కీర్తి ఎందరికో స్ఫూర్తి

-రాజస్థాన్ లో బాల్యవివాహాలు అడ్డుకునే యోధురాలు-ముక్కుపచ్చలారని పిల్లలకు పెళ్లేంటని నిలదీస్తున్న ధైర్యశాలి

0

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇంకా ఎక్కడో ఒక చోట కట్టుబాట్ల పేరిట దురాచారాలు, దురాగతాలు కొనసాగుతునే ఉన్నాయి. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బాల్యవివాహాల పేరుతో అరాచకం రాజ్యమేలుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అక్కడే చైల్డ్ మ్యారేజెస్ సంఖ్య ఎక్కువ. అన్నెంపున్నెం ఎరుగని పసిపిల్లల మెడలో బలవంతపు పసుపుతాళ్లు ఉరితాళ్లుగా మారుతున్నాయి. పుణ్యభూమిగా చెప్పుకునే ఈ దేశంలో ఈ పాపకార్యాలేంటి? పసిపిల్లలకు పెళ్లిళ్లు చేసే దుష్టసాంప్రదాయానికి తెరపడదా? చట్టాలు, సెక్షన్లు ఉన్నా ఆటవిక సంస్కృతికి అడ్డుకట్ట వేయలేమా?

పసివాళ్ల పాలిట దైవం

28 ఏళ్ల కీర్తి భారతి ఆలోచనలు అవే. అభంశుభం తెలియని పసివాళ్లను పెళ్లి పేరుతో మెడలో ఉరితాడు బిగించే దుష్టసంప్రదాయానికి చరమగీతం పాడాలనుకున్నారు. తనకు తెలుసు. ఈ సామాజిక చైతన్య ఉద్యమంలో ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో! చంపేస్తామంటూ వందలమంది బెదిరించారు. అయినా కీర్తి భారతి భయపడలేదు. అడ్డొచ్చేవారిని కోర్టుకీడ్చింది. నయాన్నో భయాన్నో చెప్పి చూస్తుంది! మాగ్జిమం మంచిమాటలతోనే మారుస్తుంది. కాదూ కూడదంటే కోర్టుదాకా వెళ్తుంది. ఇలా బాల్య వివాహాలను అడ్డుకోవడంతోపాటు- బాలికలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 29 బాల్య వివాహాలను అడ్డుకుని, 850 మందికి పైగా బాలికలకు పునరావాసం కల్పించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు కీర్తి.

బాల్యమంతా బాధలే

కీర్తి భారతి బాల్యం ఏమంత సాఫీగా లేదు. ఎన్నో కష్టాలు అనుభవించారు. తండ్రి ఓ డాక్టర్. కానీ కీర్తి కడుపులో ఉండగానే అమ్మానాన్న విడిపోయారు. కీర్తిని కడుపులో చంపేయాలని ఆమె తల్లి తరపు బంధువులను బలవంతం చేశారు. అబార్షన్ చేయించుకుని, రెండో పెళ్లి చేసుకోవాలని కీర్తి తల్లికి సూచించారు. పుట్టిన తర్వాత కూడా కీర్తి పరిస్థితేమీ మెరుగపడలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగింది. దీంతో ఆమె చాలాకాలం పాటు చదువుకు దూరమైంది. పూర్తిగా కోలుకున్న తర్వాతగానీ స్కూల్కు వెళ్లలేకపోయింది. ప్రస్తుతం ఆమె చిన్నారుల సంక్షేమం, రక్షణ అంశంలో పీహెచ్డీ చేస్తున్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవడంతోపాటు రాజస్థాన్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కీర్తి ఒక పోరాటయోధురాలు. ఆరువేల మంది పిల్లలకు, 5,500 మంది మహిళలకు పునరావాసం కూడా కల్పిస్తున్న పుణ్యాత్మురాలు.

ఎందుకింత ఘోరం?

ఇండియాలో బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం. కానీ జరుగుతున్నదేంటి? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 40 శాతం చైల్డ్ మ్యారేజెస్ మనదేశంలోనే జరుగుతున్నవి. చిన్న వయసులోనే బాలికలకు బలవంతంగా పెళ్లి చేయడం, ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడం. చాలాచోట్ల సర్వ సాధారణమైపోయింది. ముక్కుపచ్చలారని వయసులో పెళ్లి చేయడంతో పిల్లలు పుట్టే సమయంలో బాలికలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కొన్నిచోట్ల అప్పుడే పుట్టిన పసికందుల ఉసురు తీస్తున్నారు. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చదువు, భవిష్యత్ అంతా ఆగమ్యగోచరంగా తయారవుతోంది.

అడ్డుకోవడమే కాదు ఆదుకోవడం కూడా

ఈ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడాలనే కీర్తి 2011లో సారథి ట్రస్ట్ను ప్రారంభించారు. సంస్థ ఏకైక లక్ష్యం మహిళలకు సామాజిక న్యాయం జరిగేలా చూడటమే. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసే ప్రయత్నంలో చాలాసార్లు తన ప్రాణాలను పణంగా పెట్టారు. సంస్థ బాధ్యత కేవలం బాల్య వివాహలను అడ్డుకోవడమే కాదు, ఆ తర్వాత వారికి మరింత మెరుగైన జీవితాన్ని ప్రసాదించడం కూడా వారిపనే. సారథి ట్రస్ట్ బాలికలకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నది. ఆ తర్వాత ఆ వారిలో ధైర్యం నింపేందుకు రిహాబిలిటేషన్ వంటివి కూడా చేపడుతున్నవి.

అంత ఈజీ కాదు

బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం అంత సులభమైన పనికాదు. సదరు కుటుంబాన్ని మొదటగా కీర్తి, ఆమె బృందం కలిసి పెళ్లివద్దని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. దానివల్ల జరిగే అనార్థాలను వివరిస్తుంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు కీర్తి బృందం చెప్పే మాటలకు కన్విన్స్ అవుతున్నారు. పెళ్లికొడుకు కుటుంబాన్ని కూడా కలిసి బాల్యవివాహాల వల్ల నష్టాలను వివరిస్తారు. కాకపోతే గ్రామ పెద్దలను ఒప్పించడమే అన్నిటికంటే కష్టం. భవిష్యత్లో జరిగే నష్టాలకంటే వారు గ్రామసంప్రదాయాలు, పరువుకే పెద్ద పీట వేస్తారు.

బెదిరింపులకు భయపడే రకంకాదు

అన్ని సందర్భాల్లో బాల్య వివాహాలను అడ్డుకోవడం అంత సులభం కాదు. కీర్తి బృందంపై అనేకసార్లు దాడులు కూడా జరిగాయి. చాలా సార్లు కోర్టు దాకా వెళ్లారు. చంపేస్తామంటూ వందకుపైగా బెదిరింపులు కూడా వచ్చాయి. చేసేది గొప్ప పని అయినప్పుడు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడను అంటున్నారు కీర్తి. నిజానికి రాజస్థాన్లో బాల్య వివాహాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. తొమ్మిది నెలల వయసున్న ఓ బాలికకు తొమ్మిదేళ్ల కుర్రాడితో పెళ్లి చేశారు. పెళ్లయిన విషయం అమ్మాయికి యుక్త వయసు వచ్చేదాకా గానీ తెలియదు. ఒకసారి ఒక అమ్మాయి తనకు చిన్నప్పుడే పెళ్లయిందని తెలుసుకుని సారథి ట్రస్ట్ను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు కీర్తిని బెదిరించారు. పెళ్లి విషయంలో జోక్యం చేసుకుంటే శాల్తీ లేచిపోద్దని వార్నింగ్ ఇచ్చారు. కానీ కీర్తి భయపడలేదు. సరికదా రెండు కుటుంబాలను ఒప్పించి మరీ ఆ పెళ్లిని రద్దు చేయించారు.

ఒప్పిస్తుంది మెప్పిస్తుంది

కీర్తి బృందం రెండు విధాలుగా పనిచేస్తుంది. ఓ బ్యాచ్ ఎప్పుడూ న్యాయపద్ధతిలో బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరో బృందం బాల్య వివాహాల నుంచి బయటపడ్డ బాలికలకు పునరావాసం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు కృషిచేస్తుంది. చదువు, వృత్తివిద్యలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటివి చేస్తారు. గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పల్లెల్లో సదస్సులు, ఆర్గనైజింగ్ క్యాంపులు నిర్వహిస్తుంది సారథి ట్రస్ట్. గ్రామాల్లోని అంగన్ వాడీల్లో నిర్వహించే సదస్సుల్లో బాల్య వివాహాల గురించి చర్చలు చేపడుతారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తారు. పిల్లలకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఆ సమస్యలను ఎదుర్కొన్న వారి అనుభవాలను చెప్పిస్తారు. ఈ సామాజిక దురాచారాన్ని అడ్డుకునేందుకు సహకరించాలని యువతులను కోరుతుందీ బృందం. రాష్ట్రంలో ఎక్కడ బాల్య వివాహాలు జరుగుతున్న తెలిపే విధంగా ఓ హెల్ప్ లైన్‌ కూడా ఏర్పాటు చేసిందీ ట్రస్ట్.

కీర్తి ఎందరికో స్ఫూర్తి

కీర్తి చేస్తున్న పని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. బెదిరింపులకు లొంగకుండా, ధైర్యంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కీర్తిని ఎన్నో అవార్డులు వరించాయి. ఇటీవలే బ్రిటీష్ గవర్నమెంట్ ఫెల్లోషిప్, థామ్సన్ రాయిటర్స్ కార్పొరేషన్ అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇదంతా టీమ్ వర్క్ అంటారు కీర్తి. ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి కారణంగానే రాజస్థాన్లో ప్రస్తుతం బాల్య వివాహాలకు అడ్డకట్ట పడిందని ఆమె అంటారు.

సాధించాల్సింది చాలా ఉంది

సారథి ట్రస్ట్ ఇప్పటివరకు 29 బాల్య వివాహాలను రద్దు చేయించింది. ఈ అద్భుతమైన కృషికి గాను కీర్తి పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు చేసుకుంది. ఆమె స్ఫూర్తిధాయకమైన స్టోరీని సీబీఎస్ఈ విద్యా ప్రణాళికలోనూ చేర్చారు. ఇంత సాధించినా కీర్తి పొంగిపోలేదు. ఇంకా ఎంతో సాధించాల్సి ఉందని- తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని అంటారు.