ఈ ప్రొఫెసర్ తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

ఈ ప్రొఫెసర్ తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

Wednesday October 19, 2016,

2 min Read


దేశంలో ఎంతమంది మహిళలు నెలసరి సమయంలో సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు?

 గ్రామీణ భారతంలో ఎంతమందికి ప్యాడ్స్ మీద అవగాహన ఉంది? 

ఈ ప్రశ్నలకు జవాబు ఇప్పట్లో ఊహించడం కలే! 

సరే, ఎంతోకొంతమంది రుతుస్రావంలో ప్యాడ్స్ వాడుతున్నారు? అయితే, అవి ఎంతవరకు సురక్షితమైనవి? వాటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు వస్తాయి? ఈ విషయంలో మాత్రం కచ్చితంగా అవగాహన లేదనే చెప్పాలి? బ్రాండెడే కదా.. కంపెనీ మంచిదే కదా... అని గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ వాటివల్ల కేన్సర్ వంటి భయంకరమైన రోగాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయనే విషయాన్ని గుర్తించడం లేదు. ఇంకా వళ్లు గగుర్పొడిచే వాస్తవం ఏంటంటే.. కెమికల్ యాడెడ్ ప్యాడ్స్ వాడటం వల్ల సంతానోత్పత్తి కూడా తగ్గిపోతుంది.

అందుకే.. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీర్స్ బృందం దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. మహిళలు నెలసరి సమయంలో వాడే ప్యాడ్స్ కోసం ఒక జాలికతో కూడిన ఫెమినైన్ హైజీన్ ప్రాడక్ట్ తయారు చేసింది. ఈ శానిటరీ ప్యాడ్స్ లో సూపర్ అబ్సార్బెంట్ పాలిమర్స్ అన్నమాటే ఉండదు. చెప్పాలంటే ఫెమినైన్ హైజీన్ సెక్టార్లో ఇదొక శాశ్వత విప్లవాత్మక మార్పు.

ఐఐటీ హైదరాబాద్, కెమికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంటులో పనిచేస్తున్న ప్రొ. చంద్రశేఖర శర్మ, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మీదనే తలమునకలై ఉన్నారు. మహిళలకు అంత్యంత సురక్షితమైన పాడ్స్ ఇవ్వాలన్నదే ప్రాజెక్ట్ ప్రధానోద్దేశం. ఈ తరహా ప్యాడ్స్ తయారీలో తడిని త్వరగా పీల్చుకునే స్వభావం కలిగిన ఎలక్ట్రోస్పన్ సెల్యులోజ్ జాలికలను మెటీరియల్ గా వాడుతున్నారు. నానో ఫైబర్స్ తో కూడిన మెటీరియల్ వాడటం వల్ల ఎలాంటి హాని కలగదు. సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ నాన్ బయో డీ గ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లే. పైగా వాటిపై నమ్మకం, నాణ్యత కూడా అంతంతమాత్రమే. శానిటరీ నాప్కిన్ అంటే వాడి పడేసేది. కానీ నాసిరకం నాప్కిన్‌ వాడి పడేసిన తర్వాత అది అంత ఈజీగా డిస్పోజ్ అవదు. ప్లాస్టిక్ లాంటి భూతమై భూమిపై మిగిలిపోతోంది.

image


అందుకే మహిళల బాధల్ని అర్ధం చేసుకుని సురక్షితమైన నాప్కిన్లకు శ్రీకారం చుట్టామంటున్నారు ప్రొ. శర్మ. కమర్షియల్ గా దొరికే ప్యాడ్లలో అనేక రకాల వ్యాధి కారకాలుంటాయి. కంటికి కనిపించని బాక్టీరియా ఫామ్ అవుతుంది. క్రమంగా ఇన్ ఫెక్షన్ వస్తుంది. అది దీర్ఘకాలంలో కేన్సర్ కు దారితీసే ప్రమాదముంది. కానీ నానో ఫైబర్ బేస్డ్ నాప్కిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ లేవంటారు. అత్యంత సురక్షితమైనది అని నమ్మకంతో చెప్తున్నారు ప్రొఫెసర్ శర్మ.

రుతుస్రావం సమయంలో మహిళలకు నాప్కిన్లు అంత్యంత అవసరం. ఏదో ఒకటిలే అనే భావన చాలామందిలో ఉంది. సర్దుకుపోవడమే కొంప ముంచుతుందని చాలామందికి తెలియదు. ఏమాత్రం నాణ్యత లేని నాప్కిన్లతో చాలా డేంజర్. దీర్ఘకాలికంగా రోగాలబారిన పడుతుంటారు. ఎంతగా అంటే.. నాసిరకం వాడటం వల్ల ఏకంగా సంతానోత్పత్తి మీదనే ప్రభావం చూపుతుంది. పైగా అవన్నీ పెట్రోలియ్ బేస్డ్ ప్రాడక్టులు కావడంలో హానిచేసే రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి. –ప్రొ. శర్మ.

ఈ నాప్కిన్ తయారీలో టెక్నాలజీ ఉపయోగించడమే కాదు.. ఆరోగ్యంపై ఏమాత్రం దుష్ప్రభావం చూపకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పర్యావరణానికి హాని తలపెట్టకుండా కూడా ప్యాడ్స్ డిజైన్ చేస్తున్నారు.