ఐఎఎస్‌కు ఎంపికైన అభ్యర్థి అనుభవం ఎలా ఉంటుంది ?

ఐఎఎస్‌కు ఎంపికైన అభ్యర్థి అనుభవం ఎలా ఉంటుంది ?

Saturday September 26, 2015,

3 min Read

అహర్నిశలు చదవి దేశంలో అత్యున్నత ఉద్యోగం సాధిస్తే… యూపీఎస్సీ- సీఎస్సీ పరీక్షల్లో ఎంపికైన వారి జాబితాలో పేరు ఉంటే ఆ ఆనందమే వేరు. ఫతితాల తర్వాత జూలై, ఆగస్టు రెండు నెలలు విశ్రాంతి… దాన్ని హనీమూన్ పీరియడ్ అని అనుకోవచ్చు. స్థానికులు మనల్ని సెలబ్రిటీలుగా చూస్తారు. మీడియా వెంటబడుతుంది. కుటుంబ సభ్యులు ప్రశంసల జల్లు కురిపిస్తుంటారు. పొరుగింటివారు, బడిలో చదువు చెప్పిన ఉపాధ్యాయులు, చివరకు మీ పాత గాళ్ ఫ్రెండ్స్ కూడా క్యూ కడతారు. ఇదీ అవకాశవాదానికి దర్పణం పట్టినట్లుగానే ఉంది. మీ ప్రాధమ్యాలను నిర్దేశించుకునేందుకు అవకాశమిస్తుంది.

image


అంతలోనే సెప్టెంబరు వచ్చేస్తుంది. జీవితం మారిపోతుంది. రెండు సంవత్సరాల ట్రైనింగ్. మొదటి వంద రోజులు 100రోజులు ఒక ప్రాధమిక శిక్షణను అందిస్తాయి. సివిల్ సర్వీసులో ఏ విభాగం వారికైనా ఈ వంద రోజుల శిక్షణ తప్పనిసరి. ఎవరూ గొప్పవాళ్లు కాదన్నది మేము నేర్చుకున్న తొలి పాఠం. పై నుంచి కింది స్థాయి వరకూ ప్రభుత్వోద్యోగులెవరైనా సరే అందరినీ గౌరవంగా చూడాల్సిందే. ఉద్యోగ బాధ్యతలో ఈ అంశం చాలా కీలకం.

చట్టం, మేనేజ్మెంట్, అకౌంటింగ్, చరిత్ర, రాజకీయాలు, అర్ధశాస్త్రం బోధనాంశాలు. ఈ అంశాలపై ప్రముఖులతో ఉపన్యాసాలు ఇప్పిస్తారు. రఘురామరాజన్, గోపాలకృష్ణ గాంధీ, శోభా డే, గురుచరణదాస్, టామ్ ఆల్టర్, నచికేత్ మోర్, తుషార్ గాంధీ, సమంతా బెనర్జీలు మాకు ప్రత్యేకంగా ఉపన్యాసాలిచ్చిన వారిలో ఉన్నారు. 

ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే దేహదారుఢ్యాన్ని సమతౌల్యంగా ఉంచే చర్యలూ ఉంటాయి. ప్రతీ రోజు ఉదయం వ్యాయామం తప్పనిసరి. సెప్టెంబరులోని ప్రతీ శనివారం ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం మూడు గంటలలోపు పర్వతారోహణ చేయించేవారు. ఇందులో18-22 కిలోమీటర్ల దూరం నడవటం లేదా పర్వతారోహణ చేయాల్సివచ్చేది. కొండల్ని ఎక్కాలంటే మనల్ని మనం దూషించకుంటాం కానీ, పైకి చేరుకున్న తరువాత అక్కడి అందాలు కనువిందుచేస్తుంటే ఆ ఆనందమేవేరు.

కెంటీ జలపాతాలను, ముస్సోరీలోని బెనాగ్ హిల్స్, రక్తాన్ని పీల్చే జలగలకు పేరొందిన లాల్‌టిబా హిల్స్‌ను సందర్శించాం. నేను అరకిలో ఉప్పును మీద చల్లుకున్నా ఒక జలగ నన్ను వదలకుండా అలాగే పట్టుకుని వుంది.

మా బ్యాచ్ చేసిన ఉత్తరకాశీ యాత్ర జీవితంలో మరపురాని అనుభవం. వారంరోజుల పాటు హిమాలయాల్లో ట్రెకింగ్ చేశాం. 90 కిలోమీటర్ల దూరం నడిచాం, పురుగుల పట్టిన ఆహారం తిన్నాం. టెంట్లలో పడుకున్నాం. 4500 అడుగుల ఎత్తులో రెండురోజులపాటు గడిపాం. వాస్తవంగానూ, ఉపమానంగానూ అదే మా అత్యున్నత శిఖరం. ఇంత సుదీర్ఘ ప్రయాణం తరువాత మాకు విశ్రాంతే దొరకలేదు. ఎందుకంటే అసైన్‌మెంట్లు సమర్పించాలి. వ్యాసాలు రాయాలి. పుస్తక సమీక్షలు నిర్వహించాలు. 2014 అక్టోబరు 22న మధ్యంతర పరీక్షలకు సిద్ధమయ్యాం..

శిక్షణలో అత్యంత ప్రధానమైన ఘట్టం పరీక్షల తర్వాతే మొదలైంది. మమ్మల్ని ఒక గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే ఉండి దైనందిన జీవితంలో గ్రామీణులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోవాలన్నారు. మొరాదాబాద్ దగ్గరి కందేర్పూర్ గ్రామానికి ఒక గ్రూప్ వెళ్లింది. అది కొంచెం అభివృద్ధి చెందిన గ్రామమే అయినా సున్నిత ప్రదేశం. ఆధునిక వసతుల్లేని ఊళ్లో ఎలా ఉండాలిరా దేవుడా అని ఆందోళన చెందాం. అయితే అదే మాకు కనువిప్పుకు అవకాశమిచ్చింది.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ పాఠశాలలు, పంచాయతీ పనితీరును చూశాం. అర్థం చేసుకున్నాం. పంటలు వేసే పద్ధతిని అడిగి తెలుసుకున్నాం. భూములన్నీ చెరకు, వరి పంటలతో పచ్చగా కనిపించాయి. దుర్భర దారిద్ర్యంలో ఉన్నవారితో గడపడం, కనీస వసతుల కోసం వారి పడే పాట్లు చూడటంతో భవిష్యత్తులో మా బాధ్యత ఏమిటో తెలిసొచ్చింది. వైద్య విద్యార్థిగా 2011లో దయాల్పూర్ గ్రామానికి వెళ్లిన అనుభవం గుర్తుకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి ఆ ఊరు 50 కిలోమీటర్ల దూరమే. పేదల సమస్యలను వైద్య సదుపాయాల ద్వారా కాకుండా సరైన వసతులు కల్పించడం, పౌష్టికాహారం అందించడం ద్వారానే పరిష్కరించే వీలుంటుందని అప్పుడే నాకు అర్థమైంది. ఆ అనుభవమే నన్ను ఐఏఎస్ వైపు లాగింది. జీవితం వృత్తాకారంలో మొదటి కొచ్చింది.

చివరగా నేను చెప్పదలచుకున్నదొక్కటే. ముస్సౌరీలోని ఎల్బీఎన్ఎస్ఎఎలో శిక్షణ నాకెంతో ఉపకరించింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విధానాల రూపకల్పనలో… ప్రజా సమస్యల పరిష్కారంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్రను చూస్తే గర్వంగా ఉంటుంది. ఆర్థిక విధానాలు, సామాజిక సమస్యల పరిష్కారం ద్వారా ఆధునిక భారతావనికి పునాదులు వేశారు.

ఈ ప్రకియ ఇంతటిలో ఆగదు. మేము వారి బాధ్యతను చేపట్టాలి. బాధ్యతాయుతంగా, దేశ భక్తితో ముందుకు సాగాలి…

రచయిత గురించి

రోమన్ సైనీ 2014 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. తన బ్యాచ్ లో అతి పిన్న వయస్కుడు. ఆయన ఏయిమ్స్ లో వైద్య విద్య పూర్తిచేశారు. యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే వారి ప్రయోజనార్థం యూఎన్ అకాడెమీ అనే పోర్టల్ లో ఎడ్యుకేషన్ వీడియో రూపొందించారు..

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి