కాలిపోయిన ట్యూబ్‌లైట్లను మళ్లీ వెలిగిస్తున్న మన నిజామాబాద్ చారి !!

0

స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా! స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా. ఈ మూడు ప్రధాని మోడీ జనం ముందుకు తెచ్చిన కార్యక్రమాలు. ఈ మూడింటిని కలిపి ఒకే సంస్థలో చూపిస్తున్నాడు మన నిజామాబాద్ జిల్లా వాసి నర్సింహాచారి. సరికొత్త ఆవిష్కరణ తో అందినీ ఆలోచింపజేస్తున్నాడు. కాలిపోయిన ట్యూబ్ లైట్ లలో తిరిగి వెలుగులు నింపుతూ ఔరా అనిపిస్తున్నాడు.

సాధారణంగా ఇళ్లల్లో ట్యూబ్‌లైట్లు కాలిపోతే అది బయట పారేసి కొత్తవి తెచ్చుకుంటాం. కానీ, నర్సింహచారి కనుగొన్న ఫార్ములతో ఇకపై కాలిన ట్యూబ్‌లైట్లను పారేయనక్కరలేదు. వాటిని మళ్లీ రెండేళ్లపాటు వెలిగేలా చేసుకోవచ్చు! ట్యూబ్‌లైట్‌కు చౌక్‌ను, స్టార్టర్‌ ను తీసేసి.. ఓ చిన్న పరికరాన్ని అమర్చుకుంటే చాలు. మరో రెండేళ్ల పాటు ట్యూబు గ్యారంటీ. అంతేకాదు కరెంటు బిల్లు కూడా సగానికి సగమే వస్తుంది. 

నిజానికి మాడిపోయిన ట్యూబ్‌లైట్లలో మిగిలిపోయిన పాదరసం (మెర్క్యురీ) పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ట్యూబ్‌లను మళ్లీ ఉపయోగించుకునేలా చేస్తే.. అందులోని పాదరసాన్ని పూర్తిగా ఖర్చు చేస్తే.. అటు పర్యావరణానికి మేలు- ఇటు పైసలూ ఆదా. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థలో టెక్నికల్‌ డైరెక్టర్‌, శాస్త్రవేత్త అయిన నరసింహాచారి దీన్ని ఆవిష్కరించారు.

చారి ఫార్ములా

ట్యూబ్ లైట్ల వ్యర్థాల నుంచి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో ఈ యువ శాస్త్రవెత్త చేసిన కృషి ప్రపంచ మేథావులను అబ్బురపరచింది. చారి చేసిన ఈ ప్ర‌యోగంపై జాతీయంగా, అంత‌ర్జాతీయంగా పెటెంట్ కూడా పొందారు. చారి ఫార్ములా పరికరాలను అమర్చి మళ్లీ వెలిగించే ప్రక్రియను మొదటి విడతగా తెలుగు రాష్ట్రాల్లోని అమలు చేస్తున్నామని నరసింహాచారి అంటున్నారు.

‘‘ముందుగా పాడైపోయిన ట్యూబ్ నుంచి చౌక్, స్టార్టర్లను తొలగించాలి. ట్యూబ్‌లైటు పిన్నులకు అమర్చే ప్లగ్‌లకు కనుగొన్న పరికరం వైర్లను రెండువైపులా కలపాలి. తర్వాత ప్లగ్‌ను సాకెట్లో పెడితే చాలు. ట్యూబ్‌ ఆటోమేటిగ్గా వెలుగుతుంది’’ చారి

ఒక్క ట్యూబ్‌లైట్‌తో ఐదెకరాలు కలుషితం

ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుల ప్రకారం, పాడైపోయిన ఒక ట్యూబ్‌లైట్లో కనీసం 5 మిల్లీగ్రాముల పాదరసం ఉంటుంది. ట్యూబ్‌లైట్‌ పగిలిపోతే.. అందులోని పాదరసంతో కనీసం ఐదారు ఎకరాల భూమి కలుషితమై, సారం కోల్పోతుంది. ఇదే పాదరసం, 22,685 లీటర్ల నీటిని కూడా కలుషితం చేస్తుంది. అలా కావొద్దనే ఈ ఫార్ములా కనిపెట్టానంటాడు చారి. పర్యావరణ సమతౌల్యం కాపాడ్డానికి మనిషిగా ఎంతోకొంత సాయం చేసిన వాళ్లమవుతాం అనేది చారి ఉద్దేశం. అదీగాక ప్రతి గ్రామంలోని కొందరు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని అంటున్నారాయన

“కన్నతల్లిలాంటి భూమాతను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది,” చారి

భవిష్యత్ ప్లాన్

ఇదొక్కటే కాదు.. చారి మరిన్ని ఇన్నోవేటివ్ ఐడియాలను తీసుకొస్తానంటున్నారు. కరెంట్ ఆదాచేసే మార్గాలను కనుగొంటానంటున్నారు. ఫండింగ్ వస్తే ప్లాంట్ లను ఏర్పాటు చేస్తామంటున్నారు. తద్వారా లక్షల్లో ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని చెప్తున్నాడు. తనతో కలసి వచ్చే స్వచ్ఛంద సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చారి అంటున్నాడు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik