గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను దాటగలమా? అక్కడ స్టార్టప్స్ పెట్టగలమా?

Thursday March 03, 2016,

5 min Read


చైనా... అదో క్లోజ్డ్ సొసైటీ… ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార అవకాశాలను ఒడిసిపట్టుకుని సంపన్న దేశంగా మారినా… ఆ దేశంలో విదేశీ కంపెనీలు ఎంటరవ్వడం అంత ఈజీకాదు. బస్సు, కారు, ఫోన్ లాంటి చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలు కూడా చైనీయులు అర్థం చేసుకోలేరు. మామూలు వాళ్లకేకాదు … ప్రభుత్వ అధికారులు, కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ విషయంలోనూ అంతే. ఏం మాట్లాడాలన్నా చైనీస్ లోనే. ఆ దేశ భాష రాకపోతే సినిమా షూటింగ్స్ కూడా చేయడం దుర్లబం. గైడ్లు, ట్రాన్స్ లేటర్ల కు సైతం విదేశీ భాషా పరిజ్ఞానం అంతంతమాత్రమే. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఈ దేశంలో కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కూడా ఎక్కువ. గూగుల్, ఫేస్ బుక్ లాంటి దిగ్గజాలు కూడా చైనా నుంచి నిష్క్రమించాయి.

భారతీయ మొబైల్ అడ్వర్టైజ్ మెంట్ కంపెనీ ఇన్ మొబీ లాంటి భారతీయ స్టార్టప్స్ విదేశాల్లో సత్తా చాటుతున్నా చైనాలో మాత్రం ప్రభావం అంతంతమాత్రమే. ఇప్పుడిప్పుడే అది ఎదుగుతోంది. హాస్టల్ చెయిన్ జెయింట్ జోస్టల్ 2015లో వియత్నాంలోకి ప్రవేశించింది. లాజీ నెక్స్ట్ సింగపూర్ లో సేవలందిస్తోంది. డాక్టర్ అపాయింట్ మెంట్ ప్లాట్ ఫాం ప్రాక్టో సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పపీన్స్ లో విజృంభిస్తోంది. కానీ చైనా వాల్ దాటి ఆ దేశంలోకి ప్రవేశించలేకపోతున్నాయి. ఔత్సాహిక విదేశీ పారిశ్రామికవేత్తలకు ఎంట్రీని … గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిరోధిస్తోంది. ఆంక్షలు విధిస్తోంది. అయితే ఇండియన్ స్టార్టప్స్ చైనా మార్కెట్ ను అందుకోవడం కష్టమేగానీ… హార్డ్ వర్క్ చేస్తే అదేమంత అసాధ్యం కాదు.

చైనా మార్కెట్ మన స్టార్టప్ లకు చాలా ముఖ్యం

చైనా మార్కెట్ చాలా పెద్దది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. అంతేకాదు… అక్కడ కొనుగోలు శక్తికూడా పెరిగింది. భారత్ తయారీ రంగంలో అతిపెద్ద విదేశీ పార్టనర్ కూడా చైనానే. భారత్ నుంచి చైనాకు ఎగుమతుల విలువ 14.8 బిలియన్ డాలర్లుకాగా… దిగుమతులు మాత్రం 51 బిలియన్ డాలర్లు. ఇండియన్ స్టార్టప్స్ లో పెట్టుబడులకు చైనా వెంచర్ కేపిటల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో భారత్ లో చైనా కంపెనీలు 72 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. మేక్ మై ట్రిప్ లో సీట్రిప్, స్నాప్ డీల్, పేటీఎంలో అలీబాబా, ఓలాలో డీడీ కువాది, ప్రాక్టోలో టెన్ సెంట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు చాలా చైనా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. జోమాటో, బుక్ మై షో, బిగ్ బాస్కెట్ కంపెనీల్లో బైదూ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. వచ్చే మూడేళ్లలో మైబైల్ ట్రాఫిక్, మోనిటైజింగ్ కెపాసిటీలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. తాము స్టార్టప్స్ పై దృష్టిపెట్టామని చీతా మొబైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ యో… యువర్ స్టోరీకి చెప్పారు. బిజినెస్ ను ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్లోకి మారుస్తామంటున్నారు.

undefined

undefined


చైనాలో సంపన్నవర్గం, ఎగువ మధ్యతరగతివారి సంఖ్య పెరుగుతోందని… వచ్చే పదేళ్లలో కొనుగోలు శక్తి ఇంకా పెరుగుతుందని మెకిన్సే అండ్ కంపెనీ అంచనా వేసింది. 2012లో అప్పర్ మిడిల్ క్లాస్ 12 శాతం కాగా, అది 2022నాటికి 54 శాతం కానుంది. ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న దేశం చైనా. అందుకే టెక్నాలజీ ఆధారిత కంపెనీలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా చైనాను చెప్పుకోవచ్చు.

“భారతీయుల్లాగే చైనీయులకు మొబైల్స్ అంటే పిచ్చి. మొబైల్ ఆధారిత వ్యాపారాల్లో భారత్ ను ఎప్పుడో మించిపోయింది చైనా. ఏదైనా మొబైల్ ఉపయోగించే కొనుగోళ్లు చేస్తున్నారు. చైనాలో అందరూ ఇప్పుడు మొబైల్ వాలెట్స్ ఉపయోగిస్తున్నారు. ఈ రంగానికి మంచి భవిష్యత్ ఉంది. చైనాలో ఇన్ మొబీ అతిపపెద్ద మొబైల్ అడ్వర్టైజింగ్ కంపెనీగా ఎదిగింది" జెస్సీ యాంగ్, ఇన్ మొబీ చైనా సీనియర్ వైస్ ప్రెసిడెంట్.

చైనాలో వ్యాపారానికి అడ్డంకులు

విదేశీల్లో కంపెనీలు పెట్టడం… వ్యాపారం చేసుకోవడమేగానీ… తమ దేశంలోకి విదేశీ కంపెనీలను అంత త్వరగా ఆహ్వానించదు చైనా. ప్రపంచ వ్యాప్తంగా మంచిపేరున్న అమెరికా కంపెనీలు సైతం చైనాలో అపసోపాలు పడ్డాయి. కొన్ని కంపెనీలు … డ్రాగన్ కంట్రీకి దండంపెట్టి వెనక్కి వెళ్లిపోయాయి. యాపిల్, ఉబర్, స్టార్ బక్స్ లాంటి కంపెనీలు చైనాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీదీ కువాది అనే కంపెనీ దెబ్బకు ఉబర్ ఏడాదికి బిలియన్ డాలర్లు నష్టపోతోంది. ప్రభుత్వ నియంత్రణ, సెన్సార్ షిప్ కూడా చైనాలో ఎక్కువే. సెన్సార్ షిప్ ను తట్టుకోలేక 2010లో గూగుల్ చైనా నుంచి నిష్క్రమించింది. ఆ స్థానాన్ని బైదూ అనే చైనా సెర్చింజన్ భర్తీ చేసింది. వాట్సప్ ది కూడా ఇదే స్టోరీ. ఆ స్థానంలో వి చాట్ అనే కంపెనీ వచ్చింది. 2009 లోనే ఫేస్ బుక్ ను చైనా నిషేధించింది. చైనా చట్టాలను గౌరవిస్తూ లింక్డ్ ఇన్ మాత్రం విజయం సాధించగలిగింది.

స్టార్టప్ లైనా బడా కంపెనీలైనా చైనా చట్టాలను గౌరవిస్తేనే అక్కడ మనగలుగుతాయి. 2013లో ముంబైకి చెందిన లాజీ నెక్స్ట్ కంపెనీ చైనాలో ప్రవేశించింది. ఆ కంపెనీ వ్యవస్థాపకులు ద్రువిల్ సింఘ్వీ, మనీషా రైజింగ్ హనీ చైనా మార్కెట్ పై స్టడీ చేసేందుకు ఆ దేశం వెళ్లారు. అక్కడివారికి ఇంగ్లీష్ రాకపోవడం, కనీసం గూగుల్ మ్యాప్స్ కూడా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. షాంఘైలాంటి విశ్వనగరంలోనూ ఆంగ్లం అర్థం చేసుకోలేకపోతున్నారు. 

undefined

undefined


చైనాకు విదేశీ కంపెనీల అవసరం లేదా?

చైనాలో ఈ కామర్స్ మనకన్నా పదిరెట్లు ఎక్కువ. మన దగ్గర ఈ-కామర్స్ ఒక్కశాతమే… కానీ చైనాలో పది శాతం. అలీబాబా ఈ కామర్స్ కంపెనీల్లో అతిపెద్దది. అమెజాన్ కన్నా రీచ్ ఎక్కువ. చైనాలో వి చాట్ యాప్ ను 65 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. అది వాట్సప్ తో పోటీపడుతోంది. చైనా స్టార్టప్ ల్లో సేవాభావం ఎక్కువంటున్నారు అలెక్స్ హో. అమెరికాలో కన్నా చైనాలోనే ఆన్ లైన్ మార్కెట్ ఎక్కువ. అంతేకాదు చైనా టెక్ కంపెనీల ఆపరేషనల్ ఎబిలిటీస్ కూడా ఎక్కువే.

చైనాలో ఇండియన్ స్టార్టప్స్ కు… కన్జ్యూమర్ ఇంటర్నెట్ బిజినెస్ అంత అనుకూలం కాదు. ఎందుకంటే ఆ దేశ కంపెనీలు వేగంగా చొచ్చుకుపోతున్నాయి. బీజింగ్ కు చెందిన చీతా మొబైల్స్ కంపెనీ చైనాలోనే కాదు విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. దీనికి 70 శాతం కస్టమర్లు విదేశీయులే. అయితే చైనాలో స్టార్టప్ లు పెట్టేవారికి తక్కువ వేతనాలకే ఉద్యోగులు దొరుకుతారు, ఐడియా ఉండాలేగానీ ఫండింగ్ సమస్య ఉండదు. చైనీయుల అలవాట్లు భారతీయులకన్నా భిన్నంగా ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టాలంటున్నారు వన్ ప్లస్ కంపెనీ సీఈఓ పీటె లూ. భిన్నమైన ఆలోచనలతో మందుకొస్తేనే మార్కెట్లో నిలబడగలరంటూ ఆయన సలహానిస్తున్నారు.

స్టార్టప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎంత అభివృద్ధి చెందినా చైనీయులు సంస్కృతి, వారసత్వాన్ని మరిచిపోరు. అధికార క్రమాన్ని గౌరవిస్తారు. ఆర్డర్స్ ఏమైనా పైనుంచి రావాల్సిందే అంటారు. వాటి ఆధారంగా కిందివారు పనిచేసుకు పోతారని ఇండ్ మొబీకి చెందిన జెస్సీ యాంగ్ అంటున్నారు. క్వాలిఫైడ్ రిసోర్సెస్, టెక్ సపోర్ట్ కు చైనాలో ఢోకా లేదు. మన దేశానికి చెందిన యాడెడ్ స్పోర్ట్ కంపెనీ చైనాలో కాలుమోపి విజయవంతమయ్యింది. మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ లాంటి దేశాల్లోనూ విస్తరించింది. చైనీస్ పార్ట్ నర్స్ తో కలిసి వ్యాపారం చేస్తే ఆ దేశంలో ఈజీగా సక్సెస్ సాధించవచ్చంటున్నారు యాడెడ్ స్పోర్ట్ వ్యవస్థాపకుడు అక్షయ్ మాలివాల్. చైనాలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి… దాన్ని సరైన మార్గంలో వినియోగించాలి. చైనా వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవాలని ఆయన చెబుతున్నారు. లోకల్ టాలెంటును, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు ఇన్ మొబి వ్యవస్థాపకులు.

“ జాయింట్ వెంచర్ వేయాలి. చైనాలో ఇప్పటికే మంచి పేరున్న కంపెనీతో టై అప్ అవ్వాలి. లోకల్ టాలెంట్ ను ఉపయోగించుకోవాలి. జాయింట్ వెంచర్ వల్ల చైనా మార్కెట్ ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇండిపెండెన్స్ ను కొంతమేర కోల్పోవాల్సి ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలంటే లైసెన్స్ కోసం అప్లై చేయాలి. ఆర్నెల్లు పట్టవచ్చు. ఇది కొంత శ్రమతో కూడుకున్నది. చైనా కంపెనీతో ఒప్పందం పెట్టుకుంటే… పని తేలికగా అవుతుంది. చైనాలో తక్కువ వేతనాలకే పనిచేసేవారు దొరుకుతారు- జెస్సీ యాంగ్

భారత్ లో కన్జ్యూమర్ మార్కెట్- చైనాలో గతంలో కన్జూమర్ మార్కెట్ ఒకేలాంటివనేది ఐడీజీ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ ప్రభాకర్ అభిప్రాయం. చైనా కంపెనీలతో పోల్చితే మన కంపెనీలు వ్యూహాలు రచించడంలో కాస్త వెనుకబడే ఉన్నాయంటున్నారు. చైనాలో ఆర్నెల్లకోసారి అభిరుచులు మారిపోతాయని… అందుకే పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలంటున్నారు అలెక్స్ యో.

చైనాలో నెట్టుకురాగలమా..?

చైనాలో సంప్రదాయాలు, సిద్ధాంతాలకు ఎక్కువ విలువనిస్తారు. బిజినెస్ ప్లాన్ పక్కాగా ఉంటే… చైనా అద్భుతమైన మార్కెట్ అంటున్నారు పీటె లూ. వరల్డ్ లీడర్స్ గా ఎదగాలనుకునే కంపెనీలకు చైనా ఒక చక్కని అవకాశం అంటున్నారు. చైనా కల్చర్ ను ముందుగా అర్థం చేసుకోవాలి. సాస్ బేస్డ్ సొల్యూషన్స్ కు చైనాలో మంచి మార్కెట్టే ఉంది.

భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మౌలిక సదుపాయాలు, ఇంటర్నెట్, ఈ కామర్స్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న కంపెనీలు విజయం సాధించడం భారత్ లోనూ అంత తేలికకాదు. భారత్ వినియోదగారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ. మొత్తం వినియోగంలో ఇది 70 శాతానికి సమానం. ఆన్ లైన్ మార్కెట్ కూడా పెరుగుతోంది. త్వరలో మరో పదికోట్ల మంది భారతీయులు ఆన్ లైన్ మార్కెట్లోకి వస్తారు. అందుకే చైనా కన్నా భారతీయ మార్కెట్టే బెటరంటున్నారు నిపుణులు. 

అంతర్జాతీయంగా ఎదగాలనుకునే కంపెనీలే … చైనాలోకి ఎంటరవ్వాలి. చైనాలో ఇప్పుడంతా ఆన్ లైన్ వ్యాపారమే. స్మార్ట్ ఫోన్ లేని చైనీయుడులేడంటే అతిశయోక్తికాదు. ఆర్డర్స్ అన్నీ వాటిలోనుంచే వస్తున్నాయి. కాబట్టి… మొబైల్ బేస్డ్ వ్యాపారాలకు అనువైన దేశం చైనా.