కుగ్రామం నుంచి... కంపెనీ సీఈఓ స్థాయికి...

పురుషాధిక్యతను జయించిన నిధి అగర్వాల్.. ప్రింటింగ్ ఇండస్ట్రీ సీఈఓగా సక్సెస్... 

కుగ్రామం నుంచి... కంపెనీ సీఈఓ స్థాయికి...

Monday August 24, 2015,

4 min Read

"Where there's a will, there is a way." మనుసుంటే మార్గం ఉంటుందంటారు. మంచి కాలేజీలో చేరి చదువుకునే స్థోమత లేని ఓ అమ్మాయి ప్రింటింగ్ కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగిన కథ ఎంతో స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో నిధి అగర్వాల్ ప్రయాణం మొదలైంది. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ప్రింటింగ్ ఇండస్ట్రీలో సత్తాచాటుతూ తోటి మహిళలకు, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిధి అగర్వాల్ ఎవరు? ఆమె ప్రయాణం ఎలా మొదలైంది ?


"అది 2012వ సంవత్సరం. అమెరికాలో అతిపెద్ద ప్రింటింగ్ ఎగ్జిబిషన్ 'గ్రాఫ్ ఎక్స్ పో' జరుగుతోంది. అధికారికంగా మా కంపెనీ తొలి పార్టిసిపేషన్ అది. నేను మా స్టాల్ దగ్గర నిలబడ్డాను. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ కంపెనీ సీఈఓ ఎవరని అడిగాడు. నేనేనని ఎంతో ఉత్సాహంగా చెప్పాను. కొన్ని సెకన్ల పాటు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అప్పుడే ఓ విషయం నాకు అర్థమైంది. మహిళలకు అవకాశం లేని బిజినెస్‌లో నేను ఉన్నాననిపించింది" డిజైన్ ఎన్ బై - సీఈఓ నిధి అగర్వాల్ మాటలివి. అసలు ప్రింటింగ్ బిజినెస్ లో పురుషాధిక్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఫీల్డ్‌లో రాణిస్తున్నారు నిధి అగర్వాల్.

చదువే తరగని నిధి

మధ్యప్రదేశ్‌లోని మంద్ సౌర్ ఓ చిన్న పట్టణం. ఇక్కడే నిధి అగర్వాల్ జర్నీ మొదలైంది. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో నిధి చివరి అమ్మాయి. ఓ సోదరుడు కూడా ఉన్నాడు. ఆమె తండ్రి వ్యాపారి. ఆరుగురి పిల్లల్ని తమకు ఇష్టమైన కెరీర్‌లో రాణించేలా ప్రోత్సహించారాయన. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన నిధికి ఉండేది. పదో తరగతి వరకూ హిందీ మీడియం స్కూల్‌లో చదివారు. పదో తరగతి తర్వాత నిధి సోదరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత నిధి తన తండ్రి దగ్గరకు వెళ్లి పై చదువుల కోసం మంద్సౌర్ విడిచి వెళ్తానని, డబ్బులు కావాలని అడిగారు. కానీ ఏమాత్రం సాయం చేయలేని పరిస్థితి ఆ తండ్రిది. అప్పటికే పెళ్లి ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. అయినా నిధి వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ముందుకెళ్లారు.

image


దగ్గర్లోని ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి ఉన్నత చదువుల కోసం లోన్ కావాలని అడిగారు. చిన్నప్పటి నుంచి స్కూల్లో మంచి అకడమిక్ రికార్డ్ ఉండటంతో ఎడ్యుకేషన్ లోన్ సులువుగా వచ్చింది. మంద్సౌర్ విడిచి పైచదువుల కోసం ఇండోర్ వెళ్లారు. ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ దొరికింది. దీంతో తన చదువుల ప్రయాణం హిందీ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారింది. "ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడటం కష్టంగా ఉండేది. కానీ నేను మేనేజ్ చేయగలిగా. మొదటి ఏడాదిలోనే అన్ని సబ్జెక్టుల్లో టాపర్‌గా నిలిచా" అని ధైర్యంగా చెబుతారు నిధి. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చదువు పూర్తవడంతోనే ప్రొఫెషన్‌లోకి అడుగుపెట్టారు. ఓ సంస్థలో చేరి కోడింగ్, డిజైనింగ్ లాంటివి చేస్తూ ఎంతో నేర్చుకున్నారు. ఆ సంస్థలో టెక్నికల్ సమావేశాల్లో తరచూ పాల్గొనేవారు. 150 మంది ఉద్యోగులున్న కంపెనీ నడిచే తీరును చాలా దగ్గరగా గమనించారు. 2006లో మూడు నెలల అసైన్ మెంట్ కోసం అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది.

"నెంబర్ పోర్టబిలిటీ కోసం మా కంపెనీ ఆటోమెటిక్ టూల్ ప్రారంభించింది. ఆ ప్రాజెక్టును నాకు అప్పగించారు. నేర్చుకోవడానికి ఆ ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడింది. చిన్న పట్టణం నుంచి వచ్చిన నాలాంటి అమ్మాయికి ఈ ప్రాజెక్ట్ ఎంతో మేలు చేసింది. నా ఆలోచనలను మార్చేసింది."
image


జీవిత భాగస్వామిగా... వ్యాపారంలో తోడుగా...

అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత 2007 ప్రారంభంలో నిధి పెళ్లి చేసుకొని అహ్మదాబాద్ వెళ్లారు. అప్పటికే అక్కడ ఆమె భర్త అభిషేక్ తన ఇద్దరు స్నేహితులతో ఐటీ కంపెనీ రైట్ వే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నిధి ఆ కంపెనీకి చేదోడువాదోడుగా నిలిచారు. కొన్ని రోజుల్లోనే హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్, సేల్స్, మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. ఓ ఆంట్రప్రెన్యూర్ గా ఎదగడానికి కావాల్సిన 360 డిగ్రీల అవగాహన వచ్చేసింది. రెండు కుటుంబాల నుంచి ప్రోత్సాహం ఉండటంతో సొంత కంపెనీలో కీలకంగా మారారు. RWS లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ గా పనిచేసిన తర్వాత డిజైన్ ఎన్ బై కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. "డిమాండ్‌ను గుర్తించి ఇన్ హౌజ్ టెక్నికల్ టీమ్‌ని సిద్ధం చేశాం. వాళ్ల ద్వారా తొలి ప్రొడక్ట్ రెడీ అయింది. టీ-షర్ట్ ప్రింటర్స్‌కి తొలి ప్రొడక్ట్‌ని అందించాం. మాకు కస్టమర్ల నుంచి చాలా మంచి స్పందన, ప్రోత్సాహం లభించింది. తొలి ఏడాదిలోనే వందకు పైగా ఆర్డర్లొచ్చాయి. ప్రొడక్ట్‌కి డిజైన్ ఎన్ బై అని నామకరణం చేశాం. ఇక అప్పట్నుంచి వెనుతిరిగి చూడలేదు" అంటారు నిధి.

"వ్యాపారం అభివృద్ధి జరుగుతున్న సమయంలో తల్లి అయ్యాను. కొత్తగా పుట్టబోయే బిడ్డకి, ఎదుగుతున్న వ్యాపారానికి న్యాయం చేస్తానని అనుకోలేదు. ఇలాంటి సమయంలో ప్రియారిటీస్ సరిగ్గా ఎంచుకోవాలని కౌన్సిలర్ చెప్పారు. పనిచేసే ప్రతీ మహిళా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారని వివరించారు. నా పాత్రల్ని సమతుల్యంతో పోషించాల్సిన సమయం అది. ఇంటీరియర్ డిజైనర్‌తో గంటల తరబడి కూర్చొని పనిచేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆఫీస్ డెకరేషన్ మొత్తం నేనే చూసుకున్నాను. సరిగ్గా 1 జనవరి 2011లో నిధికి పండంటి కూతురు పుట్టింది. ఆ తర్వాత పదిహేను రోజులకు కొత్త ఆఫీసులోకి వెళ్లాం" అంటారు నిధి.

ఓవైపు అభివృద్ధి చెందుతున్న వ్యాపారం... మరోవైపు ఎదుగుతున్న కూతురు... తనకెదురైన సవాళ్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు నిధి. ఓ మహిళ శక్తి ఏంటో తనకు అప్పుడే తెలిసొచ్చిందంటారు. అందుకే తన బిజినెస్‌లో మహిళకు ప్రాధాన్యమిస్తున్నారు. కష్టాలను ఎదుర్కోవడంలో తనను తాను ఇందిరా గాంధీతో పోల్చుకుంటారు నిధి. ఆమెకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. పుస్తకాలు చదవని సమయంలో కూతురితో ఆడుకోవడం, తననుంచి నేర్చుకోవడం మరింత ఇష్టమంటారు నిధి. "నా కూతురి దగ్గర్నుంచి చాలా నేర్చుకోవచ్చు. మన చుట్టూ ఉన్నవాటిపై తనకు సరికొత్త దృష్టి కోణం ఉంటుంది."