హైదరాబాద్ అందాలను గగనతలం నుంచి చూడాలనుందా..!

Tuesday March 01, 2016,

2 min Read


హైదరాబాద్ - ఆకాశహార్మ్యాలు చారిత్రక కట్టడాల కలబోత!

హైదరాబాద్- సుందర తటాకాలు.. మరులుగొలిపే ఉద్యానవనాల విరిజాత!!

హైదరాబాద్- ఒకవైపు చారిత్రక వైభోగాలు. మరోవైపు ఆధునిక హంగులు..!!

ఇంత అందమైన భాగ్యనగరాన్ని గగనతలం నుంచి వీక్షిస్తే ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి..!!

ఆ అందమైన ఊహల్ని నిజం చేస్తోంది తెలంగాణ టూరిజం..!!

హైదరాబాదును విశ్వనగరంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా టూరిజం శాఖ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాదీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హెలీ టూరిజం అందుబాటులోకి వచ్చింది. నెక్లెస్ రోడ్ లో మంత్రి కేటీఆర్ హెలి టూరిజాన్ని ప్రారంభించారు. టాంక్ బండ్, అసెంబ్లీ, బిర్లామందిర్, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్ ను జాయ్ రైడ్ లో చుట్టి రావొచ్చు.

undefined

undefined


మక్కామసీదు ముందు నిలబడి చార్మినార్ ను చాలాసార్లు చూసుంటారు. ఎంత సేపు చూసినా తనివితీరని అపురూప కట్టడమది! కానీ అదే చార్మినార్ ను ఆకాశంలో విహరిస్తూ చూస్తుంటే.. కుతుబ్ షాహీల అద్భుత నిర్మాణ కౌశలం అబ్బురపరుస్తుంది. ఆకాశానికి బాహువులు చాపినట్టుగా ఉండే మినార్ల మీదుగా పక్షిలా ఎగిరిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పక్కనే ఉండే సాలార్ జంగ్ మ్యూజియం ధవళకాంతుల్లో ధగధగా మెరిసిపోతున్న తీరుని మీ కంటి రెటినా సెకనుకో దృశ్యాన్ని క్యాప్చర్ చేసి గుండె లోలోతుల్లో పదిలపరుస్తుంది.

జంటనగరాలకు మణిహారమైన హుస్సేన్ సాగర్ ను ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా చూసి ఉండరు! టాంక్ బండ్ ని అంతెత్తు నుంచి వీక్షిస్తుంటే మానస సరోవరం కాళ్ల కింద కదలాడినట్టుగా మరులు గొలుపుతోంది. సాగరహారంలా సొబగులు అద్దుకున్న నెక్లెస్ రోడ్.. దారి పొడవునా ఆకుపచ్చ తోరణాలు అలంకరించినట్టుగా హొయలుపోతోంది. అసెంబ్లీ భవనం, ఆ పక్కనే రవీంద్రభారతి. ఇక పాలరాతి బిర్లామందిర్ సోయగాన్ని నేలమీది నుంచి చూసింది వేరు.. ఆకాశమార్గం నుంచి చూసిన అనుభూతి వేరు.

గండశిలల మీద గంభీరంగా ఉండే శత్రుదుర్భేద్యమైన గోల్కొండ కోటను మామూలుగా అయితే తలపైకెత్తి చూస్తాం.. అచ్చెరువొందుతాం. కానీ అదే కోటను గగనతలం నుంచి చూస్తే ఎంత నయనానందకరంగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. కోటలోని పచ్చిక బయళ్లు, దుర్గమదుర్గాలు, తలవాల్చి చూస్తే కలిగే అనుభూతే వేరు. రాచకొండ రాజసాన్ని చూస్తూ.. రామోజీ ఫిలింసిటీ, ఉద్యానవనాల మీదుగా వెళ్తుంటే దేవలోకాన పుష్పక విమానంలో విహరించిన ఫీలింగ్ కలుగుతుంది! సువిశాలంగా మెలికలు తిరిగి అల్లంత దూరాన నల్లటి తారుమీద తెల్లటి చారికలతో నిగనిగలాడుతూ ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంటే- హైదరాబాద్ లోనే ఉన్నామా బ్యాంకాక్ లో ఉన్నామా అనిపిస్తుంది!

undefined

undefined


360 డిగ్రీల్లో భాగ్యనగర వైభోగాన్ని కళ్లారా చూస్తుంటే మనసు చిన్నపిల్లాడిలా గంతులేస్తుంది. ఒళ్లంతా దూదిపింజలా తేలిపోతుంది. ఒకరోజంతా తిరిగినా తనివి తీరని భాగ్యనగరాన్ని ఇరవై నిమిషాల్లో పక్షిలా చుట్టేయడమంటే జన్మకు సరిపడా మధురానుభూతి. హెలికాప్టర్ నుంచి కాలుకింద మోపాక గానీ, మళ్లీ ఈ లోకంలోకి వచ్చినట్టు తెలియదు! ఈ దృశ్యాల గురించి చదువుతుంటే.. ఎప్పుడెప్పుడు జాయ్ రైడ్ చేద్దామా అనిపిస్తోంది కదా.. మరి లేటెందుకు.. తెలంగాణ టూరిజం మీకోసమే హెలికాప్టర్ సిద్ధం చేసింది. లోహ విహంగం మీద కూచొని భాగ్యనగర అందాలను తిలకించండి!!