లండన్ లో ఎమ్మెస్ చేసి.. ఉద్యోగం వదిలేసి ఆన్ లైన్ లో చేపలు అమ్ముతున్నాడు..

1

ఎవరైనా ఊహిస్తారా.. లండన్ లో ఎమ్మెస్ చేసిన కుర్రాడు మళ్లీ ఇంటికి తిరిగొచ్చి చేపలు అమ్ముతాడని. ఎంత చదివినా, ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోవద్దంటారు. అంతమాత్రం చేత తిరిగి అదే పని చేయాలని ఎవరూ చెప్పరు. కానీ ఆ యువకుడు ఎక్కడైతే జీవితాన్ని మొదలుపెట్టాడో మళ్లీ అక్కడికే వచ్చి.. తాను చేసింది ఎంతమాత్రమూ తప్పుకాదని నిరూపించాడు.

ఆరోక్య మాంద్రో. తమిళనాడు రామేశ్వరం దగ్గర తంగచ్చిమడంలో జాలరి కుటుంబంలో పుట్టాడు. వాళ్ల కమ్యూనిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మొదటి కుర్రాడు. లండన్ లో ఎమ్మెస్ చేశాడు. స్కూలింగ్ అంతా రామేశ్వరం చుట్టుపక్కల పూర్తయింది. తండ్రి యాక్సిడెంటులో చనిపోతే కుటుంబం బాధ్యత ఆరోక్య అన్నయ్యపై పడింది. సోదరుడు చేపలు పడుతూ ఇంటి బరువు మీదేసుకున్నాడు. తనలా కాకుండా తమ్ముడిని కష్టపడి చదివించాడు.

పై చదువు కోసం ఆరోక్య చెన్నయ్ వచ్చాడు. బీఎస్సీ కంప్యూటర్స్ లయోలా కాలేజీలో చేశాడు. డిగ్రీ వరకైతే వచ్చాడు కానీ ఇంగ్లీష్ విషయంలో వెనుకబడి పోయాడు. ఎందుకంటే తను పెరిగిన నేపథ్యం, చదివిన స్కూల్ వేరు. చాలా నామూషీగా అనిపించింది. ఆ వెనుకబాటుతనమే తనలో కసిని పెంచింది. ఇంగ్లీష్ మీద దండయాత్ర చేశాడు. అనకున్నట్టే మంచి స్కోర్ వచ్చింది. వేణ్నీళ్లకు తోడు చన్నీళ్లు అన్నట్టు స్కాలర్షిప్ ఆదుకుంది. కానీ అది ఫీజులకు అనుకున్నంతగా సరిపోలేదు. ఏం చేయాలో తోచలేదు. మళ్లీ చేపలనే నమ్ముకున్నాడు. వారాంతంలో సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల చేపలు అమ్మాడు. వచ్చిన డబ్బుతో ఫీజులు గట్రా పే చేశాడు.

లండన్ లో పీజీ సీటొచ్చింది. ఏడాది పాటు చేశాడు. ఆ తర్వాత చెన్నయ్ వచ్చాడు. సీసీ టీవీ, ఫైర్ అలారం సరఫరా చేసే బీ సెక్యూర్ అనే సంస్థలో చేరాడు. లైఫ్ బాగానే ఉంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. మళ్లీ సముద్రం పిలుస్తోంది. చేపల వలలో మనసు చిక్కుకుంది. ఏ చేపలైతే తనని ఇంతవాడిని చేశాయో, అదే చేపలతో వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేశాయి.

చేపలు అమ్మడం అంటే సాంప్రదాయబద్దంగా కాదు. అదొక యూనిక్ సెల్లింగ్ కాన్సెప్టులా వుండాలి. అందుకోసం ఏం చేయాలి. బుర్రలో మెరుపలాంటి ఐడియా. ఆన్ లైన్ లో చేపల అమ్మకం. కాన్సెప్టు కొత్తగా అనిపించింది. ప్రపంచమంతా ఈ కామర్స్ రంగంవైపు దూసుకుపోతున్న తరుణంలో ఇదేదో బాగుంది అనిపించింది.

సాధారణంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలు చేపల్ని అంతగా కొనడానికి ఇష్టపడరు. కారణం వాటిని కడగాలి.. కోయాలి.. వేస్టేజీ.. వాసన.. అందంతా పెద్ద ప్రాసెస్. అందుకే హోటల్లో తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్యానికి అదంత మంచిది కాకపోవచ్చు. ఇదే పాయింట్ మీద మీన్ కడాయ్ (చేపల దుకాణం) అనే స్టార్టప్ మొదలు పెట్టాడు. అనుకున్న చేపను అనుకున్న సైజులో కట్ చేసి ఫ్రెష్ గా ప్యాక్ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం.

ఒకరోజు ముందుగానే ఆర్డర్ చేస్తే తెల్లారి ఇంటిముందు చేపల సంచీ ఉంటుంది. 24 గంటలే కాబట్టి పెద్దగా స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. వాసన కూడా రాదు. బిజినెస్ బ్రహ్మండంగా నడుస్తోంది. రోజులో కాకుండా ఒక గంటలో చెన్నయ్ వ్యాప్తంగా చేపల డెలివరీ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాడు. అప్పుడే తాను పెళ్లిచేసుకుంటానని చెప్తున్నాడు. వచ్చే ఏడాదికల్లా హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిలో మీన్ కడాయ్ స్థాపించాలని, దాంతోపాటు మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు.

Related Stories