దేశంలో తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు..? దీనికి పరిష్కారమే లేదా?

దేశంలో తాగునీటి కష్టాలు ఇంకెన్నాళ్లు..? దీనికి పరిష్కారమే లేదా?

Saturday March 18, 2017,

3 min Read

ఇంటర్నేషనల్ జర్నల్ సైన్సెస్ అడ్వాన్సెస్ నివేదిక ప్రకారం ఏడాదిలో దేశ ప్రజలు కనీసం నెలరోజులైనా 80 శాతం నీటి ఎద్దటిని ఎదుర్కొంటారు. ముఖం చాటేసిన రుతుపవనాల మూలంగా గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ రానంత కరువు గత ఏడాది వచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నీటి కటకట ఏర్పడింది.

మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఛత్తీస్ గఢ్‌, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తో ఒడిషాతో కలిపి 11 రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. మరాఠ్వాడా, లాతూర్ లో పొయిన ఏడాది తాగునీటి కోసం జనం ఎంతగా అల్లాడిపోయారో ఆ సీన్ ఇంకా కళ్లముందే ఉంది. గుక్కెడు మంచినీళ్లకే దిక్కులేని దుస్థితి. ఇక వ్యవసాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రైతులు కాడి వదిలేసి పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలసపోయారు.

image


ఉదాహరణకు మహారాష్ట్రనే చూసుకుంటే, అక్కడ పొయిన ఏడాది తీవ్ర దుర్భిక్షం నెలకొంది. వాస్తవానికి దేశంలోనే ఎక్కడా లేనన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం సాగునీటి రంగం కోసం పెడుతున్న ఖర్చు కూడా ఎక్కువే. కానీ ఏం లాభం. వర్షాభావ పరిస్థితుల వల్ల 18 శాతం భూమి కూడా సాగులోకి రాలేదు.

ఇండియన్ హౌస్ హోల్డ్ డెవలప్మెంట్ సర్వే లెక్కల ప్రకారం ప్రతీ 4 కుటుంబాల్లో ఒక ఫ్యామిలీ తాగునీటి కోసం బిందె పట్టుకుని అరగంట పాటు కాలినడకన వెళ్తున్నారు. అలా ఒక ఇంట్లో వంతుల వారీగా నీటికోసం నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎంతో ప్రయాస పడి అంతంత దూరంనుంచి బిందెల్ని, క్యాన్లనీ మోసుకొస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీళ్లు మోసుకుని రావడం కోసమే ఇద్దరు భార్యల్ని చేసుకుంటున్నారు. పట్టణాల్లోనూ పరిస్థితిలో మార్పేమీ లేదు. ఐహెచ్‌డీఎస్ సర్వే ప్రకారం 20 శాతం అర్బన్ ప్రజలు నీటికోసం అరగంట పాటు నడుస్తున్నారు.

అయితే, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం చెప్తున్న వివరాల ప్రకారం పల్లె ప్రాంతాలకు సరిపడా తాగునీటి సౌకర్యాలు లేవు. పాలకుల పట్టనితనం మూలంగా వారికి కనీసం బోరింగులు, నల్లాల కనెక్షన్ కూడా లేదు. వాళ్లు కేవలం ఓటు బ్యాంకుగా మారారే తప్ప, కనీసం తాగునీటికి కూడా నోచుకోలేదు. చాలామటుకు భూగర్భ జాలల మీదనే ఆధారపడ్డారు. ఇటు తాగునీటికీ, సాగునీటికీ గ్రౌండ్ వాటరే దిక్కయింది. కేంద్ర భూగర్భ జలాల బోర్డు నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా బావుల్లో 64 శాతం నీరు తగ్గిపోయింది. దాని మూలంగా బావుల్ని మరింత లోతుకు తవ్వాల్సి వచ్చింది. ఫలితంగా పర్యావరణం మీద ప్రభావం పడింది.

2016లో వాటర్ ఎయిడ్ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో 75.8 మిలియన్ల మందికి సురక్షిత తాగు నీరు లేదు. దీనికి తోడు నీటి మాఫియా రెచ్చిపోయింది. డిమాండుని బట్టి రేటుని అమాంతం పెంచేసింది. దాని ఫలితమే గత ఏడాది మరాఠ్వాడా దుస్థితి. అక్కడ తాగునీటికి ఎంత కష్టమొచ్చిందో మనకందరికీ తెలిసిందే.

గత 50 ఏళ్లలో తలసరి నీటి లభ్యత 3వేల క్యూబిక్ మీటర్ల నుంచి 1,123 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. అక్రమ ఇసుక మైనింగ్, నీరు అధికంగా అవసరమయ్యే పంటల సాగు, కలుషితమైన నీటి వనరులు, భూగర్భ జలాల దోపిడీ, నీటిని నిల్వచేసే పరికరాల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం.. వెరసి దేశవ్యాప్తంగా నీటికి కొరతకు కారణమయ్యాయి. తాగునీటికి, వ్యవసాయానికి, పారిశ్రామిక, ఇతరాత్రా అవరాలకు సరిపడా నీరు లేకపోవడంతో డిమాండ్ సప్లై మధ్య అంతరం ఏర్పడింది. ఏడాదిలో నెలరోజులు 80 శాతం భారతదేశ ప్రజల నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడతారని ఇటీవలే ఇంటర్నేషనల్ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే దీర్ఘకాలికంగా జనం ఇంకెంత ఇబ్బంది పడతారో అర్ధం చేసుకోవచ్చు.

నీటి ఎద్దడికి నివారణకు ఒక్కటే మార్గం. ఎవరికి వారు వ్యక్తిగతంగా నీటి ఆదా మీద శ్రద్ధ తీసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్. అక్కడ చాలా గ్రామాలు సాంప్రదాయ పద్ధతిలో వాటర్ హార్వెస్టింగ్ విధానాన్ని విజయవంతంగా చేపడుతున్నాయి. ఇంకుడు గుంతల ద్వారా వాన నీటిని ఒడిసిపడుతున్నారు.

ఉత్తర కర్నాటకలోని అనేక గ్రామాల్లో దేశ్ పాండే ఫౌండేషన్ అనే ఒక అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ నీర్ సించా అనే కార్యక్రమం ద్వారా దాదాపు 1,700 చెరువులను పునరుద్ధించింది. వాటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. ఆ నీటితో ఐదెకరాల్లో ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్వల్ప కాలిక పంటల్ని పండించవచ్చు.

జల సంరక్షణకు మరో ఉదాహరణ అయ్యప్ప మాసగి. ఆయన్ని వాటర్ డాక్టర్ అని కూడా పిలుస్తారు. ఏపీలోని అనంతపురం లాంటి కరువు పీడిత ప్రాంతాలకు అయ్యప్ప దేవుడు. 3 చెరువులు, 25,000 చిన్న చిన్న గోతులు తవ్వి కురిసే ప్రతీ వర్షపు బొట్టని ఒడిసిపట్టాడు. అంతేకాదు చుట్టుపక్కల చెట్ల పెంపకం కూడా చేపట్టారు. తనతోపాటు వాన నీటి సంరక్షణకు ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తాడు.

నీటి వనరులు, వాటి విధివిధానాలు ఎలాగూ ఉన్నప్పటికీ, నీటిని సంరక్షించుకోవడమనేది ప్రతీ ఒక్కరి బాధ్యత. దాని పట్ల అందరికీ అవగాహన ఉండాలి. ఏ ఒక్కరిద్దరో చేస్తే అయ్యేది కాదు. సమష్టి బాధ్యత . సమాజంలో మార్పు వస్తే ఆటోమేటిగ్గా రాజకీయంగా కూడా మార్పు అనివార్యం అవుతుందనేది అయ్యప్ప నమ్మిన సిద్ధాంతం.

చీకటిని తిడుతూ కూర్చుంటే లాభం లేదు. ఎవరో ఒకరు దీపం వెలిగించాలి. ఆ దారిలో పదిమందీ నడవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలూ ప్రభుత్వాలు ముందుకు రావాలి.