భారత గ్రామీణ స్థితిగతులు తెలుసుకునేందుకు 20 వేల కిమీ నడుస్తున్న ఓ ప్రవాస భారతీయుడు

ఒక్కో అడుగు వేస్తూ దేశమంతా నడక20వేల కిలోమీటర్లు నడువనున్న మాక్స్ చంద్రప్రతీ రాష్ట్రంలోనూ సేవా కార్యక్రమాలుదేశానికి సేవ చేయడం కోసం నడుస్తున్న ఇండో-జర్మన్

భారత గ్రామీణ స్థితిగతులు తెలుసుకునేందుకు 20 వేల కిమీ నడుస్తున్న ఓ ప్రవాస భారతీయుడు

Friday July 31, 2015,

2 min Read

మాక్స్ చంద్ర.. ఈ పేరు విచిత్రంగా ఉండడమే కాదు.. ఆ పేరు గల వ్యక్తి కూడా అసాధారణమే. తల్లి ఇండియన్, తండ్రి జర్మన్.. ఇతను పుట్టింది జర్మనీలో. మాక్స్ చంద్ర చిన్నతనమంతా యూకేలో గడిచింది. 2005వరకూ ఇతనికి భారతదేశానికి రావాల్సిన అవసరం రాలేదు. అప్పుడు కూడా పశ్చిమ దేశాలకు చెందిన ఓ కంపెనీకి, ఇండియా విభాగానికి సీఈఓగా భారత్‌లో అడుగుపెట్టాడు చంద్ర.

మ్యాక్స్ చంద్ర

మ్యాక్స్ చంద్ర


బెంగళూరులో పుట్టారు చంద్ర తల్లి. అక్కడ వారి పూర్వీకులకు చెందిన ఓ ఇల్లు కూడా ఉంది. ప్రొఫెషనల్ కార్పొరేట్ కెరీర్‍‌లో ఉండడంతో.. 15ఏళ్లపాటు లండన్‌లో ఉన్న చంద్రకు... అత్యంత ఆధునిక సౌకర్యాలు, వసతులు అందుబాటులో ఉండేవి. ఇండియాలో పరిస్థితులు కానీ, తాను ఫ్యూచర్‍‌లో ఎంచుకోబోతున్న దారి గురించి కానీ, కనీసం ఆలోచన కూడా లేదు చంద్రకు ఆ సమయంలో. ఒకసారి వచ్చి, తిరిగి లండన్ వెళ్లిన వెంటనే... భారత్‌లో సెటిలయ్యేందుకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు చంద్ర. కొన్నేళ్లపాటు గోవాలో నివాసం ఉన్నారు.

“ఇంకేదైనా మరింతగా చేయాలనే తపన, ఆలోచన ఉండేవి నాకు ఆ సమయంలో. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నడకను మార్గంగా చేసుకోవాలని అనుకున్నాను.”

బహుదూరపు బాటసారి మ్యాక్స్

బహుదూరపు బాటసారి మ్యాక్స్


నడవడం అంటే అదోదే పదులో, వందలో కిలోమీటర్లు కాదు. ఏకంగా 20వేల కిలోమీటర్లు. వింటానికే అమ్మో అనిపిస్తున్నా... చంద్ర నడవాలని నిర్ణయించుకున్న లక్ష్యం ఇదే. ఇప్పటికి ఐదేళ్లుగా నడుస్తూనే ఉన్నారీయన. తాను ఏ దేశానికి చెందిన వారసుడో... ఆ దేశంలోని పలు ప్రాంతాల ప్రజల కష్టాలను కొంతైనా తీర్చే లక్ష్యంతో నడస్తున్నారు చంద్ర. 'వన్ స్టెప్ ఎట ఏ టైం ఛారిటబుల్ ఫౌండేషన్'పేరుతో.. ఓ స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశారు చంద్ర. పేదరికంలో మగ్గిపోతున్న ప్రజలకు కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రాజెక్టులు చేపడుతుంది ఈ సంస్థ.

“నేను నా కోసం నడవడం లేదు. మన దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలను ప్రపంచానికి తెలియచెప్పడమే నా ఉద్దేశ్యం. ఒక మార్పునకు నాంది పలికేందుకు, రాబోయే తరానికి వీలైనంత మంచి చేసేందుకు.. ఈ స్వచ్ఛంద సంస్థ తగినంత కృషి చేస్తుంది,” అని చెప్పారు చంద్ర.

image


సుదీర్ఘ నడక ప్రయాణం ప్రారంభం

20వేల కిలోమీటర్లపాటు నడవాలన్న ప్రయాణాన్ని, పలు దఫాలలో పూర్తి చేయాలని నిర్ణయించకున్నారు చంద్ర. మొదట కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా... గోవా నుంచి చెన్నైకి 1875 కిలోమీటర్లపాటు ప్రయాణించారు. ఈ దూరాన్ని పూర్తి చేసేందుకు చంద్రకు 70 రోజులు పట్టింది.

తన లాంగ్ జర్నీలో.. రెండో వాయిదాగా చెన్నై నుంచి కోల్కతాకు బయల్దేరారు. అయితే... 403కి.మీ. ప్రయాణించాక.. హఠాత్తుగా రోడ్డుపై కుప్పకూలిపోయారు. అప్పుడు ఇద్దరు విద్యార్ధులు వారి బైక్‌పై హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సమయానికి ఆస్పత్రికి చేర్చకపోతే... తన రెండు కిడ్నీలు చెడిపోయి ఉండేవని డాక్టర్లు చెప్పారని తెలిపారు చంద్ర. ఒక కిడ్నీలో మొదలైన కణితి... విపరీతంగా నడుస్తుండడంతో పెరిగిపోయేదని అన్నారు.

గ్రామీణులకు వాటర్ వీల్స్ అందించిన మ్యాక్స్ చంద్ర

గ్రామీణులకు వాటర్ వీల్స్ అందించిన మ్యాక్స్ చంద్ర


మూడో విడత వంద రోజుల్లో 2,361 కి.మీ. నడిచారు చంద్ర. గోవా నుంచి మొదలై... పశ్చిమ తీరం గుండా... దక్కన్ పీఠభూమిని దాటుకుంటూ... రాజస్థాన్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది ఈ యాత్ర. ఇప్పటివరకూ తాను చేసిన సుదూర నడక ప్రయాణాల్లో... అత్యంత ఒంటరి ప్రయాణం ఇదేనంటారు చంద్ర. ఇది పూర్తయ్యేపాటికి తన బరువు 20కిలోలు తగ్గిపోయిందని కూడా తెలిపారు.

నడకలో నాలుగో భాగంగా... ఢిల్లీ నుంచి మొదలయ్యి రిషికేష్, సిమ్లా, మనాలి మీదుగా.. లెహ్ వరకూ వెళ్లి, తిరిగి ఢిల్లీకి వచ్చారు చంద్ర. ఈ రూట్లో 1546కి.మీ. ప్రయాణం చేశారు. ఇప్పటివరకూ మొత్తం 6వేల 152కిలోమీటర్ల దూరం నడిచిన ఈయన. 77.5కోట్ల అడుగులు వేశారు. మొత్తం 15రాష్ట్రాలను చుట్టారు. ప్రతీ దశ తర్వాత కొన్ని నెలలపాటు రెస్ట్ తీసుకుని, ఆరోగ్యం కుదుటపర్చుకుని తన యాత్రను కొనసాగిస్తున్నారు ఈయన. ఆయా ప్రాంతాలకు తాను ఏం చేయగలరో.. ముందుగానే ప్లానింగ్ చేసుకుని యాత్రకు సిద్ధమవుతారు.

image