మీ ఈవెంట్లకు స్పాన్సర్స్ వెతికిపెట్టే స్టార్టప్ ‘జెంటి’

మీ ఈవెంట్లకు స్పాన్సర్స్ వెతికిపెట్టే స్టార్టప్ ‘జెంటి’

Thursday October 22, 2015,

3 min Read

డబ్బులు పెట్టి ఈవెంట్లు చేయడం వల్ల ఏం లాభం అనుకుంటున్నారా ? అసలు ఈవెంట్లు ఎందుకు చేస్తారు ? జోష్ కోసం, పార్టీ కోసం చేసే ఈవెంట్లు కొన్ని మాత్రమే. మిగిలినవన్నీ బ్రాండింగ్ కోసం చేస్తారన్న విషయం మీకు తెలుసా? ఈవెంట్‌కి వచ్చే వారికి తమ బ్రాండ్‌ని చూపించడానికి కార్పొరేట్ కంపెనీలు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావంటే నమ్ముతారా ? అడ్వర్టైజింగ్ కంటే తక్కువ ఖర్చు చేసి, దానికి రెట్టించిన ఉపయోగం పొందే మార్గం ఇదొక్కటే. ఇదే మార్గంలో వ్యాపార ఐడియాని డెవలప్ చేసింది జెంటీ అనే ఓ హైదరాబాద్ స్టార్టప్.

“కమ్యూనిటీ ఈవెంట్లకు మద్దతివ్వడం మా ప్రధాన లక్ష్యం. వారికి స్పాన్సర్స్ వెతికి పెట్టడమే మా స్టార్టప్ పని” అంటారు ఫౌండర్ పిఎస్వీ మనోజ్ సూర్య.

image


Image credit - shutterstock

ఈవెంట్లకు స్పాన్సర్లెందుకు ?

సాధారణంగా ఈవెంట్లు జరిగేటప్పుడు స్టేజ్ బ్యాక్ గ్రౌండ్లో చాలా కంపెనీల లోగోలు, ఫ్లెక్సీలపై కూడా సదరు సంస్థల లోగోలు కనిపిస్తుంటాయి. ఆ కంపెనీలన్నీ ఆ ఈవెంట్‌కు స్పాన్సర్ చేశాయని ఎవరికైనా అర్థమవుతుంది. ఒక పేపర్ యాడ్‌కి అయ్యే ఖర్చులో సగం ఖర్చు చేస్తే ఈవెంట్‌లో లోగో డిస్ ప్లే అవుతుంది. టీవీ యాడ్‌లో నాలుగో వంతు డబ్బులు ఖర్చు పెడితే ఈవెంట్లో బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది. లైవ్‌లో ఆడియన్స్‌కు లోగో డైరెక్టుగా కనిపిస్తుంది. అందుకోసం కార్పోరేట్ కంపెనీలు ఈవెంట్లకు స్పాన్సర్ చేస్తాయి. అయితే ఇక్కడొక లాజిక్కుంది. వాళ్ల దగ్గర డబ్బులున్నప్పుడు వాళ్లే ఈవెంట్లు చేసుకోవచ్చుకదా. అంటే పొరపడినట్లే. అవి కూడా ఉంటాయి కానీ అదే ఈవెంట్‌తో రీచ్ కావడం కష్టం. ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజేషన్ ఓ ప్రొఫెషనల్ థింగ్. ఎక్కడైనా ఈవెంట్ జరిగినప్పుడు దానిలో పాల్గొనడానికి జనం వస్తారు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో కలసి పనిచేస్తే, వారి కార్యక్రమ ఖర్చులో కొంత మొత్తం షేర్ చేసుకుంటే అప్పుడు బ్రాండ్ వేల్యూ పెరుగుతుంది. అందుకే ఈవెంట్లకు స్పాన్సర్ల అవసరం కంటే బ్రాండ్‌లకే ఈవెంట్లు అవసరం ఎక్కువ.

జెంటి చేసే పనేంటి ?

ఈవెంట్ల కోసం ఎదురు చూసే బ్రాండ్లకు కార్యక్రమాలను వెతికిపెట్టే బాధ్యత చేపడుతుంది జెంటి. కమ్యూనిటీ ఈవెంట్లకు సాధారణంగా సరైన ఆర్థిక సహకారం ఉండదు. వాటికి స్పాన్సర్ రూపంలో బ్రాండ్‌ను వెతికిపెడతారు. ఇరు పక్షాలకు సాయం చేసే ఓ అద్భుతమైన ఫ్లాట్ ఫాం ఇది. ముందుగా బ్రాండ్లను లిస్ట్ అవుట్ చేసుకొని ఈవెంట్ల కోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా ఇద్దరినీ కలపడం వీళ్ల పని. అలా చేయడంలో వచ్చే దానిలో పర్సంటేజి లెక్కన జెంటీ కి రెవెన్యూ వస్తుంది. జెంటి స్టార్టప్ రెవెన్యూ మోడ్ ఇదే.

బ్రాండ్లకు న్యాయం చేయగలరా?

చాలా ఈవెంట్లలో బ్రాండ్లు సంతృప్తి చెందవు. ఎందుకంటే అనుకున్నంత మంది క్రౌడ్ ఆ ఈవెంట్లకు అటెండ్ కాకపోవడంతో కార్పోరేట్ కంపెనీలు ఏ ఈవెంట్లో ఇన్వస్ట్ చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతుంటాయి. ఈ సమస్యకు జెంటి పరిష్కార మార్గం చూపుతోంది. ఈవెంట్‌కు సంబంధించిన విషయాన్ని ముందుగా పోస్టు చేసి దానికి స్పాన్సర్ ఎవరొస్తారో పిలుస్తారు. స్పాన్సర్‌కి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఆ పోస్టుతో పాటు సైట్లో పెడతారు. ఈవెంట్‌కు ఎవరెవరు వస్తారనే దాన్ని లిస్టవుట్ చేస్తారు. ఈవెంట్ ఆర్గనైజర్ పేరు మీద వారందరి మద్దతు కోరుతూ మెయిల్స్ వెళ్తాయి. ఆ మెయిల్స్‌కి మద్దతిస్తున్నట్లు రిప్లై ఇస్తే చాలు. దీనికి టైం బౌండ్ ఉంటుంది. సరైన టైంలో అనుకున్నంత మంది మద్దతిస్తే స్పాన్సర్షిప్ కన్ఫర్మ్ అవుతుంది. అంత మంది ఆ బ్రాండ్‌ను చూడటం వల్ల, తర్వాత ఈవెంట్లో కూడా కనపడటం వల్ల కావల్సినంత మైలేజ్ వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు జరగాల్సిన న్యాయం జరుగుతుందంటారు మనోజ్ సూర్య.

జెంటి ఎన్ని ఈవెంట్లు చేసింది? వెబ్ సైట్ ఎలా పనిచేస్తోంది?

జెంటి ప్రారంభమై 6 నెలలు పైనే అయింది. వెబ్ సైట్ ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటి వరకూ రెండు ఈవెంట్లు చేశారు. ఏడు కంపెనీలకు 20 కమ్యూనిటీలకు లింక్ అప్ చేశారు. వచ్చే నెల నుంచి వరసగా ఈవెంట్లు జరగనున్నాయి. 25 కంపెనీలు ఇప్పటి వరకూ జెంటీలో టై అప్ అయ్యాయి. వాటికి ఇప్పుడు ఈవెంట్లను వెతకాలి. వెబ్ సైట్‌కి 5వేలమందికి పైగా యూజర్లున్నారు. కంపెనీలకు సంబంధించిన వీడియో , ఇతర ప్రమోషనల్ స్టఫ్ అందుబాటులో ఉంటుంది. యూజర్లు లాగిన్ అయిన తర్వాత వారి రిక్వైర్‌మెంట్ బట్టి సమాచారం అందిస్తారు. కన్ఫర్మ్ అయిన ఈవెంట్ల సంఖ్య 20 దాటింది. వచ్చే ఆరు నెలల్లో 100 ఈవెంట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

image


జెంటీ టీంలో ఎవరెవరు?

పిఎస్వీ మనోజ్ సూర్య జెంటీ ఫౌండర్. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మనోజ్ గతంలో కూడా ఓ స్టార్టప్ కోసం పనిచేశారు. కమ్యూనిటీ ఈవెంట్లకు స్పాన్సర్స్ వెతికే కొత్త ఐడియాతో దీన్ని ప్రారంభించారు. మనోజ్‌తోపాటు మరో ఇద్దరు ఈ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ టీంలో మరో పది మంది పనిచేస్తున్నారు.

ఈ తరహా వ్యాపారంలో ఎవరెవరున్నారు?

బ్రాండ్ బిల్డింగ్ , బ్రాండింగ్ లాంటి ఈ తరహా వ్యాపారానికి భారత దేశంలో 4వేలకోట్ల బిజినెస్ మార్కెట్ ఉంది. అంటే ఎడ్వర్టైజింగ్ పక్కన పెడితే ఈవెంట్స్ లాంటి వాటిపైనే వేలకోట్ల బిజినెస్ అవకాశాలున్నాయన్న మాట. ఇన్ని అవకాశాలున్నప్పుడు చాలా మంది ఈ స్పేస్‌లో ఉండటం సర్వ సాధారణ విషయమే. మన హైదరాబాద్ నుంచే పదుల సంఖ్యలో ఈ తరహా వ్యాపారం చేస్తున్నాయి. యాడ్ ఏజెన్సీలకు సెకెండ్ ఆఫ్షనల్ రెవెన్యూ మోడల్ ఈ బిజినెస్సే.

లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలేంటి ?

ఈ ఏడాది చివరికల్లా 100 ఈవెంట్లను పూర్తి చేయడం వీళ్ల ముందున్న లక్ష్యం. వందల బ్రాండ్లను క్లెయింట్స్‌గా తీసుకురావడం తర్వాతి లక్ష్యం. వచ్చే 6 నెలల్లో యాప్ ఫ్లాట్‌ఫాంలోకి ప్రవేశించబోతున్నారు. ఫండింగ్ వస్తే వ్యాపారాన్ని ముంబై పూణేలకు విస్తరిస్తారు. అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని సూర్య ముగించారు.

website