వీళ్లు మాటలతో యంత్రాన్ని నడిపిస్తారు..!!

వీళ్లు మాటలతో యంత్రాన్ని నడిపిస్తారు..!!

Saturday January 09, 2016,

5 min Read

మాటే మంత్రం అంటారు. నోరున్న వాడిదే ఊరు అని కూడా అంటారు. అంటే మాటలు ఎంత శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతీ కెరీర్ రేస్ లాంటిది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్లే ఈ రేస్ లో ముందుంటారన్నది నిస్సందేహం. మాటలకున్న శక్తిపై ప్రగాఢ విశ్వాసం ఉన్న యూనిఫోర్ సంస్థ... మనుషులకు, యంత్రాలకు మధ్య పరస్పర సంభాషణను డెవలప్ చేస్తూ కొత్త విప్లవానికి తెరతీసింది. ఎలాంటి సాఫ్ట్ వేర్ అప్లికేషన్ అయినా సరే... మనుషుల మాటల్ని అర్థం చేసుకొని స్పందించేలా వీళ్లు సొల్యూషన్స్ అందిస్తున్నారు. దీని వల్ల మనుషులు సహజమైన పద్ధతులతో యంత్రాల పనితీరును నిర్దేశించొచ్చు. యూనిఫోర్ ప్రస్థానం తెలుసుకుందాం...

image



ఏడేళ్ల క్రితం... అప్పటికీ స్మార్ట్ ఫోన్ శకం ప్రారంభం కాలేదు. మిత్రులైన ఉమేష్ సచ్ దేవ్, రవి సరోగిలకు ఓ విజన్ ఉండేది. గ్రామీణ ప్రాంతాల వారి కోసం ఓ మొబైల్ ప్రొడక్ట్ తయారు చేయాలన్న లక్ష్యం ఉండేది. అదెలా ఉండాలంటే ఓ విప్లవానికి నాంది పలకాలి. తమిళనాడులోని పలు జిల్లాల్లో పర్యటించి స్పీచ్ అనలిటిక్స్ సాఫ్ట్ వేర్ పైలట్ ప్రాజెక్ట్ రూపకల్పన కోసం కృషి చేయడం మొదలుపెట్టారు. అనుకున్నంత సులువు కాలేదు. చాలా సమస్యలొచ్చాయి. తర్వాత కొన్ని విషయాలు అర్థమయ్యాయి. తక్కువ అక్షరాస్యత, బహుళ మాండలికాల ప్రాబల్యం ఎక్కువని గుర్తించారు. వీరికి నమూనా తయారు చేయడానికే సంవత్సరకాలం పట్టింది. కానీ ఐడియా వినూత్నంగా ఉండటంతో నమూనా తయారైన నెలలోనే లక్ష డాలర్ల సీడ్ ఫండింగ్ రావడం విశేషం. అలా పవర్ ఆఫ్ స్పీచ్ ను విప్లవాత్మకంగా మార్చింది. ఏ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ అయినా మనుషుల మాటలను అర్థం చేసుకోవడంతో పాటు స్పందించేలా తీర్చిదిద్దారు.

"ప్రతీ కస్టమర్ సర్వీస్ లో వాయిస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మేం తెలుసుకున్న క్షణం మాకు యురేకా మూమెంట్. యంత్రాలను వాడటం కస్టమర్ ఎంగేజ్ మెంట్ లో భాగమని మేం తెలుసుకున్నాం. అప్పుడు మెషీన్స్ భాషను అర్థం చేసుకొని, ప్రాసెస్ చేసి, మనుషుల మాటలకు స్పందించేలా సర్వీసును రూపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం"- ఉమేష్.

ఎలా మొదలైందంటే..?

2008లో ఐఐటి మద్రాస్ లో ఇంక్యూబేటెడ్ కంపెనీగా యూనిఫోర్ ప్రారంభమైంది. థామ్సన్ రాయిటర్స్ వీరి తొలి క్లైంట్. రాయిటర్స్ మార్కెట్ లైఫ్ పేరుతో రైతుల కోసం థామ్సన్ రాయిటర్స్ అందిస్తున్న సర్వీస్ గురించి ఓ ఆర్టికల్ చదివారు వీరిద్దరు. ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారాన్ని అందించేందుకు థామ్సన్ రాయిటర్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ లో పలు సమస్యలొచ్చాయి. రైతులతో సమాచారాన్ని పంచుకునేందుకు ఎస్ఎంఎస్ సరైన మాధ్యమం కాదని అర్థమైంది. ఎందుకంటే... గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం తక్కువ.

"మేము మాటలు, భాష గుర్తింపుపై ప్రధానంగా దృష్టి పెట్టడానికి ఇదే కారణం. ఆర్టికల్ చదివిన తర్వాత లింక్డిన్ ద్వారా రాయిటర్స్ కు చెందిన ఆర్ఎంఎల్ ను సంప్రదించా. ఆ తర్వాత యూనిఫోర్ సొల్యూషన్ టీమ్ వారిదగ్గరకు వెళ్లి సర్వీసును వివరించింది. సరిగ్గా రెండు నెలల్లో ఆర్ఎంఎల్ యూనిఫోర్ మొదటి కస్టమర్ అయింది. ఇక అప్పట్నుంచీ వెనక్కి తిరిగి చూడలేదు" -ఉమేష్.

ఏడేళ్లు... ఏడు సవాళ్లు...

ఏడేళ్లుగా యూనిఫోర్ వేర్వేరు స్థాయిల్లో సవాళ్లను ఎదుర్కొంది. తొలి రోజుల్లో టీమ్ ని బిల్డ్ చేసుకోవడం, బిజినెస్ ను విస్తరించుకోవడంపైనే దృష్టి పెట్టారు. థామ్సన్ రాయిటర్స్ ను తొలి క్లైంట్ ను సాధించిన తర్వాత... సర్వీసును ఎలా అందించాలన్నదే ప్రధాన ఆందోళన. కోట్లాది మంది రైతులు ఈ సర్వీసును ఉపయోగించుకుంటే... మీరెలా మేనేజ్ చేస్తారని రాయిటర్స్ వాళ్లు అడగడంతో ఆందోళన మరింత పెరిగింది. అప్పటికి యూనిఫోర్ బుడిబుడి అడుగులు వేస్తున్న కంపెనీ. సేల్స్ ఆపరేషన్స్ పై దృష్టి పెట్టడం, మార్కెటింగ్ ప్రాసెసెస్ పెంచుకోవడం, బలమైన వ్యవస్థ రూపొందించుకోవడం ద్వారా సవాల్ ను అధిగమించారు. తొలి పది కస్టమర్లు వచ్చాక 50 మందిని టార్గెట్ చేసుకున్నారు.

"ఈ రోజుల్లో సరైన టాలెంట్ ను అందుకోవడం సవాల్. ఇప్పుడు అతిపెద్ద టాలెంట్ వార్ జరుగుతోంది. కంపెనీ కోసం సరైన టాలెంట్ ను ఎంచుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో పాటు నిధులు సాధించడం, సరైన ప్రాసెసెస్ ఏర్పాటు చేసుకోవడం, సరైన సీనియర్ టీమ్ ను నియమించుకోవడం కూడా సవాలే" - ఉమేష్.

ప్రస్తుతం ఈ కంపెనీ స్పీచ్ అనలిటిక్స్, వాయిస్ బయోమెట్రిక్స్, వర్చువల్ అసిస్టెంట్ సొల్యూషన్స్ పేర్లతో మూడు రకాల సర్వీసులు అందిస్తోంది. యూనిఫోర్ కు 70 ఎంటర్ ప్రైజ్ కస్టమర్స్ ఉండగా 40 లక్షల మంది ఎండ్ యూజర్లున్నారు. 2015 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వారి స్పీచ్ అనలిటిక్స్ సాఫ్ట్ వేర్ auMinaకు దేశంలో ఆరు పైలట్ ప్రాజెక్టులతో విశేషమైన మార్కెట్ ఉంది. వీటిని త్వరలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. వీరి ఉత్పత్తులకు ఫిలిప్పీన్స్, యూఏఈలో మంచి ప్రశంసలు అందాయి.

మూడు ప్రొడక్ట్ సొల్యూషన్స్

1.auMina(Speech Analytics): ఇది స్పీచ్ అనలిటిక్స్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్. సంస్థ విధానాలకు తగ్గట్టుగా ఏజెంట్ల జ్ఞానాన్ని, ప్రవర్తనను, అమ్మకాల నైపుణ్యాలెలా ఉన్నాయో అప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడే సాఫ్ట్ వేర్ ఇది. అంతే కాదు... ఖర్చులు తగ్గిస్తుంది. సమయాన్ని ఆదాచేస్తుంది. లాభాలను పెంచుతుంది. ఈ సాఫ్ట్ వేర్ భారతదేశంతోపాటు ఇతర దేశాల 25 భాషలను వివిధ మాండలికాల్లో సపోర్ట్ చేస్తుంది.

2. amVoice (Voice Biometrics): ప్రతీ ఒక్కరి వాయిస్ ప్రింట్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా నమ్మకమైన యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసేలా చూస్తుందీ సొల్యూషన్. ఆర్థిక లావాదేవీలకు పిన్స్, పాస్ వర్డ్స్ అవసరం లేని సర్వీసిది. ఇది కూడా ఖర్చు తగ్గిస్తుంది. దాంతో పాటు పాస్ వర్డ్స్, పిన్స్ లాంటి సున్నితమైన వివరాలను ఇతరులకు పంచుకోవడం లాంటి రిస్కులు తగ్గిస్తుంది. ఇది ఏ మొబైల్ నుంచైనా రిమోట్ వెరిఫికేషన్ చేసే అవకాశం కల్పిస్తుంది. కేవలం 15 సెకన్లలోనే వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

3. Akeira (Virtual Assistant): ఇది కాంటాక్ట్ సెంటర్ల కోసం యునిఫోర్ రూపొందించిన 24x7 వర్చువల్ అసిస్టెంట్ సొల్యూషన్. వినియోగదారులను వారి భాషలోనే ప్రశ్నలు అడిగేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా కావాల్సిన సమాధానాలను రాబట్టుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 25 భాషల్లోని 150 మాండలికాలను సపోర్ట్ చేస్తుంది. ఇది కస్టమర్ కేర్ ఖర్చులను తగ్గిస్తుంది.

"ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవడానికి సంస్థలు వెనుకంజ వేస్తుండటం సహజం. అయితే ఇదే మాకు అతిపెద్ద సవాల్ గా మారింది. మా ఉత్పత్తులను అమ్ముకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. అయితే మేము... ట్రై అండ్ బయ్ విధానంతో ఈ సమస్యను అధిగమించాం" - ఉమేష్.

భవిష్యత్ ప్రణాళిక

ప్రస్తుతం వీరి కోర్ టీమ్ లో ఉమేష్ సీఈఓ. సింగ్యులరీస్ టెక్నాలజీస్ కో-ఫౌండర్ కూడా. రవి సరోగి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఈయనకూ రెండో వెంచర్ ఇది. సంజీవ్ గాడ్రే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ప్రపంచవ్యాప్తంగా అడోబ్, స్యూబెక్స్, అరిసెంట్, వెరిఫోన్ ఇండియా, విప్రో లాంటి సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల మార్కెటింగ్ లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. రామ్ సుందరం కోర్ టెక్నాలజీ డైరెక్టర్. మైక్రోసాఫ్ట్, బ్రాడ్ కామ్ లాంటి ప్రముఖ కంపెనీల్లో 15 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉంది. రోహిత్ మహేశ్వరీ ప్రొఫెషనల్ సర్వీసెస్ హెడ్. సొల్యూషన్స్ కన్సల్టింగ్, బిజినెస్ డెవలప్ మెంట్, సేల్స్, ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ రంగాల్లో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఇలా అనుభవజ్ఞులైన టీమ్ తో కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం యూనిఫోర్ 14 భారతీయ భాషలతో కలిపి 25 ప్రపంచ భాషల్లో వందలాది మాండలికాల్లో సేవలందిస్తోంది. సొల్యూషన్స్ ని SaaS (Software as a Service) సబ్ స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ లో అందిస్తోందీ కంపెనీ. క్రిస్ గోపాలక్రిష్ణన్, ఐడీజీ వెంచర్స్, ఇండియా ఏంజెల్ నెట్ వర్క్, యర్నెస్ట్ ఫండ్, స్టాటా వెంచర్స్ ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. యూనిఫోర్ ఇటీవల బెంగళూరులో కొత్త ఆఫీసును ప్రారంభించింది. పదిహేను నెలల్లో మరో వంద మందిని చేర్చుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం వీరికి ఇండియా, ఫిలిప్పీన్స్, దుబైలో ఆఫీసులున్నాయి. త్వరలో యూఎస్ లో అడుగుపెట్టాలనుకుంటున్నారు.