గాఢమైన ముద్రలోకి వెళ్లింది. యోగా ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ వివరిస్తుంటే.. సభ్యులంతా శ్రద్ధగా ఆలకించారు. యోగా ఒక్క ఇండియాకే పరిమితం కాదని.. ఈ భూమ్మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమేనని మోడీ తనదైన శైలిలో విడమరిచి చెప్పారు. ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐరాస వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 11న మోడీ ప్రతిపాదనకు ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ 193 సభ్య దేశాలకు 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. పండంటి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని జనరల్ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయని, మానవ జీవితాల్లో సామరస్యం ఇనుమడిస్తుందని అందులో వివరించింది.

2015 జూన్ 21న ఢిల్లీ రాజ్ పథ్‌ లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అదే రోజు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం మరో విశేషం. ఒకే వేదికపై 35,985 మంది యోగా చేసిన అతి పెద్ద ఈవెంట్ తోపాటు 84 దేశాల పౌరులు పాల్గొన్న ఏకైక యోగా కార్యక్రమంగా జంట రికార్డులు నమోదయ్యాయి. ఆ రోజు ఇండియాతోపాటు ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా డేని జరుపుకుంది. లక్షలాది మంది రోడ్ల మీద, పార్కుల్లో, మైదానాల్లో యోగాసనాలు వేశారు. యోగా సందేశాన్ని దశదిశలకు చాటారు. ఇప్పుడు అందరూ జూన్ 21వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.