ఇలాంటి బ్యాంకు ఊరికొకటి ఉంటే..ఆకలిచావులే ఉండవు!

0

అన్నార్తులు అనాధలుండని నవయుగం ఇంకెంత దూరం? మన మహాకవి దాశరథి రాసిన గేయం! సుమారు 65 ఏళ్ల క్రితం రాసిన పాట! అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు! పేగుల్లో ఆకలి అగ్నిధారలా కురుస్తునే ఉంది! మనతల్లి అన్నపూర్ణ! మన అన్న దానకర్ణ! అయినా ఆకలి భాషను అర్ధం చేసుకునేది ఎంతమంది?

ఒక మనిషి ఆకలితో చనిపోయాడంటే- అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. వాస్తవానికి సాటి మనిషిగా దాన్ని మనం అంగీకరించొద్దు. కానీ ఎంతమంది ఎదుటివాడి ఆకలి గురించి ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించారూ అంటే- కచ్చితంగా వాళ్లు దైవంతో సమానం. అలాంటి దైవ సంకల్పమే ఆహార ధాన్యాల బ్యాంక్ ఆలోచన.

అసలేంటీ బ్యాంక్..?

ఇంటికి పిలిచి అన్నం పెడతాం. ఒకరికి పెడతాం. ఇద్దరికి పెడతాం. ఒకరోజు. రెండ్రోజులు. ఆ తర్వాత? ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అలా కావొద్దనే ఉద్దేశంతో పెట్టిందే గ్రెయిన్స్ బ్యాంక్. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ఆహార ధాన్యాల బ్యాంక్. అదికూడా కొందరు అమ్మాయిలకు వచ్చిన ఆలోచన. దైవం నడయాడిన నేల, ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో ఊపిరిపోసుకున్న ఈ బ్యాంక్ ఎందరో నిరుపేదల ప్రాణాల్ని నిలబెడుతోంది.

ఈ బ్యాంకుకు సేవాగుణమే పెట్టుబడి. సంతృప్తే వచ్చే వడ్డీ. దానం చేయడమంటే రుణం తీర్చుకోవడమే. వారణాసిలోని విశాల్ భారత్ సంస్థాన్ అనే ఎన్టీవో ఈ ఆలోచనకి రూపకల్పన చేసింది. పేట్ భరో క్యాంపెయిన్ పేరుతో నవరాత్రి ఫెస్టివల్ సందర్భంగా ప్రారంభించారు. మొదటి రోజే అపూర్వ స్పందన వచ్చింది. తొలి రోజునే 688 కిలోల ఆహార ధాన్యాలు డిపాజిట్ కింద వచ్చాయి. ఆహార ధాన్యాల సేకరణ కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. ఆ వీధి ఈ వీధి అని తేడా ఉండదు.

ఎవరైనా ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా 5 కిలోల ఆహార ధాన్యాలు (ఏవైనా సరే) డిపాజిట్ చేయాలి. దీనికి వడ్డీ ఏమీ ఇవ్వరు. ఒకరికి సాయం చేశామన్న సంతృప్తి మిగులుతుంది. ఈ బ్యాంక్ గురించి తెలుసుకుని కొందరు స్వచ్ఛందంగా వచ్చి తిండిగింజలు డిపాజిట్‌ కింద ఇచ్చి వెళ్తున్నారు. కొన్ని సంస్థలు కూడా తోడవుతున్నాయి.

నిరుపేదలు, ఏ ఆసరా లేనవాళ్లు ఇందులో ఖాతాదారులు. వారినికో నెలకో అవసరమైన సరుకుల్ని బ్యాంకు ద్వారా తీసుకుంటారు. వాళ్ల పేరుమీద ఖాతా పుస్తకం. నెలనెలా ఏమేం సరుకులు తీసుకెళ్లారు. ఎంత తీసుకెళ్లారు. సరిపోతున్నాయా? క్వాంటిటీ పెంచాలా ఇలా అనేక విషయాలు అందులో నమోదు చేస్తారు. అన్నట్టు విశాల్ భారత్ సంస్థాన్ ఒక 58 మంది అన్నార్తుల్ని ఎంపిక చేసి వారికి ఏడాదికి సరిపడా ఆహార ధాన్యాలు ఇస్తోంది. వారిలో భర్తలు వదిలేసిన వాళ్లు, విడోలు, నిలువనీడ లేనివాళ్లు, కటిక పేదరికంతో బతుకీడ్చేవాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ నెలనెలా ఐదు కిలోల బియ్యం, కిలో గోధుమపిండి, కేజీ ఉప్పు తదితర సామాన్లు ఇస్తారు.

మతం కంటే మానవత్వం గొప్పదని టెంపుల్ టౌన్ వారణాసిలో ఏర్పాటయిన గ్రెయిన్స్ బ్యాంక్ నిరూపించింది. హిందువులు ముస్లింలు అన్న తేడా లేదు. ఆకలి ఎవరికైనా ఆకలే. కులమతాలకతీతంగా క్షుద్బాధను తీర్చడమే బ్యాంక్ ఆశయం. ఎన్జీవో చేస్తున్న మంచి పనికి కొన్ని వందల కుటుంబాలు ముందుకు వచ్చి ఆహారధాన్యాలు డిపాజిట్ చేసి పోతున్నాయి. ప్రజలు ఇలాగే సహకరిస్తే ఇంకా ఎంతోమంది రెండుపూటలా కడుపునిండా తింటారని ఫౌండర్ శ్రీవాస్తవ అంటున్నారు.

Related Stories

Stories by HIMA JWALA