97 ఏళ్ల నానమ్మాళ్ చేసే యోగా చూస్తే సాహో అంటారు

97 ఏళ్ల నానమ్మాళ్ చేసే యోగా చూస్తే సాహో అంటారు

Wednesday April 26, 2017,

1 min Read

70 ఏళ్లు వస్తే హరే రామ అంటూ మూలకు పడిపోయే రోజులివి. అలాంటిది 97 ఏళ్ల వయసులో ఓ బామ్మ తన సొంత పనులు చేసుకోవడమే కాదు.. ప్రఖ్యాత యోగా టీచర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మీటర్ తోలు, కొన్ని ఎముకలు తప్ప ఏమీ లేని ఆ దేహం ఇప్పటిదాకా కొన్ని వేల మందికి యోగా నేర్పింది. ఆ బామ్మ పేరు నానమ్మాళ్.

image


నానమ్మాళ్ దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్. రోజుకి కొన్ని వందల మందికి యోగా నేర్పుతుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్లు ఆమె దగ్గర నేర్చుకుంటారు. నానమ్మాళ్ తండ్రి కూడా యోగా చేసేవారు. అతను మార్షల్ ఆర్టిస్ట్ కూడా. నానమ్మాళ్ పొద్దున లేవగానే అరలీటర్ నీళ్లను పరిగడుపున తాగుతుంది. ఇప్పటికీ పళ్లు తోమడానికి వేపపుల్లనే వాడుతుంది. ఎక్కడికి వెళ్లినా కొన్ని వేప పుల్లల్ని వెంటబెట్టుకుంటుంది. 

పాలు, తేనె, పళ్ల లాంటి పౌష్టికాహారమే తీసుకుంటుంది. పెళ్లయినా యోగాని ఆపకపోవడానికి కారణం అది నా జీవితంలో భాగం కావడమే అంటారామె. అదే నా ఆరోగ్య రహస్యం అని చెప్తారు. సొంత పొలంలో ఎరువుల్లేకుండా వాడిన ఆర్గానిక్ కూరగాయలనే తింటామని నానమ్మాళ్ తెలిపారు.

ఇటీవలే కోయంబత్తూరులో 20వేల మందికి యోగా నేర్పి గిన్నిస్ బుక్ రికార్డు అటెంప్ట్ చేశారు. ప్రస్తుతం తన ఆశయమల్లా ఒకటే. మహిళలు, చిన్నారులకు యోగా పట్ల చైతన్యం తేవాలి. సకల రోగాలకు యోగానే దివ్యౌషధం అని అన్ని విద్యాసంస్థలు గుర్తించాలి. పెళ్లయిన తర్వాత కూడా యోగాని వదలిపెట్టొద్దనేది నానమ్మాళ్ నమ్మిన సిద్ధాంతం. నానమ్మాళ్ ప్రతిభ, ఆమెకు యోగపట్ల ఉన్న అభిరుచిని చూసి, ప్రపంచ వ్యాప్తంగా యోగా క్లాసులు చెప్పమని పిలుపొచ్చింది. కానీ ఆమె కాదని చెప్పారు. కారణం ఇంగ్లీష్ తెలియకపోవడం.

నానమ్మాళ్ దగ్గర నేర్చుకున్న వారిలో సుమారు 600 మంది ప్రపంచ వ్యాప్తంగా యోగా గురువులుగా పేరు సంపాదించారు. ఆమె బంధువుల్లో 36 మంది యోగాని సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు.