ఆఫీస్ మాది...పని మీది ! కోవర్కింగ్ స్పేస్‌లో 'మెష్' జోరు

ఆఫీస్ మాది...పని మీది ! కోవర్కింగ్ స్పేస్‌లో 'మెష్' జోరు

Wednesday April 22, 2015,

4 min Read


“నాకు స్రింగోమెలియా అనే ఓ వ్యాధి ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం బయటపడింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. చేస్తున్న కాపీరైటర్ ఉద్యోగాన్ని వదిలేసి చికిత్స కోసం ముంబయి నుంచి పూణె వచ్చేశాను. మళ్లీ ఉద్యోగం చేయాలనుకోలేదు. అలా ఖాళీగా ఇంటిదగ్గరే గడిపేదాన్ని”... అని తన గురించి చెప్తారు 29 సంవత్సరాల దీప్తి కస్బేకర్. తర్వాత కొద్ది రోజులకే వంటల పుస్తకం రాసేందుకు సహాయం చేయమని ఓ ఆఫర్ వచ్చింది దీప్తికి. కానీ ఆ పని ప్రారంభించడానికి ఓ ఆఫీస్ స్పేస్ కావాలి. తను చర్చించడానికి కొందరు వ్యక్తులు కావాలి. “అవసరాన్నుంచే ఆవిష్కరణ జరుగుతుందని” చెప్పినట్లుగా... దీప్తి తన అవసరాల నుంచి ప్రాణం పోసినదే “ది మెష్.”.

వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచే పని చేయడం)... ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. కొన్ని ఐటీ కంపెనీలు ఈ తరహా పని విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కొందరికి దీన్ని ఉపయోగించుకోవడం అంటే చాలా మక్కువ. ఎందరో ఎంట్రప్రెన్యూర్లు, ఫ్రీలాన్స్ వర్కర్లు ఇలాగే పని చేస్తుంటారు. ఎప్పుడు చేశాం, ఎలా చేశాం అన్నది ముఖ్యం కాదు... కావలసిన సమయానికి కావలసిన పని అయ్యిందా లేదా ఇదే చూడాల్సిన అంశం అనేది వీరి భావన. కానీ ఈ పద్ధతిలో పని సక్రమంగా జరుగుతుందా ? ఉదాహరణకు, మీరు ఏదో ముఖ్యమైన పనిలో ఉంటారు. సడెన్ కాలింగ్ బెల్ మోగుతుంది. వచ్చిందెవరో చూద్దామనేలోగా కిచెన్ లోనుంచి కుక్కర్ విజిల్ వినిపిస్తుంది. ఈ హడావుడిలో మీ పని, ఆలోచనలు అన్నీ చెదిరిపోతాయి. మరోసారి, ఉదయాన్నే ఏం లేస్తాం అనుకుంటూ కొద్దిగా ఆలస్యంగా మంచం దిగిన మీకు ఇంకా బద్ధకం తీరదు. మరో కునుకు తీద్దువు రా... అని మంచం పిలుస్తున్నట్లు ఉంటుంది. ఆ పిలుపు చూస్తే సాధారణంగా ఎవరికైనా సరే అనాలనిపిస్తుంది. ఇక పని వాయిదా... వాయిదా... ఇవన్నీ ఓ రకమైన ఇబ్బందులు. మరో రకం... వర్క్ కి సంబంధించి ఏదైనా మాట్లాడదామంటే కొలీగ్స్ ఉండరు. అనుమానాల నివృత్తికి సీనియర్లు ఉండరు. ఒంటరిగా మన పని మనం చేసుకోవాలి.

మెష్ ఆఫీసులో ఒకొక్కరిదీ ఒక్కో వ్యాపకం

మెష్ ఆఫీసులో ఒకొక్కరిదీ ఒక్కో వ్యాపకం


కుక్కపిల్లే మా ఆఫీసుకు అందం

ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి, అనుభవించిన తర్వాత దీప్తికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే 1000 చదరపు అడుగుల ఓ ఫ్లాట్ ని కో-వర్కింగ్ స్పేస్‌గా మార్చేసింది. అదే “ది మెష్.”. అయితే దీనిలో మెంబర్లు చేరడానికి చాలా సమయం పడుతుందని దీప్తి భావించారు. ఆమె అంచనాలు తప్పని నిరూపణ కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. “ది మెష్.” గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కార్తీక్ శ్రీధర్, భరద్వాజ్ కృష్ణన్... వెంటనే ఇక్కడికి వచ్చి చూశారు. వీరిద్దరూ “ఎడ్ వేవ్” అనే కంపెనీలో పనిచేస్తున్నారు. వచ్చి చూసిన వెంటనే తమకోసం ఓ రెండు సీట్లు రిజర్వ్ చేయాల్సిందిగా దీప్తిని కోరారు. అలా వీరిద్దరూ “ది మెష్” లో తొలి మెంబర్లయ్యారు. “మా ఆఫీసు కన్నా మా రెండు నెలల వయసున్న కుక్కపిల్ల తోబా వారికి బాగా నచ్చింది. అందుకే వారు ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపారేమో”... అని అప్పుడప్పుడూ సరదాగా అంటుంటారు దీప్తి. “నిజంగానే తోబా చాలా అందంగా ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అందుకే మేం తోబాను మా “మెష్” కి చీఫ్ లవ్ ఆఫీసర్ అని పిలుస్తుంటాం”... అని నవ్వుతూ చెప్తారు దీప్తి. అలా మొదలైన “ది మెష్” ఆరు నెలల్లోనే 2000 చదరపు అడుగుల కార్యాలయంగా మారింది.

తన కుక్క తోబాతో దీప్తి కస్బేకర్

తన కుక్క తోబాతో దీప్తి కస్బేకర్


మిగిలిన కో-వర్కింగ్ స్పేస్ ల మాదిరిగానే “ది మెష్” కూడా పే/డెస్క్ మోడల్ తోనే ప్రారంభమైంది. మెంబర్లంతా డెస్క్ కి ఇంత అని ముందుగా నిర్ణయించిన ఫీజును ప్రతి నెలా చెల్లించేవారు. ఆ ఫీజులోనే వారికి డెస్క్, ఇంటర్నెట్, టీ, కాఫీ, స్నాక్స్, నెలకు 25 పేజీల ప్రింట్లు... ఇవన్నీ చూడటానికి ఓ అసిస్టెంట్‌ను దీప్తి ఏర్పాటు చేశారు. అన్ని సందర్భాల్లోనూ డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉండకూడదు. ఇది దీప్తి అభిప్రాయం. “ది మెష్” ద్వారా ఆదాయం వస్తున్నా... ఎంతో మంది ఎంట్రప్రెన్యూర్లను కలుసుకోగలిగే అవకాశం వచ్చినందుకు ఆమె ఎక్కువ సంతోషపడతారు.

రాత్‌కీ రాజాల కోసం మూన్ లైటర్స్

తరచూ ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయుక్తంగా ఉండాలనే లక్ష్యంతో “మెష్”లో “డే-పాస్” సౌకర్యం ప్రారంభించారు. దీని ద్వారా ఓ సీటు, ఇంటర్నెట్, 10 ప్రింట్లతో పాటు టీ, కాఫీ, రుచికరమైన భోజనం కూడా పొందవచ్చు. అలాగే రాత్రి వేళల్లో పని చేసేవారికోసం “మూన్ లైటర్స్” ప్యాకేజీ ప్రవేశపెట్టారు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఐటీ కంపెనీల్లో పనిచేసేవాళ్లు రాత్రి వేళల్లో వర్క్ చేయడానికి బాగా ఆసక్తిగా ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిందే “మూన్ లైటర్స్”. అలాగే ఇక్కడ సోషల్ ఎంట్రప్రెన్యూర్లకు, మహిళలకు ప్రత్యేక మెంబర్ షిప్ ప్లాన్లు ఉన్నాయి. “ఇక్కడికి వచ్చేవారి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే. అందుకే త్వరలో ఓ జిమ్, స్విమ్మింగ్ పూల్ ప్రారంభించబోతున్నాం. అలాగే ఓ లైబ్రరీ కూడా. చాలా తక్కువ ఫీజుకే మా మెంబర్లకు వీటిని అందుబాటులోకి తెస్తామని” అంటున్నారు దీప్తి కస్పేకర్.

ఈ కో-వర్కింగ్ స్పేస్ నిర్వహణ అంత సులభమేమీ కాదు. మెంబర్లందరి అంచనాలకు తగినట్లుగా దీన్ని ఉంచడం అంటే మాటలు కాదు. ఇది దీప్తికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇంటర్నెట్ ఎప్పుడైనా డిస్ కనెక్ట్ కావచ్చు. టీ, కాఫీ, స్నాక్స్ వంటివి మెంబర్లకు నచ్చకపోవచ్చు. కార్పొరేట్ ఆఫీస్ కల్చర్ కి అలవాటు పడినవాళ్లకి ఈ స్పేస్ చాలా సాధారణంగా అనిపించవచ్చు. ఇవన్నీ కూడా వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలు, అలవాట్లకు అనుగుణంగా ఉండాలి. వారందరినీ తృప్తి పరుస్తూ ఈ వర్క్ స్పేస్ నిర్వహించడం నిజంగా ఓ సవాలే. అయితే స్నేహంతో, అభిమానంతో ఏదైనా సాధ్యమే అంటారు దీప్తి.

మెష్ ఆఫీస్

మెష్ ఆఫీస్


“ది మెష్”కు వచ్చేవారిలో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్కిటెక్చర్, వ్యవసాయం, విద్య... ఇలా ఎన్నో రంగాలకు చెందినవారు ఉన్నారు. కేవలం వచ్చి తమ పని తాము చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడమే కో-వర్కింగ్ స్పేస్ లక్ష్యం. కానీ దీనివల్ల మరో బెనిఫిట్ ఏంటంటే... వివిధ రంగాల నిపుణులతో పరిచయాలు, సంబంధాలు ఏర్పడటం. మన ఆలోచనలను పంచుకోవడానికి, చర్చించడానికి సరైన వేదిక “ది మెష్”. “ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నా పాత ఫ్రెండ్స్ తో మాట్లాడి చాలా రోజులైంది. ఎందుకంటే... ఇక్కడకి వస్తున్న కొత్తవారితోనే నాకు సమయం సరిపోవడం లేదు” అంటారు దీప్తి.

భవిష్యత్ లక్ష్యాలు

ప్రస్తుతం “ది మెష్” ఐదుగురు సిబ్బందితో నడుస్తోంది. ప్రారంభంలో కావలసిన ఆర్థిక సాయాన్ని దీప్తి సోదరుడు అందించారు. అయితే 8 నెలల్లోనే దాన్ని తిరిగి ఇచ్చేయగలిగారంటే అర్థం చేసుకోవచ్చు... ఈ స్పేస్ ఎంతగా ఆదరణ పొందుతోందనే విషయాన్ని. “త్వరలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. సోషల్ ఈవెంట్స్ నిర్వహణకు మాకు ఇక్కడ అనువుగా ఉంటుంది. ఈ “మెష్” కాన్సెప్ట్ ని గ్రామాలకు కూడా విస్తరించాలనేది మా లక్ష్యం”... ఇవీ దీప్తి భవిష్యత్ ప్రణాళికలు.

“మెష్” కాన్సెప్ట్ లు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఈ స్సేస్ లో మెంబర్లు ఉల్లాసానికి ఉల్లాసం, కమ్యూనిటీ షేరింగ్, గ్రూప్ డిస్కషన్స్, వర్క్ టైమ్ సపోర్ట్ వంటి అంశాల వల్ల వారి పనితీరులో గణనీయమైన వృద్ధిని చూస్తున్నారని ఎన్నో సర్వేలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్... వై లేట్!!... ఏదో ఒక స్పేస్ లో చేరండి. ఆడుతూ పాడుతూ పనిచేయండి.