రైలు ప్రయాణీకుల కష్టాన్ని తీర్చే ఇక్సిగో పిఎన్ఆర్ ప్రిడిక్షన్‌

0

రైళ్లలో ఆన్‌లైన్‌ రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు ఆ రిజర్వేషన్ కన్ఫం అయ్యేవరకూ ఎంతో టెన్షన్ పడాల్సి వస్తుంది. దీని కోసం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పీఎన్‌ఆర్‌ స్టేటస్ చెక్ చేసుకోవడం, లేదా 139కి మెసేజ్‌లు పెట్టడం చేస్తూ ఉంటారు. ఒకవేళ టికెట్ బుకింగ్ టైమ్‌లో వెయిటింగ్ లిస్ట్ ఉంటే...టికెట్ బుక్ చేసుకోవాలో వద్దో తెలియక ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు ఒకటికి రెండు టికెట్లు బుక్ చేసుకుంటాం.

Image credit - Shutterstock
Image credit - Shutterstock

నెలకి 15 లక్షల మంది యాక్టివ్‌ యూజర్లను కలిగి ఉన్న ఇక్సిగో.. ఇప్పుడు మరో సేవతో జనాల ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ ప్రయాణికులైన కష్టమర్లకు మార్కెట్లో ఉన్న సమాచారం, ట్రావెల్‌ సెర్చ్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగాల్లో సేవలందిస్తున్న ఇక్సిగో ట్రైన్స్‌ అండ్‌ హోటల్స్.. ఇప్పుడు అదనంగా ఈ సేవలు అందిస్తోంది.

మీ రైలు వెయింటింగ్ లిస్ట్ కన్‌ఫం అవుతుందా లేదో ముందే ప్రెడిక్ట్ చేసి చెబ్తుంది. అంతే కాదు... మీ పీఎన్‌ఆర్ నెంబర్ బట్టి సీటు దొరుకుతందో లేదో కూడా ముందే చెప్పేస్తుంది. ఇక మీద రైలెక్కే చివరి నిముషం వరకూ పీఎన్‌ఆర్ స్టేటస్‌ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమూ లేదు. చివరి నిముషంలో కన్‌ఫం కాకపోతే కంగారు పడాల్సిన అగత్యమూ ఉండదు. దీంతో అంత వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్న టికెట్‌ను బుక్‌ చెయ్యాలా వద్దా అన్నది ప్రయాణికులు నిర్ణయించుకోవచ్చు. అంతే కాదు.. ఈ పీఎన్నార్ ప్రిడిక్షన్‌ సౌకర్యంతో ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్‌ కన్ఫం అయ్యే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయో కూడా ముందే తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యం లక్షలాది మంది ప్రయాణికులు రోజూ పడుతున్న మానసిక వేదనకు ఇది చరమగీతం పాడింది.

ఇక్సిగో ట్రైన్స్ అండ్‌ హోటల్‌ యాప్‌... పిఎన్ఆర్ ప్రిడిక్షన్‌లో ఉన్న ఏ ఇతర సేవల కన్నా... మిన్నగా కచ్చితమైన సమాచారం ఇవ్వగలుగుతోంది. దీని వెనుక రహస్యం ఏంటంటే... పిఎన్ఆర్ సర్వీసులకు సంబంధించి గత రెండేళ్లలో కోటికి పైగా పీఎన్నార్ నెంబర్ల సాంకేతిక సమాచారం ఇక్సిగో దగ్గర ఉంది. ఇటీవల ఇక్సిగోలో మైక్రోమ్యాక్స్‌ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది.

ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన రజనీష్‌ కుమార్ ఈ కొత్త సౌకర్యం గురించి మాట్లాడుతూ... ''ఇక్సిగో ఎప్పుడూ ప్రయాణికుల అవసరాలను మరింత సులువుగా తీర్చేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా రైలు ప్రయాణికుల అవసరాల్లో అత్యంత ఇబ్బందికరమైన అంశం వెయిటింగ్‌ లిస్ట్. మేం ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. ప్రస్తుతం మా మొబైల్‌ యాప్‌ ద్వారా రోజుకు 50వేలకు పైగా పీఎన్నార్ నెంబర్లు చెక్ చేసుకుంటుంటే, రెండు లక్షల మంది రైళ్ల సమాచారం గురించి తెలుసుకుంటున్నారు. నిజానికి ఈ ప్రయత్నం చాలా ఆసక్తికరమైన, అనూహ్యమైన డేటా ప్రాజెక్ట్‌. ఒక కొత్త ట్రైన్‌ గురించి కానీ, పీఎన్నార్ స్టేటస్‌ గురించి కానీ మా యాప్‌‌లో చెక్ చేసినప్పుడు మా మెషీన్ లెర్నింగ్‌ అల్గారిథమ్‌లు... ఎప్పటికప్పుడు కచ్చితత్వాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. మేం సమీప భవిష్యత్తులో మా సక్సెస్ రేట్‌ను 90 శాతం నుంచి 95 శాతానికి పెంచుకోగలమన్న నమ్మకంతో ఉన్నాం''.

వీటితో పాటు బడ్జెట్‌లో దొరికే హోటళ్ల సమాచారం, క్యాబ్ బుకింగ్‌, టూర్ ప్యాకేజీలు, స్టేషన్ అలారమ్స్, ఫ్లాట్‌ఫాం నెంబర్, రైల్ కోచ్ పొజిషన్ సమాచారం తెలియచేయడం వంటి సేవల్లోనూ ముందుంది.

గుర్‌గావ్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీ, అన్ని రకాలైన ప్రయాణ అవసరాలకు కావాల్సిన యాప్స్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఇక్సిగో యాప్‌ను 50 లక్షల కన్నా ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక్సిగోతో మాదిరిగానే.. కన్ఫంటికెట్‌ మరియు ట్రైన్ మ్యాన్‌ ప్రిడిక్ట్‌ వంటి వాళ్లు కూడా ట్రైన్‌ టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ను కన్ఫర్మేషన్ సమాచారాన్ని అందిస్తున్నారు. ఇటీవల ప్రవీణ్‌ అగర్వాల్ రూపొందించిన ఈ కన్ఫంటికెట్‌ కూడా ఇలాంటి సేవల్ని అందిస్తోంది. కానీ కన్ఫం టికెట్‌ కేవలం సదరు ట్రైన్‌ రిజర్వేషన్ల చరిత్రను విశ్లేషించి, టికెట్‌ కన్ఫం అయ్యే అవకాశం ఎంత వరకూ ఉందన్న సమాచారం మాత్రమే ఇస్తుంది.