క్రియేటివ్ టాలెంట్‌ను.. కంపెనీలనూ కలిపే వేదిక 'బనానాబాండీ'

సృజనశీలులకు, సంస్థలకు మధ్య వారధి..ప్రారంభించిన ఆరునెలలకే 50 శాతం వృద్ధి..క్రియేటివ్ మార్కెట్ విలువ ఒక బిలియన్ డాలరు పైనే..

0

ఏ రంగంలో రాణించాలన్నా సృజనాత్మకత....తప్పనిసరి. కొన్ని రంగాల్లో ఇది ప్రతిభ చూపించటానికి ఉపయోగపడితే...మరికొన్ని రంగాల్లో క్రియేటివిటీ లేనిది ఒక్క అడుగూ ముందుకు పడదు. ముఖ్యంగా పత్రికలు, టీవీ, సినిమాలు, మీడియా, యాడ్స్, ఇంటర్ నెట్, ఫొటోగ్రఫీ , యానిమేషన్ వంటివాటికి ఇదే మూలం. వ్యక్తికీ, సంస్థకూ కూడా ఆ విభిన్నత, ప్రత్యేకతే గుర్తింపు తీసుకువస్తుంది. అన్ని చోట్లా పెద్ద పీట వేసేలా చేస్తుంది. తెలివితేటలు లానే సృజనాత్మకత కూడా మనిషికి ఓ అదనపు అర్హత. చేసే పనిలో కొద్దిపాటి వైవిధ్యం చూపించగలిగితే సంచలనాలు నమోదు చేయవచ్చు. ఇలాంటివి ఎన్నో రంగాల్లో ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి.

సృజనాత్మకత ఓ అంశం కాదు....అదో పరిశ్రమ. వేల కోట్ల మార్కెట్ ఉన్న అతిపెద్ద పరిశ్రమ. భారతదేశంలో దీనికి లభిస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు, మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. అలాగే ప్రతిభ ఉన్న వ్యక్తులకూ కొదవలేదు. అయితే కావల్సినంత టాలెంట్ ఉన్న వ్యక్తులున్నప్పటికీ....పరిశ్రమ తనకు అవసరమైన ప్రతిభను వెతికిపట్టుకోవటంలో తరచుగా ఇబ్బందులకు గురవుతోంది. దీనికి కారణం ఒక వేదిక లేకపోవటమే. ప్రతిభ ఉన్న వ్యక్తుల గురించి పరిశ్రమకు తెలియాలన్నా....తమకు కావల్సిన ఉద్యోగాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయన్న విషయం క్రియేటివ్ పీపుల్ కు తెలియాలన్నా కన్సల్టెన్సీలనే నమ్ముకోవాల్సిన స్థితి. ఈ విషయాన్ని గుర్తించింది బనానా బాండీ. సృజనశీలురకు, సంస్థలకు ఒకరి గురించి మరొకరికి తెలియజేసే వారధి అయింది.

బనానాబాండీని ప్రారంభించింది దిగ్గజ పారిశ్రామికవేత్తలు కాదు. 21 ఏళ్ల శశాంక్ జొగానీ, 19 ఏళ్ల కావన్ అంటానీ. ఫిబ్రవరి 2015లో ఈ వెబ్ సైట్ ప్రారంభమైంది. భారతీయ సృజనాత్మక రంగానికి కావల్సిన అన్ని అవసరాలనూ ఈ వెబ్ సైట్ తీరుస్తుంది. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించటంతోపాటు విద్యార్థులు, నిపుణులు, సంస్థలు, డిజైన్ ఆధారిత కంపెనీల కోసం ఏర్పాటయిన సమగ్ర సృజనాత్మక వేదిక బనానాబాండీ.

భారతీయ క్రియేటివ్ రంగానికి ఈ వెబ్ సైట్ సేవలందిస్తోంది. అలాంటి వైవిధ్యం ఉన్న వ్యక్తులు ఈ వెబ్ సైట్ లో లాగిన్ అయి తమ పోర్ట్‌ఫోలియోను అప్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా నిపుణులతో పరిచయం పెంచుకోవటంతో పాటు...వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కోవచ్చు. సామర్థ్యం గల ఉద్యోగులు తమ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ పరిధిలో ప్రతిభను పెంపొందించుకోటానికి కూడా బనానాబాండీ పోర్టల్ సాయపడుతోంది. సరైన ప్రతిభను, సరైన కంపెనీకి అనుసంధానించటంపై వెబ్ సైట్ ప్రధానంగా దృష్టిపెడుతోంది.

యూజర్లు తమ పనితనాన్ని, ప్రతిభను ప్రదర్శించటానికి, తమ ప్రాజెక్టుల వివరాలు అందరితో పంచుకోవచ్చు. అదే సమయంలో యూజర్ల పోర్ట్ ఫోలియోలు ఆధారంగా కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా వ్యక్తులను నియమించుకోటానికీ వేదికలా ఉపయోగపడ్తుంది.

బ‌నానాబాండీ టీమ్‌
బ‌నానాబాండీ టీమ్‌

డిజైన్ ఆధారిత కంపెనీలు భారత్‌లో ప్రతిభను గుర్తించటానికి డేటాబేసెస్, సూచనల మీద మాత్రమే ఆధారపడుతున్నాయి. ఎంఎన్సీల నుంచి చిన్న స్టూడియోలదాకా ప్రతిచోటా ఇదే పరిస్థితి. బనానాబాండీ వెబ్ సైట్ లో అనేకమంది ప్రతిభావంతుల సమాచారం ఉంది. కంపెనీలు తమ నెట్ వర్క్ ద్వారా తెలసుకునేదాని కన్నా ఇది చాలా ఎక్కువ. కంపెనీలకు ఎలాంటి వాళ్లు కావాలో సరిగ్గా అలాంటి వారినే బనానాబాండీ అనుసంధానిస్తుంది. భారతీయ సృజనాత్మక ప్రతిభకు అనేక అవకాశాలు కల్పించేందుకు కూడా కృషిచేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే తాము భారతీయ సృజనాత్మక నిపుణులను ఒకరితో ఒకరిని కలుపుతున్నామని, తమ వద్ద రెజ్యూమ్‌లకు బదులు పోర్ట్ ఫోలియోలు ఉంటాయని కావన్ వివరించారు.

కంపెనీ పెరుగుదల

బనానాబాండీ వినియోగదారుల సంఖ్య 3, 600 పైనే. 1500కు పైగా ప్రాజెక్టులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఇదంతా కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరిగింది. ఉద్యోగాల విభాగం ప్రారంభించిన నెలలోపే దాదాపు వంద కంపెనీలు 130 ఉద్యోగ అవకాశాలను వెబ్ సైట్ లో పోస్ట్ చేశాయి.

ఓ కంపెనీగా బనానాబాండీ ఇంకా ఏడాది వ్యవధిని కూడా పూర్తిచేసుకోలేదు. ఆరు నెలల కాలంలోనే కంపెనీ నెల నెలా పెరుగుతూ 50 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీని ప్రారంభించింది ఇద్దరు వ్యక్తులే అయినా ఇప్పుడు ఐదుగురు సభ్యుల బృందం అయింది. తాత్కాలిక లక్ష్యాలను కంపెనీ సాధిస్తుందనే నమ్మకం తమకుందని కావన్ ఆశాభావం వ్యక్తంచేశారు.

చిన్న చిన్న సమస్యలను అధిగమించి....

యూజర్లతో నిత్యం సంప్రదింపులు జరపటం, తరచుగా సమావేశాలు నిర్వహించటం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించగలిగింది బనానాబాండీ. సృజనాత్మకతకు సరైన వేదిక కల్పించటంతో పాటు...ఉద్యోగాల విభాగం ప్రారంభించిన నెలలోపే వందకు పైగా కంపెనీలను ఆకర్షించగలిగింది...ఇలాంటి పంథా అనుసరించటం వల్లేనని కావన్ చెప్పారు.

అయితే వెంచర్ విస్తృతమయ్యే కొద్దీ...వ్యవస్థీకృత కంపెనీలతో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బనానాబాండీ భావిస్తోంది. ఉద్యోగులను ఎంపికచేసుకోవటం లేదా ఫ్రీలాన్సర్ల సేవలను వినియోగించుకోవటం వంటి విషయాల్లో కంపెనీలు సుదీర్ఘంగా సాగే విధానాలను అవలంబిస్తుంటాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం బనానాబాండీ కొన్ని ఏకీకృత ప్రతిపాదనలను రూపొందించేపనిలో ఉంది.

ఆరు నెలల్లోపే ఫండింగ్

నిరంతరం వృద్ధి సాధించే కంపెనీలా బనానాబాండీ మొదలయింది. వెబ్ సైట్ ప్రారంభించిన నెలలోపే కంపెనీలో మోర్గాన్ స్టాన్లీ ప్రయివేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ అలూరి, మారికో మాజీ ఎం&ఎ హెడ్ చైతన్య దేశ్ పాండే దాదాపు 2.5 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులను మార్కెటింగ్, నూతన ఆవిష్కరణలు, ప్రొడక్ట్ వృద్ధి, కంపెనీలో అత్యాధునిక పరికరాలు అమర్చటం వంటి వాటిపై ఖర్చుపెడుతున్నారు.

విస్తృత మార్కెట్

సృజనాత్మక రంగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బిలియన్ డాలరుకు పైగా ఆదాయం లభిస్తోంది. భారతీయ డిజైన్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదికల ప్రకారం క్రియేటివ్ రంగానికి అపారమైన మార్కెట్ ఉంది.

బనానాబాండీకి పోటీ లేనప్పటికీ... బెహాన్స్, టచ్ టాలెంట్ లాంటి పోర్ట్ ఫోలియో సైట్లు, పోస్టర్ గల్లీ, కపిక్ వంటి మార్కెట్ ప్లేస్ లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మార్కెట్ ను పోటీదాయకంగా మారుస్తున్నాయి.